Begin typing your search above and press return to search.

గరివిడి లక్ష్మి బుర్రకథ.. ష‌కలక శంకర్ అద్భుత ప్రదర్శన

ప్రముఖ ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ `గరివిడి లక్ష్మి` ట్రైలర్ లాంచ్ వేడుక హైద‌రాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   6 Oct 2026 12:05 PM IST
గరివిడి లక్ష్మి బుర్రకథ.. ష‌కలక శంకర్ అద్భుత ప్రదర్శన
X

ప్రముఖ ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ `గరివిడి లక్ష్మి` ట్రైలర్ లాంచ్ వేడుక హైద‌రాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమెడియన్ షకలక శంకర్ వేదికపై ప్రదర్శించిన బుర్రకథ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అచ్చమైన శ్రీకాకుళం యాస, భాషతో పాటు బుర్రకథ ఆర్టిస్ట్ వేషధారణలో ఆయన స్టేజీపై చేసిన సందడి ప్రేక్షకులను నాటి కళా వైభవానికి తీసుకువెళ్లింది. ఆయన కామెడీ టైమింగ్, సంభాషణలు చెప్పే శైలి ఆ వేడుకను రసవత్తరంగా మార్చడమే కాక.. ఎంతో కాలంగా వెలుగు చూడని జానపద కళాకారుల వెతలను మరోసారి అందరి కళ్ళ ముందుంచాయి.

అయితే ఒకప్పుడు ఎంతో కళాత్మకంగా వర్ధిల్లిన బుర్రకథ వంటి కళలు అంతమవడానికి ప్రభుత్వాల ప్రోత్సాహం కరవవ్వడం ప్రధాన కారణమనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కళాకారులను ఆదుకోవడానికి, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రభుత్వాలు పింఛన్లు అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాట్య, జానపద, బుర్రకథ కళాకారులకు పూర్తిస్థాయి జీవనోపాధి దక్కడం లేదు. సరైన ఆధారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వేగవంతం కాకపోతే కాలగర్భంలో కలిసిపోతున్న ఇలాంటి అరుదైన కళలను కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే వేదికపై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమా రంగానికి భాషా సరిహద్దులు లేవని గొప్పగా నిరూపించారు. ఉత్తరాంధ్ర జానపద సంస్కృతికి ప్రతీక అయిన గరివిడి లక్ష్మి బయోపిక్‌కు.. తెలంగాణ బిడ్డ అయిన చరణ్ అర్జున్ సంగీతం అందించడం కళారంగ గొప్పతనాన్ని చాటుతుందన్నారు. ఇదే సందర్భంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఎదుర్కొన్న‌ నిరాశను ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీని మనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన పనిలేదని.. మనలోని టాలెంటే ఇండస్ట్రీని మన దగ్గరకు రప్పిస్తుందని ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే తనను డైరెక్టర్‌గా మార్చడంలో స్ఫూర్తిగా నిలిచిన లెజెండరీ రైటర్ ఎల్.బి. శ్రీరామ్ గారితో ఉన్న అనుబంధాన్ని హ‌రీష్‌ కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే.. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి టైటిల్ రోల్‌లో టాలెంటెడ్ హీరోయిన్ ఆనంది న‌టిస్తున్నారు. రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్.బి. శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌరీ నాయుడు జమ్ము ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

సాధారణ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలకు భిన్నంగా ఇలాంటి నేటివ్, బయోపిక్ సబ్జెక్టులను ఎంచుకోవడం నిర్మాత విశ్వప్రసాద్ ప్యాషన్‌ను తెలియజేస్తుందని హరీష్ శంకర్ కొనియాడారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా తెరకెక్కిన ఈ అరుదైన చిత్రం అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఇలాంటి స్వచ్ఛమైన చిత్రాలను ఆదరించాలని సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు.