విలన్ అవుతానని అమ్మ ముందే చెప్పింది
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాలో విలన్ గా నటించిన మలయాళ నటుడు వెంకిటేష్ మంచి మార్కులు వేసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Aug 2025 10:00 PM ISTవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాలో విలన్ గా నటించిన మలయాళ నటుడు వెంకిటేష్ మంచి మార్కులు వేసుకున్నారు. వెంకిటేష్ మలయాళంలో పెద్ద పాపులర్ నటుడేమీ కాదు. ఇప్పటివరకు నాలుగైదు సినిమాలే చేశారంతే. నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న వెంకిటేష్ కు తెలుగులో కింగ్‌డమ్ లాంటి ప్రాజెక్టులో మెయిన్ విలన్ గా చేసే ఛాన్స్ రావడం చాలా పెద్ద విషయం.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు
అయితే వచ్చిన అవకాశాన్నివెంకిటేష్ కూడా చాలా తెలివిగా వాడుకున్నారు. తెలుగులో చేసిన మొదటి సినిమానే అయినప్పటికీ అందరినీ ఇంప్రెస్ చేశాడతడు. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే అతని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. కళ్లతోనే హావభావాలు పలికించిన వెంకిటేష్ తీరుకి ఆడియన్స్ ఫ్యాన్స్ అయ్యారు. దాంతోనే వెంకిటేష్ మామూలు నటుడు కాదనే ఫీలింగ్ అందరికీ వచ్చేసింది.
తలైవార్‌కు పెద్ద ఫ్యాన్ ని
కింగ్‌డమ్ సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న వెంకిటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. తన ఫ్యామిలీ మొత్తం తలైవార్ కు పెద్ద ఫ్యాన్స్ అని, ఆయన సినిమాలు చూస్తూనే పెరిగానని చెప్పారు. ఆయన యాక్టింగ్ చూస్తూ ఓ రోజు తాను తన తల్లితో హీరోని అవుతానని చెప్తే, తన తల్లి మాత్రం కాదు కాదు నువ్వు విలన్ అవ్వాలనుకుంటున్నావని చెప్పారని వెంకిటేష్ చెప్పారు.కేరళలోని సెకండ్ లార్జెస్ట్ థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు అక్కడ తన ఎంట్రీకి క్లాప్స్ కొట్టడం చూసి తన తల్లి ఎంతగానో సంతోషించారని, తన తల్లికి తన యాక్టింగ్ తో పాటూ సినిమా కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు వెంకిటేష్.
జూనియర్ ఆర్టిస్టుగా చేస్తే 500 ఇచ్చారు
బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన వెంకిటేష్ కెరీర్ స్టార్టింగ్ లో ఫేస్ బుక్ ద్వారా సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసేవాడినని, జూనియర్ ఆర్టిస్టుగా చేసేటప్పుడు తనకు 500 ఇచ్చేవారని, ఆ టైమ్ లో ఆ డబ్బే తనకు చాలా ఎక్కువని చెప్పారు. ఓ సినిమాలో తనను హీరోగా అనౌన్స్ చేసి తర్వాత వేరే వాళ్లతో తీశారని, అయినా కూడా ఆ రోజు తనను హీరోగా గుర్తించడమే తనకు గొప్ప విషయమని ఎంతో పాజిటివ్ గా మాట్లాడారు వెంకిటేష్. ఎప్పటికైనా హీరోగా సినిమా చేసి స్టార్ అవ్వాలనేది తన కోరికగా వెంకిటేష్ తెలిపారు.
