నచ్చిన పాత్రలు రాకనే సినిమాలకు దూరం.. L.B శ్రీరామ్ ఎమోషనల్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర కళాకారిణి జీవిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది
By: Sivaji Kontham | 7 Oct 2026 11:47 AM ISTపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర కళాకారిణి జీవిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు, రచయిత ఎల్.బి. శ్రీరామ్ ప్రత్యేక అతిథిగా పాల్గొని తన మనసులోని భావాలను అందరితో షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎల్.బి. శ్రీరామ్ .. నటుడిగా 500 పైగా సినిమాల్లో నటించాను. ఛూజీగా ఉంటున్నాను.. అని తెలిపారు. తనకు తగినట్లుగా, నచ్చిన మంచి పాత్రలు రాకపోవడం వల్లే తాను సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదని స్పష్టం చేశారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఎలా అయితే ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాడో, అదే స్ఫూర్తితో తాను కూడా `హార్ట్ ఫిలిమ్స్` పేరుతో సొంతంగా షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టానని తెలిపారు. అలా ఇప్పటివరకు దాదాపు 60కి పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసి తనలోని నటుడిని సజీవంగా ఉంచుకున్నానని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్‌తో తనకు, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌కు ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. తమ మధ్య ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఇంతకుముందు `లగ్గం` లాంటి సినిమాలలో తమ కాంబినేషన్ కుదిరిందని.. చరణ్ అర్జున్ తన కోసం ప్రత్యేకంగా పాటలు రాయడమే కాకుండా.. తనతో లీడ్ రోల్స్ చేయించాడని గుర్తుచేసుకున్నారు. చరణ్ అర్జున్ తన మీద ఉన్న అభిమానంతో కొన్ని పాటలను తన చేత యాక్ట్ చేయించాడని.. అలా తమ మధ్య బలమైన వృత్తిపరమైన, వ్యక్తిగత అనుబంధం ఏర్పడిందని శ్రీరామ్ తెలిపారు.
అలాంటి తరుణంలో `గరివిడి లక్ష్మి` సినిమా గురించి తన వద్దకు ప్రస్తావన వచ్చిందని ఎల్.బి. శ్రీరామ్ వివరించారు. బుర్ర కథ కళాకారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గరివిడి లక్ష్మి గురువుగా ఒక కీలక పాత్ర చేయాలని, ఇది పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తోందని చెప్పినప్పుడు తనకు చాలా ఆనందమనిపించిందని అన్నారు. మన డైరెక్టర్ ఈ కథ చెప్పిన విధానం.. స్క్రిప్ట్ మీద ఆయనకున్న పట్టు.. అక్షరాక్షరం ఫ్రేమ్ ఫ్రేమ్‌ను జీర్ణించుకున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. చరణ్ అర్జున్ చెప్పాక ఇక తాను మరో మాట మాట్లాడకుండా వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు.
ఉత్తరాంధ్ర మట్టి వాసనలు అద్దిన ఈ `గరివిడి లక్ష్మి` చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒక అరుదైన కళాకారిణి జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తున్న తీరు అందులోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో ఎల్.బి. శ్రీరామ్ నటన, నేపథ్య సంగీతం, దర్శకుడి ప్రతిభ హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాతో ఉత్తరాంధ్ర కళాకారుల ప్రతిభ మరోసారి వెలుగులోకి వస్తుందని.. చిత్ర యూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.
