మతం మారను కానీ గౌరవిస్తా!
షారుఖ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నప్పటికీ తన హిందూ మత విశ్వాసాలను వదులుకోలేదని గౌరీ ఖాన్ గతంలో వెల్లడించారు. ఇంట్లో అన్ని మతాలకూ గౌరవం ఉంటుందని, ఎవరి నమ్మకాలను వారు అనుసరిస్తారని చెప్పారు. కుమారుడు ఆర్యన్ తండ్రి మతాన్ని అనుసరించడం తొలుత ఆశ్చర్యపరిచినా అర్థం చేసుకున్నానని తెలిపారు.
By: Srikanth Kontham | 23 Nov 2026 1:48 PM ISTభర్త మతాన్ని గౌరవించడం వేరు. దాని కోసం సొంత నమ్మకాన్ని వదులుకోవడం వేరు. ఈ క్లారిటీతో దాంపత్యం దశాబ్దాలుగా నిలబడిందని గౌరీ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. షారుఖ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నా? హిందూ సంప్రదాయంపై తనకున్న బలమైన విశ్వాసాన్ని గౌరీ ఎప్పుడూ దాచుకోలేదు. ఇంట్లో ఎవరి నమ్మకాలకు వారు గౌరవం ఇచ్చుకుంటూనే సొంత గుర్తింపును కాపాడుకోవడం ఎలాగో ఆమె మాటల్లో కనిపిస్తుంది. అదే సమయంలో పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ మాత్రం షారుఖ్ ప్రభావంతో తండ్రి మతాన్నే ఎక్కువగా అనుసరిస్తాడని సరదాగా పంచుకున్న వీడియో క్లిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆర్యన్ తనను తాను ముస్లింగా చెప్పుకున్నప్పుడు తల్లిగా తొలుత ఆశ్చర్యపోయినా? ఆ పరిస్థితిని నెమ్మదిగా అర్థం చేసుకున్నానని గౌరీ వివరించారు. ఇంట్లో మతపరమైన వైవిధ్యాలకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని స్పష్టం చేసారు. షారుఖ్ మతాన్ని గౌరవిస్తానని కానీ అందుకోసం మతం మారి ముస్లింగా మారాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని తేల్చిచెప్పారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత నమ్మకాలు ఉంటాయని ఎవరి మతాన్ని వారు అనుసరించడమే సరైనదన్నారు. షారుఖ్ ఎన్నడూ మతాన్ని అగౌరవపరచలేదని నొక్కి చెప్పారు.
వేర్వేరు మతాల నేపథ్యం ఉన్నా ఇంట్లో ఆ భేదాభిప్రాయాల వాతావరణం ఎక్కడా కనిపించదని అన్ని మతాలు సమానమే అన్న ధోరణిలో కుటుంబం ముందుకు సాగుతోందని ఆ రకంగా బాద్షా ఇంట మత ప్రస్తావనే లేని సంతోషకర జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో 1984లో తొలిసారి కలుసుకున్న షారుఖ్, గౌరీలు 1991 అక్టోబర్ 25న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్రామ్ ఖాన్ సంతానం కలిగారు.
వీరిలో ఆర్యన్ దర్శకత్వం.. వ్యాపార రంగాల వైపు అడుగులు వేయగా సుహానా నటనలో రాణిస్తోంది.మరోవైపు షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం కింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇందులో షారుఖ్‌తో పాటు కూతురు సుహానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుహానా పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇంకా సినిమాలో షారుక్ మాట కాదనలేక మరికొంత మంది స్టార్ హీరోయిన్లు కూడా భాగమయ్యారు.
