మహేష్ ఫ్యాన్స్ కంటే గౌతమ్ కఠినంగా ఉన్నాడే!
మహేష్ బాబు సినిమా కాస్త తేడా కొట్టినా ఓ వర్గం అభిమానులు ఏదో ఒక పాజిటివ్ పట్టుకుని మాట్లాడుతుంటారు.
By: M Prashanth | 2 Sept 2026 3:32 PM ISTమహేష్ బాబు సినిమా కాస్త తేడా కొట్టినా ఓ వర్గం అభిమానులు ఏదో ఒక పాజిటివ్ పట్టుకుని మాట్లాడుతుంటారు. కానీ ఇంట్లో ఉన్న గౌతమ్ మాత్రం ఆ లెక్కలో లేడు. అతని లెటర్‌బాక్స్డ్ ప్రొఫైల్ బయటకు రావడంతో ఇప్పుడు రేటింగ్స్ వైరల్ అవుతున్నాయి. లెటర్‌బాక్స్డ్ అంటే చూసిన సినిమాలను మెన్షన్ చేసి, రేటింగ్ స్టార్లు ఇచ్చే ఒక ప్లాట్‌ఫామ్. గౌతమ్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం 438 సినిమాలు కనిపిస్తుండగా, 418 సినిమాలకు రేటింగ్స్ ఉన్నాయి.
అసలు ట్విస్ట్ మహేష్ సినిమాల దగ్గరే ఉంది. పోకిరి, 1 నేనొక్కడినే సినిమాలకు గౌతమ్ ఫుల్ 5 స్టార్లు ఇచ్చాడు. అతడుకు 4.5, ఒక్కడు, మురారికి 4 స్టార్లు ఉన్నాయి. అదే నిజం, వంశీకి 2 స్టార్ల దగ్గర ఆపేశాడు. బ్రహ్మోత్సవంకు అయితే ఒక్క స్టార్ మాత్రమే. నాన్న సినిమా కదా అని రెండు స్టార్లు అదనంగా వేసే మొహమాటం కూడా గౌతమ్ దగ్గర కనిపించడం లేదు.
యశ్ టాక్సిక్ సినిమాకు 0.5 స్టార్ మాత్రమే ఇచ్చాడు. ఇదే రేటింగ్ ‘లైగర్’కు కూడా ఇచ్చినట్టు అతని ప్రొఫైల్‌లో ఉంది. మరోవైపు బాహుబలి 2, జెర్సీకి 5 స్టార్లు, పెళ్లిచూపులు, సీతారామంకు 4.5, ఈగకు 4 స్టార్లు ఇచ్చాడు. అంటే తెలుగు కమర్షియల్ సినిమా నుంచి చిన్న ప్రేమకథ వరకు అతని లిస్ట్‌లో అన్నీ ఉన్నాయి.
ఇక ఇప్పుడున్న సినిమాల రేటింగ్స్ చూస్తే మరింత వెరైటీ ఉంది. ఇరుముడికి 3 స్టార్లు, విశ్వనాథ్ అండ్ సన్స్కు 2.5, లోకేష్ కనగరాజ్ డీసీకి 4 ఇచ్చాడు. స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే, ది ఒడిస్సీకి 4.5 చొప్పున ఇచ్చాడు. ‘దురంధర్: ది రివెంజ్’కు 3 స్టార్లే పెట్టాడు. కాబట్టి కొత్త సినిమా అంటే హై రేటింగ్ వేసేస్తున్నాడనే లెక్క కూడా లేదు.
గౌతమ్ రేటింగ్ హిస్టరీలో ఇంకో చిన్న లెక్క ఉంది. 418 రేటింగ్స్‌లో 5 స్టార్లు ఇచ్చింది 39 సినిమాలకే. 0.5 స్టార్ ఇచ్చింది మూడు సినిమాలకు మాత్రమే. ఎక్కువగా 4 స్టార్ల దగ్గరే అతని రేటింగ్స్ ఉన్నాయి, మొత్తం 95 సినిమాలకు ఆ స్కోర్ ఇచ్చాడు. ఆ లెక్కలో చూస్తే ‘టాక్సిక్’కు వచ్చిన 0.5 అతని ప్రొఫైల్‌లోనే అత్యల్ప రేటింగ్స్‌లో ఒకటి.
అతని ప్రొఫైల్‌లో కనిపిస్తున్న ఫేవరెట్ సినిమాలు కూడా ఊహించనివి ఉన్నాయి. ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, బ్యాక్ టు ది ఫ్యూచర్ తో పాటు తెలుగు కామెడీ మ్యాడ్ కూడా ఫేవరెట్స్‌లో ఉంది. సెప్టెంబర్ 1న రాజకుమారుడు, భరత్ అనే నేనును లైక్ చేయగా, అంతకుముందు 1: నేనొక్కడినే, అతడును కూడా లైక్ చేశాడు. మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు గౌతమ్ రేటింగ్స్‌ను పట్టుకుని మరో సినిమా లిస్ట్ మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.
