Begin typing your search above and press return to search.

భావోద్వేగాల ప్రస్థానానికి పాతికేళ్లు!

భారతీయ చలనచిత్ర చరిత్రలో సంచలన విజయాలు సాధించిన చిత్రాలలో `గదర్` ఏ ప్రేమ్ కథస ఒక‌టి.

By:  Srikanth Kontham   |   15 Jun 2026 4:00 AM IST
భావోద్వేగాల ప్రస్థానానికి పాతికేళ్లు!
X

భారతీయ చలనచిత్ర చరిత్రలో సంచలన విజయాలు సాధించిన చిత్రాలలో `గదర్` ఏ ప్రేమ్ కథస ఒక‌టి. 2001 జూన్ 15న విడుదలైన చిత్రం విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. కథా రచయిత తల్వార్ ఈ కథను తనకు వినిపించినప్పుడే దేశంలోనే అతిపెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్మానని గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో పాతికేళ్లయినా ఈ చిత్రం చెక్కుచెదరకుండా నిలిచిపోవడం అద్భుతమని హర్షం వ్యక్తం చేశారు.ఈ సినిమా సాధించిన ఘనతలను `మదర్ ఇండియా`, `ముగల్-ఎ-ఆజం`, `షోలే` వంటి ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రాల సరసన అనిల్ శర్మ నిలిపారు.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు థియేటర్లలో ఏకంగా 10 కోట్ల మంది ప్రేక్షకులు (ఫుట్‌ఫాల్స్) ఈ చిత్రాన్ని వీక్షించడం అపూర్వ రికార్డని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో భారీ విజయాలు సాధించిన చిత్రాలు కూడా ఈ మైలురాయిని అందుకోలేకపోయాయని చివరకు `గదర్ 2` కూడా ఇందులో సగానికి మాత్రమే చేరుకోగలి గిందన్నారు. ఆ రోజుల్లో అమీర్ ఖాన్ నటించిన `లగాన్` చిత్రంతో `గదర్` తలపడటంపైనా మాట్లాడారు. అప్పట్లో సినిమాల మధ్య ఇప్పటిలాంటి కార్పొరేట్ ..మార్కెటింగ్ పోటీ ఉండేది కాదని అనిల్ శర్మ అన్నారు.

అది కేవలం దిల్ కా దౌర్ అని, ప్రేక్షకులు ఒకే రోజు రెండు పెద్ద సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి ఎంతో ఆనందంగా చూసేవారని అన్నారు. అంతే కాదు సన్నీ డియోల్, అమ్రీష్ పూరి వంటి నటీనటుల ఎంపిక విషయంలో తమకు వేరే ప్రత్యామ్నాయ ఆలోచనలే లేవని.. వారు మాత్రమే ఆ పాత్రలకు ప్రాణం పోయగలరని నమ్మామని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రేక్ష‌కులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న `గదర్ 3` సీక్వెల్ అప్‌డేట్ గురించి దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. మొదటి భాగాన్ని శక్తివంతమైన బాంబుతో పోల్చిన ఆయన.. రికార్డులు సృష్టించిన రెండో భాగాన్ని `ఆటం బాంబుగా అభివర్ణించారు.

కాబట్టి మూడో భాగాన్ని తెరకెక్కించాలంటే అంతకంటే శక్తివంతమైన న్యూక్లియర్ బాంబు లాంటి కథ దొరికినప్పుడే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఆ తరహా స్క్రిప్ట్ పనుల్లోనే ఉన్నామని.. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది `గదర్ 3` షూటింగ్‌ను ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. `గదర్` సినిమా విజయ ప్రస్థానంలో లక్నో నగరానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ప్రసిద్ధ హ్యాండ్‌పంప్ సన్నివేశంతో పాటు పాకిస్తాన్ నేపథ్యంలో సాగే పలు కీలక ఘట్టాలను లక్నోలోనే చిత్రీకరించారు.

ఈ సినిమా అక్కడ షూటింగ్ జరుపుకోవడం వల్ల ప్రస్తుతం స్థానిక పర్యాటక రంగం ఎంతో వృద్ధి చెందిందని, పర్యాటకులను ఆయా షూటింగ్ ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా స్థానిక ఆటోవాలాలు, గైడ్‌లు ఉపాధి పొందుతున్నారని అనిల్ శర్మ తెలిపారు. `గ‌దర్ 2` ను కూడా అక్కడే తీశామని.. లక్నో లేకుండా గదర్ సిరీస్‌ను ఊహించుకోలేమని మూడో భాగం కూడా అక్కడే నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అనిల్ శర్మ `అర్జున్ నాగా` అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నా? `గదర్` అందించిన వారసత్వం ఆయనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. మార్కెటింగ్ జిమ్మిక్కులు, పబ్లిసిటీ స్టంట్‌ల కంటే కేవలం ఎమోషన్స్, బలమైన కథాంశం ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమాలు మాత్రమే శతాబ్దాల పాటు నిలిచిపోతాయని ఈ చిత్రం నిరూపించింది. రాబోయే రోజుల్లో `గదర్ 3` ద్వారా సుదీర్ఘ ప్రయాణం ఏ స్థాయికి చేరుకుంటుందోనని ఇటు చిత్ర పరిశ్రమ, అటు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.