Begin typing your search above and press return to search.

ఉగాదికి సినీ అవార్డుల ఆన‌వాయితీ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో CM రేవంత్

ఉగాది- 2026 సంబ‌రాల వేదిక‌గా `తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్- 2025` ప్ర‌త్యేక‌ వేడుకలో సీనియర్ నటుడు మురళీ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

By:  Sivaji Kontham   |   19 March 2026 11:51 PM IST
ఉగాదికి సినీ అవార్డుల ఆన‌వాయితీ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో CM రేవంత్
X

ఉగాది- 2026 సంబ‌రాల వేదిక‌గా `తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్- 2025` ప్ర‌త్యేక‌ వేడుకలో సీనియర్ నటుడు మురళీ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కళాకారులకు ఇచ్చే అవార్డులను ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం ఒక గొప్ప నిర్ణయమని ఆయన కొనియాడారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ప్రతి ఏటా ఉగాది రోజున సినీ అవార్డులు ఇచ్చే ఆనవాయితీ ఉండేదని మురళీ మోహన్ గుర్తుచేశారు. ఒక సిస్టమ్ లాగా కొన్ని సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా సాగిందని ఆయన వివరించారు. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియలో తేడాలు వచ్చాయని.. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఉత్సాహం కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టిని, కృషిని వెట‌ర‌న్ న‌టుడు, సినీనిర్మాత‌ ముర‌ళిమోహ‌న్ కొనియాడారు. సీఎం రేవంత్ గద్దర్ పేరిట అవార్డులను కొన‌సాగించ‌డం అద్భుతమైన విషయమని మురళీ మోహన్ ప్రశంసించారు. ప్ర‌తియేటా డిసెంబర్ వరకు విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుని మార్చి లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్ లేదా ఉగాది నాటికి అవార్డులు అందజేయడం అనేది ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

టీవీ- నాటక రంగాలపై విన్నపం :

అవార్డుల పునరుద్ధరణను స్వాగతిస్తూనే మురళీ మోహన్ ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేక విన్నపం చేశారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. సినిమాలకు గట్టి పోటీనిస్తున్న టీవీ రంగానికి కూడా ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే సినిమా, టీవీ రంగాలకు మూలమైన నాటక రంగాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని, నాటక అవార్డులను కూడా తప్పనిసరిగా పునరుద్ధరించాలని కళాకారులందరి తరపున మనవి చేశారు.

చివరగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కళలను, కళాకారులను గౌరవించే ఏ ప్రభుత్వానికైనా తన మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా ప్రతిభావంతులైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు తగిన గుర్తింపు లభిస్తుందని మురళీ మోహన్ ఆశాభావం వ్యక్తం చేసారు.