మొత్తానికి శర్వానంద్ కూడా ఛాలెంజ్ విసిరాడు!
ఈ మధ్య కాలంలో సినిమా విజయంలో హీరోలెంత కాన్పిడెంట్ గా ఉంటున్నారో చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కు ముందు సవాల్ విసిరేది కొందరైతే? రిలీజ్ తర్వాత చొక్కా కాలరెగరేసే హీరోలు మరికొంత మంది.
By: Srikanth Kontham | 22 Jan 2026 9:39 AM ISTఈ మధ్య కాలంలో సినిమా విజయంలో హీరోలెంత కాన్పిడెంట్ గా ఉంటున్నారో చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కు ముందు సవాల్ విసిరేది కొందరైతే? రిలీజ్ తర్వాత చొక్కా కాలరెగరేసే హీరోలు మరికొంత మంది. సూపర్ స్టార్ మహేష్ సైతం `మహర్షి` సక్సెస్ అయిన సందర్భంగా కాలరెగరేసి మరీ కొట్టామని చెప్పారు. ప్రతీ అభిమాని కాలరెగరేసి చెప్పిండి అంటూ ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా `దేవర` విషయంలో అంతే కాన్పిడెంట్ గా మాట్లాడారు. అతి అనకోకపోతే? ప్రతీ అభిమాని కాలరెగరేసి చెప్పుకునేలా `దేవర` ఫలితం ఉంటుందన్నారు.
అలాగే హీరో నాని నిర్మించిన `కోర్టు` రిలీజ్ సమయంలో? `కోర్టు` సక్సస్ అవ్వకపోతే గనుక తాను నటించిన `హిట్ ది థర్డ్ కేస్` చిత్రాన్నిచూడొద్దంటూ పబ్లిక్ గానే సవాల్ విసిరి సక్సెస్ అయ్యాడు. అంతకు ముందు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా `క` సక్సెస్ అవ్వకపోతే గనుక సినిమాలు వదిలేసి ఊరెళ్లిపోతానని ఛాలెంజ్ విసిరి సక్సెస్ అయినవాడే. ఇటీవలే యంగ్ హీరో శర్వానంద్ కూడా `నారీ నారీ నడుమ మురారీ`తో మంచి విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయిన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా రిలీజ్ కు ముందు శర్వానంద్ ఎలాంటి ఛాలెంజ్ లు చేయలేదు గానీ తదుపరి సినిమా విషయంలో మాత్రం సవాల్ చేసాడు. శర్వానంద్ హీరోగా అభిలాషరెడ్డి దర్శకత్వంలో `బైకర్` అ నే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సినిమాపై శర్వానంద్ ధీమా వ్యక్తం చేసాడు. ` బైకర్` భారతదేశమే గర్వపడేలా ఉంటుందన్నారు. ఇది తెలుగు సినిమా అని కాలరేగరేసి చెప్పేంత గొప్పగా ఉంటుందన్నాడు.
ఇంత వరకూ శర్వానంద్ తాను నటించిన ఏ సినిమాకు గురించి ఇలా మాట్లాడింది లేదు. సినిమా గురించి నాలుగు ముక్కలు పాజిటివ్ గా మాట్లాడటం తప్ప ఈరేంజ్ లో ఏ సినిమాకు ఎలివేషన్ ఇవ్వలేదు. మొన్న రిలీజ్ అయిన `నారీ నారీ నడుమ మురారీ` గురించి కూడా పెద్దగా మాట్లాడలేదు. అలాంటిది `బైకర్` గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే శర్వానంద్ ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో అద్దం పడుతుంది. ఇక్కడ కావాల్సింది నమ్మకాన్ని వ్యక్తం చేయడమే కాదు. ఆ నమ్మకం నిలబడేలా హిట్ కొట్టి చూపించాలి. విజయం అనేది మాటలు కోటలు దాటినంత సులభం కాదు. విజయం అనే మాట చాలా విమర్శలకు, ట్రోలింగ్ లకు దరా తీస్తుంది? అన్నది గుర్తించాలి.
