Begin typing your search above and press return to search.

గౌతమ్ ఎంట్రీ.. ఆ ఇద్దరు నిర్మాతల మధ్య గట్టి పోటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా అని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   19 Jan 2026 1:39 PM IST
గౌతమ్ ఎంట్రీ.. ఆ ఇద్దరు నిర్మాతల మధ్య గట్టి పోటీ!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా అని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలనటుడిగా '1 నేనొక్కడినే' సినిమాలో తన మార్క్ చూపించిన గౌతమ్, ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసీని, మహేష్ బాబు స్టార్‌డమ్‌ని ముందుకు తీసుకెళ్లే మూడో తరం వారసుడిగా గౌతమ్ ఎంట్రీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం గౌతమ్ సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. కేవలం బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని వచ్చేయకుండా, నటనలో మెలకువలు నేర్చుకోవడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నారు. ఇది పూర్తయి ఇండియాకు తిరిగి రాగానే, హీరోగా పరిచయం కావడానికి రంగం సిద్ధమవుతోంది.

అయితే ఇప్పుడు అసలు చర్చ గౌతమ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ లక్కీ ప్రొడ్యూసర్ ఎవరు అనే దానిపైనే నడుస్తోంది. ఈ రేసులో ప్రధానంగా ఇద్దరు బడా నిర్మాతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ కాగా, మరొకరు మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడైన అనిల్ సుంకర. ఈ ఇద్దరూ గౌతమ్ మొదటి సినిమాను తమ బ్యానర్‌లో నిర్మించడానికి పోటీ పడుతున్నట్లు టాక్.

గౌతమ్ ఇంకా ట్రైనింగ్‌లో ఉండగానే, ఇక్కడ టాలీవుడ్‌లో మాత్రం ఆయన డెబ్యూ కోసం నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొంది. అశ్వినీ దత్ గారికి స్టార్ కిడ్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. గతంలో మహేష్ బాబును 'రాజకుమారుడు' సినిమాతో ఆయనే పరిచయం చేశారు. అలాగే రామ్ చరణ్ (చిరుత), అల్లు అర్జున్ (గంగోత్రి) వంటి స్టార్ హీరోల మొదటి సినిమాలు కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్‌లోనే వచ్చాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం గౌతమ్‌ను కూడా ఆయనే లాంచ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది.

మరోవైపు అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల అంతే ఆసక్తిగా ఉన్నారు. మహేష్ బాబుతో అనిల్ సుంకరకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దూకుడు, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఆయన, గౌతమ్ ఎంట్రీ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంలో మహేష్ బాబు నిర్ణయం కీలకం కానుంది.

ఫైనల్ గా గౌతమ్ ఎప్పుడు వస్తాడు అనే క్లారిటీ ట్రైనింగ్ పూర్తయ్యాక వస్తుంది కానీ, ఎవరు తీసుకొస్తారు అనే దానిపై మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అంతే కాకుండా దర్శకుడు ఎవరు అనేది కూడా మరో పెద్ద టాస్క్. మంచి కంటెంట్ ఉన్న దర్శకుడి చేతిలోనే పెట్టాలని చూస్తున్నారు. ఇక నిర్మాతలలో సెంటిమెంట్ పరంగా అశ్వినీ దత్ వైపు మొగ్గుతారా లేక సాన్నిహిత్యం కొద్దీ అనిల్ సుంకరకు ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.