Begin typing your search above and press return to search.

జాన‌ప‌ద దిగ్గ‌జానికి గుర్తింపు: `గరివిడి లక్ష్మి` అవార్డులను ప్రకటించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తుండగా.. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు.

By:  Sivaji Kontham   |   15 Oct 2026 5:17 PM IST
జాన‌ప‌ద దిగ్గ‌జానికి గుర్తింపు: `గరివిడి లక్ష్మి` అవార్డులను ప్రకటించిన మంత్రి రామ్మోహన్ నాయుడు
X

ఉత్తరాంధ్ర మట్టి వాసనలను, అచ్చమైన జానపద సంస్కృతిని తన గళంతో ప్రపంచానికి చాటిన దివంగత గాయని రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జ్ఞాపకార్థం `గరివిడి లక్ష్మి అవార్డులు` నెలకొల్పుతున్నట్లు చిత్ర బృందం స‌హా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన `గరివిడి లక్ష్మి` బయోపిక్ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. ఈ పురస్కారాల వేడుకను ప్రతి ఏటా విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్మాత టీజీ కోరగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక నిలయమైన శ్రీకాకుళంలోనే ఏటా ఘనంగా జరపాలని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ సూచించడంతో దానికి చిత్ర యూనిట్ ఆనందంగా అంగీకరించింది.

గతంలో సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు గరివిడి లక్ష్మి పాడిన జానపద బాణీలను, ఈల పాటలను తమ సినిమాల్లో వాడుకుని కోట్లు గడించినా.. ఆమెకు దక్కాల్సిన కనీస రాయల్టీ గానీ, క్రెడిట్ గానీ ఇవ్వకుండా దోపిడీ చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈమె పేరు మీద ఏటా కళాకారులకు అవార్డులు అందజేయాలని నిర్ణయించడం ద్వారా ఆ దిగ్గజ కళాకారిణి పేరు తరతరాల పాటు మార్మోగేలా నిజమైన గుర్తింపు లభించిందని సాంస్కృతిక ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా.. కాలం చేసిన అన్యాయానికి ఈ పురస్కారాల రూపంలో ఆమె కళా సంపదకు సముచిత గౌరవం దక్కినట్లయింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తుండగా.. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ``ఈ సినిమాను నేను ఇప్పటివరకు 15 సార్లు చూశాను.. ప్రతిసారీ అదే ఎమోషన్ కలిగించింది. ముందుగానే వేసిన ప్రీమియర్స్ నుంచి ఎక్స్‌ట్రార్డినరీ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కమర్షియల్ సినిమాలతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ ప్రత్యేకమైన చిత్రం ప్రేక్షకుల మనసులను తప్పకుండా గెలుచుకుంటుంది`` అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర కథలు, అక్కడి మట్టి వాసనలు.. జానపద కళలకు అంతర్జాతీయ స్థాయిలో రాణించగల శక్తి ఉందన్నారు. బతుకును జయించాలంటే గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఉండాలని.. ఒకప్పుడు శ్రీకాకుళం యాసను కేవలం హాస్యం కోసమే ఉపయోగించేవారని... కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారి మన భాషకు, యాసకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవం దక్కుతోందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోకస్ ఇప్పుడు జెన్యూనిటీ కోసం ఉత్తరాంధ్ర వైపు మళ్లిందని, `గరివిడి లక్ష్మి` లాంటి సినిమాలు ఇక్కడి కళాకారులకు మళ్లీ ఊపిరి పోస్తున్నాయని కొనియాడారు.

విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రీ-రిలీజ్ వేడుకలో రామ్మోహన్ నాయుడు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రసంగంతో పాటు ప్రముఖ సింగర్ మంగ్లీతో కలిసి స్టేజ్‌పై సరదాగా జానపద పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 17న రాబోతున్న ఈ `గరివిడి లక్ష్మి` చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.