గంటా జాక్ పాట్ కొట్టేశారా ?
విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తన రాజకీయ ఉడుం పట్టుని నిరూపించుకునే విషయంలో పట్టుదలగా ఉన్నారు.
By: Satya P | 11 Sept 2026 9:13 AM ISTవిశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తన రాజకీయ ఉడుం పట్టుని నిరూపించుకునే విషయంలో పట్టుదలగా ఉన్నారు. భీమునిపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా 2024 ఎన్నికల్లో ఏపీలోనే అతి పెద్ద మూడవ మెజారిటీతో గెలిచి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఆయనకు 90 వేలకు పైగా భారీ మెజారిటీ దక్కింది. ఇక రెండేళ్ళ కాలంలో ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు అన్న ఆవేదన అయితే ఆయన అభిమానులలో అనుచరులలో ఉంది. అయితే టీడీపీ పెద్దలతో గంటా మంచి సాన్నిహిత్యాన్ని నెరుపుతున్నారు, కాబట్టి రేపటి రోజున ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని అంటున్నారు. విస్తరణలో ఆయనకు బెర్త్ దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
మరోసారి రిపీట్ :
ఇక చూస్తే తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దాంతో నూటిని నూరు శాతం స్ట్రైక్ రేట్ అని చంద్రబాబు పార్టీ నేతలను అందరినీ గట్టిగా కోరుతున్నారు. కూటమి వందకు వంద సీట్లు దక్కించుకోవాల్సిందే అని బాబు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేశామని అందువల్ల కూటమి గెలుపు లాంచనం కావాలని ప్రతిపక్షం ఎక్కడా లేని ఫలితం రావాలని బాబు కోరుతున్నారు. అదే తన భీమిలీ నియోజకవర్గంలో రిపీట్ చేయాలని గంటా చూస్తున్నారు. భీమిలీ అంటేనే టీడీపీకి కంచుకోట. దానికి సాయంగా జనసేన కూడ ఉంది. ఇపుడు చూస్తే వైసీపీకి ఇంచార్జి కూడా లేకుండా పోయారు. దాంతో భీమిలీలో కూటమి ఏకపక్షంగా అన్ని సీట్లు గెలిచేందుకు మార్గం సుగమం అయింది అని అంటున్నారు.
మొత్తానికి మొత్తం అంటూ :
ఇక తాజాగా చూస్తే గంటా శ్రీనివాసరావు పార్టీ నాయకులకు హిత బోధ చేశారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 68 గ్రామ పంచాయతీలతో పాటు మూడు జెడ్పీటీసీలు మూడు ఎంపీటీసీలు కూటమి పరం కావాలని స్పష్టం చేశారు. పైగా ఇవన్నీ ఏకగ్రీవం కావాలని కూడా ఆయన కచ్చితంగా చెబుతున్నారు. పోటీ లేని వేళ ఏకంగ్రీవమే అవుతుందని టీడీపీ కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ నియోజకవర్గంలో సారధి లేక కకావికలు అయిన పరిస్థితి ఉందని అందువల్ల భీమిలీలో మరోసారి కూటమి అద్భుతమైన విజయాలను సాధిస్తుందని లెక్క వేస్తున్నారు.
జీవీఎంసీలోనూ :
ఇక జీవీఎంసీ ఎన్నికల్లోనూ కూడా భీమిలీ నియోజకవర్గానికి సంబంధీంచి ప్రస్తుతం ఉన్న నాలుగు వార్డులు కాస్తా అయిదుగా మారాయి. దాంతో ఈ అయిదు కూడా పోటీ లేకుండా గెలుచుకోవడానికి గంటా నాయకత్వంలో స్కెచ్ గీస్తున్నారు. ఈ విధంగా నియోజకవర్గంలో మొత్తం అన్ని సీట్లు పంచాయతీ వార్డు నుంచి కొల్లగొట్టడం ద్వారా ఏపీలో టాప్ అనేలా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే గంటాకి జాక్ పాట్ దక్కుతోంది అనే అంటున్నారు. అసలే కొండంత బలమున్న చోట కనీసంగా కూడా ప్రతిఘటించే వీలు లేని విధంగా వైసీపీలో తాజా పరిణామాలు కూటమి దూకుడుని పెంచుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
