Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో కొత్త తరం హీరోయిన్ల సరికొత్త వ్యూహం!

ఒకప్పుడు హీరోయిన్లు సెట్ లో ఏమీ తెలియని అమాయకత్వంతో డైలాగులు అప్పజెప్పి వెళ్ళిపోయేవారు. కానీ నేడు సీన్ మ‌రోలా ఉంది.

By:  Srikanth Kontham   |   19 July 2026 6:00 PM IST
టాలీవుడ్‌లో కొత్త తరం హీరోయిన్ల సరికొత్త వ్యూహం!
X

ఒకప్పుడు హీరోయిన్లు సెట్ లో ఏమీ తెలియని అమాయకత్వంతో డైలాగులు అప్పజెప్పి వెళ్ళిపోయేవారు. కానీ నేడు సీన్ మ‌రోలా ఉంది. ఇక్కడ పాతుకుపోవాలంటే? కేవలం గ్లామర్ సరిపోదని మట్టి వాసన తెలిసిన తెలుగు భాషా ప్రావీణ్యం కూడా అంతే అవసరమని యంగ్ హీరోయిన్లు బలంగా నమ్ముతున్నారు. భాగ్యశ్రీ బోర్సే, ఇమాన్వి ఇస్మైల్వంటి నటీమణులు స్క్రిప్ట్ పేపర్లను తెలుగులో చదువుకుంటూ దర్శకుడితో నేరుగా సంభాషించే స్థాయికి ఎదిగారు. ఈ భాషా యజ్ఞం కేవలం మాటల కోసం కాదు. భావోద్వేగాల కోసం కూడా.

ఒక పాత్ర పలికే డైలాగ్‌లో ఉన్న డెప్త్, ఆ యాస వెనుక ఉన్న ఆవేదన .. హాస్యం... ఇవన్నీ భాష తెలిసినప్పుడు మాత్రమే నటి పండించగలదు. ఇమాన్వి ఇస్మైల్ లాంటి నటులు సెట్స్‌లో అసిస్టెంట్స్‌ను అడిగి మరీ తెలుగు పదాలకు అర్థాలు తెలుసుకోవడం చూస్తుంటే? వారి అంకితభావం అర్థమవుతోంది. బట్టీ పట్టిన మాటలకు, హృదయం నుండి వచ్చే మాటలకు తేడా తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. మీనాక్షి చౌదరి వంటి స్టార్ రేంజ్ హీరోయిన్లు ఈ విషయాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. భాషపై పట్టు రావడం అంటే? సెట్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో పని చేయడం.

టెక్నీషియన్లతో, రచయితలతో నేరుగా చర్చించడం వల్ల సన్నివేశంలో సహజత్వం పెరుగుతోంది. ఇది కెరీర్ పరంగానే కాకుండా కళాకారిణిగా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ర‌క‌మైన‌ లోకల్ కనెక్ట్ వల్ల ప్రేక్షకులకు కూడా సదరు హీరోయిన్ మన అమ్మాయి అనే భావన కలుగుతోంది. సినిమా రిలీజ్ అనంత‌రం జ‌రిగే ప్ర‌మోషన్లలో భాషా ప్రావీణ్యం బ్రహ్మాస్త్రంలా పని చేస్తోంది. సోషల్ మీడియాలో తెలుగులో ట్వీట్ చేయడం, ఇంటర్వ్యూలలో తెలుగు సామెతలు వాడటం వంటివి ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు త‌మ‌ భాషను గౌరవించే నటీమణులను కుటుంబంలో ఒకరిగా భావిస్తారు.

ఈ చిన్న మార్పు స్టార్‌డమ్‌ను నిర్ణయించే స్థాయికి చేరుకుంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. గతాన్ని పరిశీలిస్తే భాషను నేర్చుకోకుండా వెలిగిపోయిన వారు కొందరుండొచ్చు. కానీ నిలకడగా నిలిచిన వారు మాత్రం భాషను ప్రేమించిన వారే. నేటి పోటీ ప్రపంచంలో నటనకు అదనపు బలం భాష. యంగ్ హీరోయిన్లు చూపుతున్న ఈ శ్రద్ధ వారిని అందమైన ముఖాల నుండి అభినయ తారల స్థాయికి తీసుకెళ్తోంది. పోటీ ఉన్న చోట ప్రత్యేకతను చాటుకోవాలంటే? భాష కంటే మంచి ఆయుధం మరొకటి లేదు.

తెలుగు నేర్చుకోవడం అనేది మేధోపరమైన వ్యూహం. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే నటీమణులు తెలుగు నేలను, ఇక్కడి భాషను సొంతం చేసుకుంటున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ భవిష్యత్తును మరింత సుసంపన్నం చేయడమే కాకుండా? నటీమణుల కెరీర్ గ్రాఫ్‌ను మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.