సినిమాకు కొత్త సవాళ్లు..షూటింగ్ రూపురేఖలు మారబోతున్నాయా?
ఈ ఆంక్షలు లార్జర్-ద్యాన్-లైఫ్ సినిమాలను ప్లాన్ చేసే దర్శకులకు , నిర్మాతలకు పెద్ద సవాలుగా మారబోతున్నాయి.
By: Sivaji Kontham | 16 May 2026 1:01 PM ISTప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి.. ఇంధన కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమను కూడా కుదిపేస్తున్నాయి. ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి నుండి ముఖ్యమంత్రుల వరకు కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకోవడం.. ఆదివారం రోజుల్లో పెట్రోల్ బంకులకు పూర్తి సెలవు ప్రకటించడం తెలిసిందే. అలాగే రెండేళ్ల పాటు ఎలాంటి భారీ నిర్మాణ పనులను చేపట్టకూడదని కేంద్రం ఆదేశించడం వంటి చర్యలు దేశంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్ కూడా సినిమా నిర్మాణ వ్యయాలను తగ్గించుకోవాలని పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఇలాంటి అసాధారణ ఆంక్షలు , మారిన పరిస్థితులు రాబోయే రోజుల్లో సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ ఆంక్షల ప్రభావం నేరుగా సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ , లొకేషన్ ప్లానింగ్‌లపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్ జరగాలంటే వందలాది వాహనాలు, భారీ జనరేటర్లు, క్యారవాన్లు అవసరమవుతాయి. వీటన్నింటికీ ప్రతిరోజూ వేల లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. తాజాగా ఇంధన వాడకంపై ఆంక్షలు రావడం అందు లోనూ ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయడం వల్ల చిత్ర బృందాలు రవాణా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకరోజు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడమో లేదా లొకేషన్ లోపలే పరిమిత వాహనాలతో మేనేజ్ చేయడమో తప్ప మరో మార్గం లేదు.
ఇది సినిమా నిర్మాణ కాలపరిమితిని పెంచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు భారీ నిర్మాణాలపై నిషేధం విధించడం సినిమా రంగానికి మరో పెద్ద దెబ్బ. పీరియాడిక్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాల కోసం స్టూడియోలలో వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేస్తుంటారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఇలాంటి భారీ సెట్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం కష్టమే. దీనివల్ల నిర్మాతలు విలాసవంతమైన సెట్లకు దూరంగా ఉండి సహజసిద్ధమైన లొకేషన్లలోనే షూటింగ్స్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ ఆంక్షలు లార్జర్-ద్యాన్-లైఫ్ సినిమాలను ప్లాన్ చేసే దర్శకులకు , నిర్మాతలకు పెద్ద సవాలుగా మారబోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలోనే కమల్ హాసన్ చేసిన నిర్మాణ వ్యయం తగ్గింపు వ్యాఖ్యలు పరిశ్రమకు దిక్సూచిగా మారనున్నాయి. వనరుల కొరత, ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా మేకర్స్ దుబారా ఖర్చులకు స్వస్తి చెప్పక తప్పదు. అనవసరమైన విదేశీ ప్రయాణాలు, భారీ తారాగణం, విలాసవంతమైన బస వంటి వాటిని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా ఈ సంక్షోభం పరిశ్రమలో క్రమశిక్షణను పెంచడానికి ఉపయోగపడుతుంది. బడ్జెట్ అదుపు తప్పకుండా కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలు తీసే కొత్త సంస్కృతికి ఇది నాంది కావచ్చు.
భారీ సెట్ల నిర్మాణం , విదేశీ షెడ్యూల్స్ తగ్గుతున్న నేపథ్యంలో, టెక్నాలజీ పాత్ర సినిమా రంగంలో మరింత పెరగబోతోంది. ఫిజికల్ సెట్టింగుల స్థానంలో గ్రీన్ మ్యాట్, వర్చువల్ ప్రొడక్షన్ , అధునాతన విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో స్టూడియో లోపలే ప్రపంచాన్ని సృష్టించే వైపు దర్శకులు మొగ్గు చూపుతారు. ఇది రవాణా , ఇంధన ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. అలాగే కథల ఎంపికలో కూడా మార్పులు రావొచ్చు. భారీ హంగులు లేకపోయినా ప్రేక్షకుడిని కట్టిపడేసే బలమైన ఎమోషన్స్, సస్పెన్స్ డ్రామాలు , ఇండోర్ కథలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది.
ఇంధన ఆంక్షలు తక్షణమే సినిమా రంగానికి కొంత ఇబ్బంది కలిగించినా? దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన మార్పుకు దారితీసే అవకాశం ఉంది. సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్, విదేశీ లొకేషన్లు మాత్రమే కాదు. బలమైన కథే సినిమా ఆత్మ అని నిరూపించడానికి ఇదొక సందర్భం. మారిన ఈ పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ మేకింగ్ విధానాన్ని మార్చుకుని తక్కువ ఖర్చుతో నాణ్యమైన చిత్రాలను ఎలా అందిస్తారో చూడాలి.
శతాబ్దాల చరిత్ర గల చలనచిత్ర పరిశ్రమ ఈ సంక్షోభాన్ని కూడా దాటుకుని సరికొత్తగా రూపాంతరం చెందుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
