గౌతమ్ మీనన్.. ‘తెలుగు’ చర్చలు జరుగుతున్నాయట
గౌతమ్ మీనన్ పేరుకు తమిళ దర్శకుడే కానీ.. తెలుగులోనూ ఆయనకు కల్ట్ ఫాలోయింగే ఉంది.
By: Garuda Media | 5 Jan 2026 10:00 PM ISTగౌతమ్ మీనన్ పేరుకు తమిళ దర్శకుడే కానీ.. తెలుగులోనూ ఆయనకు కల్ట్ ఫాలోయింగే ఉంది. తొలి సినిమా ‘చెలి’ నుంచి చాలా వరకు ఆయన సినిమాలు తెలుగులోనూ రిలీజయ్యాయి. వాటిలో చాలానే విజయవంతం అయ్యాయి. తెలుగులో ఘర్షణ, ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాలు చేశారు గౌతమ్.
ఐతే తన తరం దర్శకుల్లో చాలామంది ఔట్ డేట్ అయిపోగా.. గౌతమ్ మాత్రం ఇప్పటికీ ట్రెండీగా సినిమాలు తీసే స్థాయిలోనే ఉన్నారు. కాకపోతే ఆయన నిర్మాణ సంస్థ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఇంతకుముందులా తరచుగా సినిమాలు తీయలేకపోతున్నారు. కొన్నేళ్ల ముందు శింబుతో చేసిన ‘వెందు తనిందదు కాడు’ హిట్ అయింది. మలయాళంలో మమ్ముట్టితో గత ఏడాది తీసిన ‘డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’ పర్వాలేదనిపించింది.
ఇప్పుడు గౌతమ్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. తన శైలిలో ఒక లవ్ స్టోరీ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు వెల్లడించాడు. అది చివరి దశలో ఉందన్న గౌతమ్.. తెలుగులోనూ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించాడు. తెలుగులో ఇంతకుముందే సినిమాలు చేశానని.. ఇప్పుడు అక్కడ రెండు మూడు ఐడియాల మీద డిస్కషన్ నడుస్తోందని చెప్పాడు గౌతమ్. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా గౌతమ్ ఒక సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆయన రెడీ చేస్తున్న లవ్ స్టోరీని తమిళంలో ఒక హీరోతో చేసి, తెలుగులో రోషన్‌ను హీరోగా ఎంచుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాలను ఇలాగే చేశాడు. మరోవైపు కన్నడలో ఒక సూపర్ స్టార్‌తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు గౌతమ్ వెల్లడించాడు. ఇక ఎప్పట్నుంచో విడుదలకు నోచుకోక మరుగున పడ్డ ‘ధృవనక్షత్రం’ సినిమాను బయటికి తీసుకురావడానికి జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని గౌతమ్ చెప్పడం విక్రమ్ అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.
