'డాన్ 3' వివాదంలో బిగ్ ట్విస్ట్: రణ్‌వీర్‌పై నిషేధం ఎత్తివేసిన ఫెడరేషన్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అఖ్తర్ వివాదం గురించి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Jun 2026 6:06 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అఖ్తర్ వివాదం గురించి తెలిసిందే. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ (FWICE) సింగ్ పై సహాయనిరాకరణను ప్రకటించింది. అయితే ఈ వివాదంలో వరుస ట్విస్టులు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ హైడ్రామా ఒక కీలక మలుపు తిరిగింది. ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం `డాన్ 3` నుండి రణ్‌వీర్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో ఆయనపై విధించిన నాన్-కోఆపరేషన్ (సహాయ నిరాకరణ) ఆదేశాలను ఫెడరేషన్ అధికారికంగా ఉపసంహరించుకుంది. జూన్ 3 (బుధవారం) న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈ ఆదేశాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఇండస్ట్రీలో శాంతియుత వాతావరణాన్ని, ఐక్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ వివాదంలో `ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్` (ఐఎంపిపిఏ) జోక్యం చేసుకుని జరిపిన చర్చలు, సంప్రదింపులు ఫెడరేషన్ మెట్టు దిగడానికి ప్రధాన కారణమయ్యాయి. సినీ పరిశ్రమలోని అంతర్గత విభేదాలను సుదీర్ఘ ఘర్షణల ద్వారా కాకుండా పరస్పర అవగాహన - చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు ఎఫ్‌డబ్ల్యూఐసిఇ తెలిపింది. తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా ముగించేందుకు ఈ అడుగు వేసినట్లు స్పష్టం చేస్తూ... ఈ వివాద పరిష్కారానికి చొరవ చూపిన ఐఎంపీపీఏకి ఫెడరేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
అయితే రణ్‌వీర్ సింగ్ నుండి చట్టపరంగా గట్టి కౌంటర్ ఎదురైన మరుసటి రోజే ఈ ఉపసంహరణ జరగడం గమనార్హం. తనపై విధించిన చట్టవిరుద్ధమైన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రణ్‌వీర్ ఇంతకుముందు ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు పంపారు. దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఎఫ్‌డబ్ల్యూఐసిఇ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్.. రణ్‌వీర్ నుండి లీగల్ నోటీసు అందిన మాట నిజమేనని..దానికి తాము చట్టపరమైన మార్గాల ద్వారానే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎవరినీ నిషేధించే అధికారం మాకు లేదు. మేము రణ్‌వీర్ స్టార్‌డమ్‌ను గౌరవిస్తాము. ఆయన స్వయంగా వచ్చి మాతో కూర్చుని ఈ సమస్యకు ఒక చక్కని ముగింపు పలుకుతారని ఆశిస్తున్నామని పండిట్ పిలుపునిచ్చారు.
ప్రస్తుతానికి నిషేధాజ్ఞలను ఎత్తివేసినా.. పలు నిర్మాతల సంఘాలతో ఈ విషయమై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఫెడరేషన్ వెల్లడించింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తమకు సహకరించాల్సిందిగా రణ్‌వీర్ సింగ్‌కు ఫెడరేషన్ లీగల్ బాడీ విజ్ఞప్తి చేసింది. గత కొన్ని వారాలుగా బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసిన `డాన్ 3` వివాదం... ఫెడరేషన్ తన పట్టు విడువడంతో ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. మరి ఈ పరిణామంపై రణ్‌వీర్ సింగ్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.
నటీనటులు చట్టపరంగా గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే ఇటువంటి సినీ కార్మిక సంఘాలు వెనక్కి తగ్గుతుండటం చూస్తుంటే.. ఇండస్ట్రీలో ఫెడరేషన్ల పట్టు కేవలం చిన్న నటులు, సాంకేతిక నిపుణులపైనే సాగుతుందని.. స్టార్ హీరోల ఇమేజ్- లీగల్ పవర్ ముందు వారి పంతాలు సాగవని ఈ పరిణామం నిరూపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
