Begin typing your search above and press return to search.

గణేష్ మండపమా? పుష్ప అడ్డానా? వేరే లెవెల్ లో ఉందిగా!

ఇప్పుడు ఒక వినాయకుడి విగ్రహంతోపాటు మండపానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

By:  M Prashanth   |   29 Aug 2025 4:04 PM IST
గణేష్ మండపమా? పుష్ప అడ్డానా? వేరే లెవెల్ లో ఉందిగా!
X

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరువాడ బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తున్నారు భక్తులు. ఆ నేపథ్యంలో వివిధ రూపాల్లో ఎక్కడికక్కడే గణనాధుడు కొలువుదీరాడు. అయితే ఇటీవల కాలంలో వినూత్న రూపాల్లో గణేషుడిని ప్రతిష్టిస్తున్నారు. సినిమా హీరోల గెటప్స్ లో విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.

ఇప్పుడు ఒక వినాయకుడి విగ్రహంతోపాటు మండపానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఏటా సూపర్ హిట్ సినిమాల స్టైల్ ను గుర్తు చేస్తూ వినాయక మండపాలు సిద్ధమవుతుండగా.. ఈసారి తమిళనాడులోని హోసూరులో పుష్ప 2 గణేషుని మండపం రెడీ చేశారు.

గతంలో పలుచోట్లు పుష్ప స్టైల్ లో గణనాథుడి విగ్రహాలు కొలువు దీరగా.. ఇప్పుడు వేరే లెవెల్ అనిపించేలా ఏకంగా వినాయక మండపాన్ని పుష్ప 2 సెట్ లానే తీర్చిదిద్దారు. అల్లు అర్జున్ గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి మండపాన్ని, విగ్రహాన్ని రెడీ చేశారు.

మండపం చూస్తుంటే.. అచ్చం ఎర్రచందనంతో అలంకరించారా అన్న విధంగా ఏర్పాటు చేశారు. ముందుగా ఎంట్రన్స్ లోనే హెలికాప్టర్ వద్ద గన్ తో నిల్చున్న పుష్ప రాజ్ విగ్రహాన్ని పెట్టారు. ఆ తర్వాత ఎర్రచందనం దుంగల సెటప్ మధ్య నుంచి లోపలికి వెళితే గంగమ్మ జాతరలో ఫైట్ కాస్ట్యూమ్స్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

అదే సమయంలో మండపంలో చాలా చోట్ల అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి సంబంధించిన స్టిల్స్ ఏర్పాటు చేశారు. మొత్తానికి మండపం చూస్తుంటే అచ్చం సినిమా సెట్టు తలపిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే మండపం వైరల్ కావడంతో దగ్గర్లోని చాలా మంది ప్రజలు.. సెట్ చూడడానికి తరలివెళ్తున్నారు.

మరోవైపు, అల్లు అర్జున్ గెటప్ లోని విగ్రహంపై ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. దీనిని ఒక కళాత్మక సృష్టిగా కొందరు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. మరికొందరు దానిని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, కరెక్ట్ కాదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆ మండపం వీడియో ఓవైపు తెగ వైరల్ అవుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.