ఆ దిగ్గజాల్ని తలదన్నే ప్యూచర్ పాన్ ఇండియా డైరెక్టర్!
అలాగే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా మలచడంలో చందు మొండేటి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Srikanth Kontham | 11 Aug 2026 5:10 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా టాలీవుడ్ హవానే నడుస్తోంది. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి టాలెంటెడ్ దర్శకులు తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమా సత్తాను చాటుతున్నారు. అయితే ఈ అగ్ర దర్శకుల తర్వాతి తరంలో వారిని తలదన్నేలా? లేదా అంతకు మించిన గ్లోబల్ విజన్‌తో తెలుగు నుంచి రాబోయే ఫ్యూచర్ పాన్ ఇండియా డైరెక్టర్లు ఎవరనే చర్చ వచ్చినప్పుడు ట్రెండ్‌కు తగినట్లుగా ప్రశాంత్ వర్మ - చందు మొండేటిల పేర్లు ముందు వరుస కనిపిస్తున్నాయి.
ఈ రేసులో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించే. `హనుమాన్` అనే చిన్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రపంచ స్థాయి అద్భుతాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు `జై హనుమాన్`, `మహాకాళి` వంటి ప్రాజెక్ట్‌లతో అసాధారణ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టిస్తున్నారు. భారతీయ పౌరాణిక అంశాలను మోడరన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మిళితం చేయడంలో ప్రశాంత్ చూపిస్తున్న ప్రతిభ, భవిష్యత్తులో టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. సరైన బడ్జెట్...కావాల్సినంత సమయం, స్వేచ్ఛ ఇవ్వగలిగితే ప్రశాంత్ అద్బుతాలు చేయగలడు.
అలాగే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా మలచడంలో చందు మొండేటి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. `కార్తికేయ 2` తో నార్త్ ఆడియన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుని ఒక మిస్టికల్ అడ్వెంచర్ జోనర్‌కు బాటలు వేశారు. ఇప్పుడు అదే సిరీస్‌లో `కార్తికేయ 3` తో పాటు రాబోయే భారీ ప్రాజెక్ట్‌లతో ఆయన ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలే స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. దైవిక అంశాలను, చరిత్రను ముడిపెడుతూ చందు నడిపించే కథా కథనాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. రెగ్యులర్ కథలకు భిన్నంగా చందు ఆలోచనలుంటాయి. యూనిక్ పాయింట్ చుట్టు కథను అల్లడంలో అతడు మాస్టర్.
ఇలా ఇద్దరు దర్శకులు కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా బలమైన భారతీయ సంస్కృతిని, పౌరాణిక మూలాలను ఆధునిక సాంకేతికతతో అద్భుతంగా మిళితం చేయగల సత్తా ఉన్నవారు. విజువల్ ఎఫెక్ట్స్ , గ్లోబల్ ఆడియెన్స్ టేస్ట్‌ను పక్కాగా అంచనా వేయగలగడమే ఇద్దరిని ఇతర దర్శకుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. రాజమౌళి, సుకుమార్‌ల లెగసీని కొనసాగిస్తూనే భవిష్యత్తులో ఇండియన్ సినిమా దిశను మార్చగల సత్తా వీరిద్దరికే ఉందనడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉన్న సరిహద్దులను పూర్తిగా చెరిపేస్తూ సరికొత్త కథా ప్రపంచాలను సృష్టించగల ఈ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు టాలీవుడ్ భవిష్యత్తును మరింత బంగారు మయం చేసే అవకాశం లేకపోలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, అద్భుతమైన కథా బలంతో బ్యాలెన్స్ చేయగలిగిన ప్రశాంత్ వర్మ, చందు మొండేటి లాంటి మేధావులే రాబోయే దశాబ్దంలో బాక్సాఫీస్‌ను శాసించే ఫ్యూచర్ పాన్ ఇండియా డైరెక్టర్లుగా అవతరిస్తారు. వీరికి పోటీ జెన్ జీ డైరెక్టర్లు వెలుగులోకి వస్తే? మరింత అడ్వాన్స్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది.
