ఆ హీరోయిన్ కు ఎప్పుడు కలిసొస్తుందో?
మనమెంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం, కొద్దిపాటి అదృష్టం కూడా ఉంటేనే జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి.
By: Sravani Lakshmi Srungarapu | 13 Dec 2025 3:23 PM ISTమనమెంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం, కొద్దిపాటి అదృష్టం కూడా ఉంటేనే జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. ఆ అదృష్టమే లేకపోతే ప్రతీదీ ఆఖరి వరకు వచ్చి రిజల్ట్ తేలే సమయానికి ఆగిపోతుంది. ఇప్పుడు సౌత్ హీరోయిన్ కృతి శెట్టి పరిస్థితి కూడా అలానే ఉంది. ఉప్పెన అనే తెలుగు సినిమాతో కృతి ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.
ఉప్పెన సక్సెస్ తో వరుస ఛాన్సులు
మొదటి సినిమానే మంచి బ్లాక్ బస్టర్ గా నిలవడం, దానికి తోడు ఆ సినిమాలో తన నటనకు కృతికి మంచి పేరు రావడంతో టాలీవుడ్ లోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చేసిందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టే ఉప్పెన తర్వాత కృతికి అవకాశాలు కూడా క్యూ కట్టాయి. కానీ అవేవీ కృతికి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. మరీ ముఖ్యంగా కృతి నుంచి తెలుగులో ఆఖరిగా వచ్చిన సినిమాలైతే దారుణమైన ఫలితాల్ని అందుకున్నాయి.
వరుస ఫ్లాపులతో తగ్గిన తెలుగు అవకాశాలు
ఉప్పెన తర్వాత కృతి చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ తప్ప మిగిలిన సినిమాలైన మనమే, కస్టడీ, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలైతే అమ్మడికి నిరాశనే మిగిల్చాయి. దీంతో క్రమంగా కృతికి తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి. ఇక చేసేదేమీ లేక కోలీవుడ్ లో లక్ ను టెస్ట్ చేసుకుందామని తమిళంకు వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేసింది కానీ అది కూడా అమ్మడికి ఏ మాత్రం కలిసి రావడం లేదు.
కృతిని వెంటాడుతున్న బ్యాడ్ లక్
ఎంతో కష్టపడి అవకాశాలను అందుకుని, సినిమాలను పూర్తి చేసి సినిమాల ప్రమోషన్స్ వరకు అయితే చేయగలిగింది కానీ అవి ఆఖరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడటంతో మరోసారి కృతికి నిరాశ తప్పడం లేదు. కార్తీతో చేసిన అన్నగారు వస్తారు మూవీపై ఎన్నో హోప్స్ పెట్టుకుని ఆ మూవీని ఎంతగానో ప్రమోట్ చేస్తే లాస్ట్ మినిట్ లో అది వాయిదా పడింది. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన సినిమా ఫిబ్రవరి అంటున్నారు కానీ అది కూడా కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితి.
ఇక డిసెంబర్ 18న రిలీజ్ కావాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాయిదా పడుతున్నట్టు వార్తలొచ్చాయి. డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నిర్మాతకు వచ్చిన విభేదాలే దీనికి కారణమని టాక్. దీంతో ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఇక మరో సినిమా జీనీ కూడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంకా రిలీజవలేదు. దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తెలుగులో ఆఫర్లు రావడం లేదని కోలీవుడ్ కు వచ్చి ఎప్పుడెప్పుడు సక్సెస్ అందుకుందామా అని కృతి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయే తప్పించి అమ్మడిని సక్సెస్ కు చేరువ మాత్రం చేయలేకపోతున్నాయి. మరి కృతిని తను కోరుకుంటున్న సక్సెస్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి.
