గరివిడి లక్ష్మి vs ఆర్పి పట్నాయక్.. నిజం ఎవరికి తెలుసు?
గరివిడి లక్ష్మి బయోపిక్ థియేటర్లలోకి వచ్చిందో లేదో.. బయట పెద్ద రచ్చే మొదలైంది. సినిమాలో చూపించిన కథకు, బయట వినిపిస్తున్న మాటలకు అస్సలు పొంతన లేదు
By: M Prashanth | 26 Oct 2026 1:44 PM ISTగరివిడి లక్ష్మి బయోపిక్ థియేటర్లలోకి వచ్చిందో లేదో.. బయట పెద్ద రచ్చే మొదలైంది. సినిమాలో చూపించిన కథకు, బయట వినిపిస్తున్న మాటలకు అస్సలు పొంతన లేదు. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన 'గాజువాక పిల్ల', 'రాను రానంటూనే చిన్నదో' పాటల విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో రెండు వేర్వేరు వెర్షన్లు వినిపిస్తున్నాయి.
తన దగ్గర ఈ జానపద బాణీలు తీసుకున్నప్పుడు, ఆ పాటలు తనతోనే పాడిస్తామని చెప్పి మోసం చేశారని సింగర్ లక్ష్మి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. అప్పట్లో ఇండస్ట్రీ పరిచయాలు లేకపోవడంతో ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని, డబ్బుల కంటే స్క్రీన్ మీద తన పేరు పడితే చాలనుకున్నానని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ వెర్షన్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. తను ఇండస్ట్రీకి రాకముందు లక్ష్మిని అసలు కలవలేదని ఆయన తేల్చి చెప్పారు. డైరెక్టర్ తేజ, రైటర్ కులశేఖర్తో కలిసి విజయనగరం వైపు సినిమా సక్సెస్ టూర్‌కు వెళ్లినప్పుడే ఆమెను మొదటిసారి కలిశానని క్లారిటీ ఇచ్చారు. ఆ జానపద బాణీలు తనకు కాలేజీ రోజుల నుంచే తెలుసని, వాటికే కొత్త లిరిక్స్, మ్యూజిక్ యాడ్ చేశామని చెప్పారు.
సినిమాలో తనను మోసగాడిగా ప్రొజెక్ట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. బయోపిక్ డైరెక్టర్ గౌరి నాయుడు మాత్రం ఆర్పీ పట్నాయక్ ముందే లక్ష్మిని కలిసి పాటలు తీసుకున్నట్లు సినిమాలో చూపించారు. తాము కావాలని ఎవరినీ నెగటివ్‌గా చూపించలేదని డైరెక్టర్ కవరింగ్ ఇచ్చుకున్నా.. సినిమాలో ఉన్న టైమ్‌లైన్‌కు, ఆర్పీ చెబుతున్న దానికి ఏమాత్రం మ్యాచ్ అవ్వడం లేదు. లక్ష్మి ఏమో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే పాయింట్ మీదే ఉన్నారు.
ఇప్పుడు ఈ వివాదంలో అసలు నిజం తేలాలంటే ఆ రోజు సక్సెస్ టూర్లో ఉన్నవాళ్లు మాట్లాడాలి. దురదృష్టవశాత్తూ రైటర్ కులశేఖర్ 2024లోనే కన్నుమూశారు. ఇక మిగిలింది డైరెక్టర్ తేజ ఒక్కరే. ఆయన ఓపెన్ అయితే కానీ అసలు లక్ష్మితో ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందనేది బయటపడదు. కానీ తేజ ఇప్పటివరకు ఈ రచ్చపై సైలెంట్‌గానే ఉన్నారు. ఇలాంటి వివాదాలపై కూడా ఆయన స్పందించరు అని ఆర్పీ ఇదివరకే చెప్పారు. జానపద పాటలు ఎవరి సొత్తు కాదు, కానీ పాడే అవకాశం ఇస్తామని ఆశపెట్టి వాడుకున్నారా లేదా అన్నదే ఇక్కడ అసలు పాయింట్. అప్పటి ఆడియో రికార్డులు, మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నవాళ్లు ఓపెన్ అయితే కానీ ఈ 'గరివిడి లక్ష్మి' రచ్చకు ఫుల్ స్టాప్ పడేలా లేదు.
