2027 లో ఆ బ్యూటీ కెప్టెన్ కుర్చీ!
`జాతిరత్నాలు` విజయంతో చిట్టిగా ఫరియా అబ్దుల్లా ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 28 April 2026 12:22 PM IST`జాతిరత్నాలు` విజయంతో చిట్టిగా ఫరియా అబ్దుల్లా ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమా అమ్మడికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. ఆ విజయం కొత్త అవకాశాలను కల్పించింది. అయితే ఈ అవకాశాలు సరిపోవు. ఫరియా నటిగా ఇంకా బిజీగా మారాలి. అమ్మడి ట్యాలెంట్ కు తగ్గ అవకాశాలు రాలేదన్నది ఫాలోవర్ల మాట. ఆ దిశగా ఫరియా అబ్దుల్లా మరింత బిజీ అవ్వాలంటున్నారు. త్వరలోనే `గాయపడ్డ సింహం` అనే చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి రెడీ అవుతుంది. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.
అలాగే అమ్మడు మరో కొత్త ట్యాలెంట్ ను బయట పెట్టడానికి రెడీ అవుతోంది. నటనకే పరిమితం కాకుండా మెగా ఫోన్ పట్టి వెండితెరపై కథను నడిపించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది దర్శకత్వ ప్రతిభను చాటుకునేలా ఒక ప్రాజె క్టును పట్టాలెక్కిస్తానని తెలిపింది. నటిగా గుర్తింపు పొందిన తక్కువ సమయంలోనే దర్శకత్వం వైపు మొగ్గు చూపడం ఫరియాలోని సృజనాత్మక కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్టోరీ రెడీ అవుతోంది. విభిన్నమైన పాయింట్‌తో ప్రేక్షకులను పలకరించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నటీమణులు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నటనపైనే దృష్టి పెడతారు. కానీ ఫరియా మాత్రం కెప్టెన్ కుర్చీ ఎక్కేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఫరియా అబ్దుల్లా లో మరో ట్యాలెంట్ కూడా ఉంది. ఆమె మంచి డాన్సర్ కూడా. ఇలా రకరకాల కళల్లో వివిధ కోణాలపై తనకు అవగాహనతోనే దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. టాలీవుడ్‌లో నటీమణులు దర్శకులుగా మారడం అనేది చాలా రేర్.
ఈ తరం యువ నటీమణులే ఎక్కువగా ఆ రకంగా ఆ ధైర్యం చేస్తున్నారు. గతంలో సావిత్రి, విజయనిర్మల వంటి దిగ్గజాలు నటనతో పాటు దర్శకత్వంలోనూ తమ ముద్ర వేశారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ వారు అంటే బి.జయ, నందిని రెడ్డి లాంటి వారే కనిపిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన `రాకాస` సినిమాతో మానస శర్మ అనే శ్రీకాకుళం ప్రతిభావంతురాలు దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే మానస సక్సెస్ అయింది. తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. దీంతో మానసకు దర్శకురాలిగా మంచి అవకాశాలు రానున్నాయి. ఫరియా అబ్దుల్లా కూడా దర్శకురాలిగా ఆ రేంజ్ లో స క్సెస్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఫరియా చేతిలో నటిగా కొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఆ సినిమాలను పూర్తి చేస్తూనే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన దర్శకత్వం కోసం సమయాన్ని కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఫరియా అబ్దుల్లా దర్శకత్వ ప్రయాణం విజయవంతం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
