Begin typing your search above and press return to search.

'ఫంకీ' బాక్సాఫీస్ సవాల్.. ఏంటీ పరిస్థితి?

సినిమా మేకింగ్ లో సితార సంస్థ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకపోయినా.. కంటెంట్ పరంగా ఆడియన్స్ కు బోర్ కొడితే మాత్రం కష్టమే.

By:  M Prashanth   |   27 Jan 2026 12:00 AM IST
ఫంకీ బాక్సాఫీస్ సవాల్.. ఏంటీ పరిస్థితి?
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటారు. ఈసారి 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో 'ఫంకీ' అనే సినిమాతో ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా వస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ వెనుక ఉన్నా.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ గతంలో ఉన్నంత హైప్ మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే.. అనుదీప్ పాత సినిమాల తరహాలోనే రొటీన్ కామెడీ కనిపిస్తోందనే టాక్ సోషల్ మీడియాలో వినపడుతోంది.

దర్శకుడు అనుదీప్ తన మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసినా.. ఆ తర్వాత వచ్చిన 'ప్రిన్స్' మూవీతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. ఇప్పుడు 'ఫంకీ' కోసం కూడా మళ్ళీ అదే తరహా కామెడీ ట్రాక్ ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. విశ్వక్ సేన్ కూడా ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద నిలబడే రేంజ్ వసూళ్లు రాబట్టడం ఇప్పుడు ఆయనకు చాలా అవసరం. టీజర్ లో కొత్తదనం పెద్దగా లేకపోవడం సినిమాకు కొంత మైనస్. కాబట్టి ట్రైలర్ అలాగే సాంగ్స్ మీద ఆశలు పెట్టుకోవాలి.

ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న లెక్కలు అంత ఆశాజనకంగా ఏమీ లేవు. ఆంధ్రలోని ఆరు టెరిటరీల బిజినెస్ సుమారు రూ. 5 కోట్ల రేషియోలో జరిగినట్లు టాక్ వినిపిస్తున్నా.. ఇంకా చాలా ఏరియాల్లో డీల్స్ క్లోజ్ కాలేదని సమాచారం. టీజర్ కు వచ్చిన మిక్స్‌డ్ రెస్పాన్స్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా మేకింగ్ లో సితార సంస్థ క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకపోయినా.. కంటెంట్ పరంగా ఆడియన్స్ కు బోర్ కొడితే మాత్రం కష్టమే. వాలెంటైన్స్ డే వీకెండ్ అనేది సినిమాకు ప్లస్ అయ్యే పాయింట్. కానీ కేవలం కామెడీని నమ్ముకుని వస్తున్న ఈ సినిమాను నేటి జనరేషన్ ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. అనుదీప్ మార్క్ సెటైర్లు, విశ్వక్ సేన్ ఎనర్జీ ఈసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. ప్రమోషన్ల విషయంలో కూడా టీమ్ ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం టీజర్ మీద వచ్చిన కామెంట్స్ చూస్తుంటే.. రెగ్యులర్ రొటీన్ కామెడీ కాకుండా సినిమాలో ఏదైనా సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే తప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టం. నైజాం ఏరియాలో కూడా బిజినెస్ డీల్స్ ఇంకా ఒక కొలిక్కి రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం ఒక సాహసమే అని చెప్పొచ్చు.

ఏదేమైనా 'ఫంకీ' ఫలితం పూర్తిగా రిలీజ్ తర్వాత వచ్చే టాక్ మీదే ఆధారపడి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే తప్ప సినిమా గట్టెక్కే అవకాశం కనిపించడం లేదు. విశ్వక్ సేన్ మార్కెట్ స్టామినాను ఈ సినిమా ఎంతవరకు కాపాడుతుందో చూడాలి. అనుదీప్ తన పాత ఫార్ములాను వదిలి ఏమైనా కొత్తగా ట్రై చేశారో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 13 వరకు వెయిట్ చేయాల్సిందే.