Begin typing your search above and press return to search.

ఒక్క ఛాన్స్ కోసం ఎంత మ‌ద‌న‌ప‌డాలో ఈ ద‌ర్శ‌కుడిని చూడండి!

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి.. ఒక్క ఛాన్స్ దక్కించుకోవడానికి ఒక నూతన దర్శకుడు ఎంతగా మదనపడాలో.. ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో `గరివిడి లక్ష్మి` సక్సెస్ వేదికపై దర్శకుడు గౌరీ నాయుడి ఆవేదన‌ను చూడాలి.

By:  Sivaji Kontham   |   17 Oct 2026 11:17 PM IST
ఒక్క ఛాన్స్ కోసం ఎంత మ‌ద‌న‌ప‌డాలో ఈ ద‌ర్శ‌కుడిని చూడండి!
X

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి.. ఒక్క ఛాన్స్ దక్కించుకోవడానికి ఒక నూతన దర్శకుడు ఎంతగా మదనపడాలో.. ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో `గరివిడి లక్ష్మి` సక్సెస్ వేదికపై దర్శకుడు గౌరీ నాయుడి ఆవేదన‌ను చూడాలి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. కృష్ణానగర్, ఫిలింనగర్ వీధుల్లో అవకాశాల కోసం తిరిగే ప్రతి ఔత్సాహిక ప్ర‌తిభావంతుడి ఆవేదనే అత‌డి మాటల్లో కనిపించింది. గరివిడి లక్ష్మి అనే బుర్రకథ ఆర్టిస్ట్ బయోపిక్‌ను రాసుకుని చాలా కాలం పాటు పలు కంపెనీల చుట్టూ తిరిగినా.. ఇది లేడీ ఓరియంటెడ్ కథ కావడంతో ఎవరూ ముందుకు రాలేదు.

ఎలాంటి అవకాశాలు రాక.. చివరకు ఇక ఈ కథతో ఆ ఒక్క ఛాన్స్ రాదనుకుని మరో స్క్రిప్ట్ రాసుకోవాలని డిసైడ్ అయిన సమయంలోనే అత‌డి జీవితంలో ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. నిరాశతో కుంగిపోయిన సమయంలో శ్రీకాకుళంలోని పాపుల‌ర్ రాజులమ్మ తల్లి గుడికి వెళ్లి మొక్కుకుని తిరిగి వస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి ఫోన్ రావడం తన జీవితంలో మరువలేని మధురమైన క్షణమని గౌరీ నాయుడు భావోద్వేగంతో తెలిపారు. ఆ క్షణం తన సినిమా ప్రయాణానికి ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ అయిందని ఆనందం వ్య‌క్తం చేసారు.

ఇక ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన నటీనటుల ప్రతిభను దర్శకుడు ప్రత్యేకంగా కొనియాడారు. టైటిల్ పాత్రలో నటించిన నటి ఆనంది అద్భుతమైన అభినయంతో `గరివిడి లక్ష్మి` పాత్రకు పూర్తి జీవం పోశారని...నేడు సోషల్ మీడియాలో వస్తున్న ప్రశంసలు చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అలాగే ఎల్.బి. శ్రీరామ్ ఈ కథపై ఉన్న గౌరవంతో రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారని.. నరేష్, రాశి, అవసరాల శ్రీనివాస్, వైవా రాఘవ తదితరులు తమ అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టారని తెలిపారు.

ఈ సినిమా ఇంతటి అద్భుత రూపం సంతరించుకోవడానికి సాంకేతిక నిపుణుల శ్రమ ఎంతో దాగి ఉందని గౌరీ నాయుడు వెల్లడించారు. ఎడిటర్ రవితేజ, సినిమాటోగ్రాఫర్ సురేష్, కలరిస్ట్ ఆదిత్య.. ఇతర కో-డైరెక్టర్లు, రైటింగ్ బృందం ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారని పేర్కొంటూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వప్రసాద్ గారు తమ కథను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం వల్లనే ఈరోజు ఈ విజయం సాధ్యమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని దర్శకుడు తెలిపారు. సినిమా చూసిన పలువురు కళాకారులు, ప్రేక్షకులు భావోద్వేగానికి గురై తనకు ఫోన్ చేసి అభినందించారని పేర్కొన్నారు. ఒక ప్రాంతం విశిష్టమైన యాసను, ఒక ఆడపిల్ల కష్టాలను, ఆమె పోరాట పటిమను అద్దం పట్టే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని ఆయన కోరారు.