Begin typing your search above and press return to search.

ఫుడ్ & బెవరేజెస్ అమ్మకపోతే మల్టీప్లెక్సుల‌ మనుగడ కష్టమేనా?

సినిమా థియేటర్ అనగానే కేవలం పెద్ద తెరపై దృశ్యాలు, పవర్ ఫుల్ సౌండ్ సిస్టమ్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే ప్ర‌దేశం.

By:  Sivaji Kontham   |   27 July 2026 9:28 PM IST
ఫుడ్ & బెవరేజెస్ అమ్మకపోతే మల్టీప్లెక్సుల‌ మనుగడ కష్టమేనా?
X

సినిమా థియేటర్ అనగానే కేవలం పెద్ద తెరపై దృశ్యాలు, పవర్ ఫుల్ సౌండ్ సిస్టమ్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే ప్ర‌దేశం. చేతిలో పాప్‌కార్న్ టబ్, చల్లటి కోలా సీసా పట్టుకుని సినిమా చూడటం ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే అలవాటు వ్యాప‌కం. థియేట‌ర్ల‌లో ప్ర‌జ‌లు ఎంత ఎక్కువ‌గా కోలాలు తాగి, ఫుడ్ తింటే అంత‌టి వినోదం ఎగ్జిబిట‌ర్ కి ద‌క్కుతుంది. అయితే ప్రస్తుత కాలంలో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ థియేటర్లు మనుగడ సాగించాలంటే కేవలం సినిమా టికెట్ల అమ్మకాలు మాత్రమే సరిపోవ‌డం లేదు. ఫుడ్ అండ్ బెవరేజెస్ విక్రయాలే వీటి ప్రధాన ఆదాయ వనరుగా మారాయ‌నేది గ్ర‌హించాలి. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో థియేటర్ల నిర్వహణ ఖర్చులను వెళ్లదీయడం ఎగ్జిబిటర్లకు అత్యంత సవాలుతో కూడుకున్న విషయంగా మారిందని విశ్లేషిస్తున్నారు.

తాజాగా వెలువడిన పీవీఆర్ ఐనాక్స్ మొదటి త్రైమాసిక (క్యూ1) ఆర్థిక ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. గత ఏడాది రూ. 54 కోట్ల నష్టాల్లో ఉన్న పీవీఆర్... ఈ ఏడాది ఏకంగా రూ. 56.5 కోట్ల నికర లాభాన్ని సాధించి..మొత్తం రూ. 1,622.2 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ భారీ టర్నరౌండ్‌లో సినిమా టికెట్ల అమ్మకాల వృద్ధి 16 శాతంగా ఉంటే... ఆహార, పానీయాల (ఎఫ్ అండ్ బి) అమ్మకాలు ఏకంగా 17 శాతం పెరగడం గమనార్హం. మల్టీప్లెక్స్‌ల మొత్తం రాబడిలో దాదాపు సగానికి పైగా ఆదాయం కేవలం ఈ చిరుతిళ్లు, కూల్‌డ్రింక్స్ విక్రయాల నుంచే వస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నేటి మల్టీప్లెక్స్ సంస్కృతిలో కస్టమర్ సర్వీస్ తీరు కూడా విప్లవాత్మకంగా మారింది. మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకుడు సీట్లో కూర్చోగానే ``ఏం ఆర్డర్ ఇస్తారు?`` అంటూ సేల్స్ పర్సన్ నేరుగా వారి వద్దకే వచ్చి ఆర్డర్లు తీసుకునే స్థాయికి బిజినెస్ మోడల్ ఇంప్రూవ్ అయింది. మల్టీప్లెక్స్ అధినేతలు ఇంతగా దిగివచ్చి మార్కెటింగ్ చేస్తేనే వారి వ్యాపారం నిలబడుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం. అధిక మెయింటెనెన్స్ ఖర్చులు, ఏసీ, ప్రొజెక్టర్లు, పన్నులు, సిబ్బంది జీతాలు చెల్లించాలంటే ఫుడ్ విభాగం అందించే అధిక లాభాల మార్జిన్ థియేటర్ యాజమాన్యాలకు అత్యంత రక్షణ కవచంగా మారుతోంది.

అయితే నాణేనికి మరోవైపు చూస్తే.. ఫుడ్ అండ్ బెవరేజెస్‌పై విపరీతంగా పెంచేసిన ధరలు సామాన్య ప్రేక్షకుడికి తీవ్ర భారంగా మారుతున్నాయి. టికెట్ ధరకు రెట్టింపు స్థాయిలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు ఉండటంతో కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే జనం వెనుకంజ వేస్తున్నారు. ఈ ధరలను నియంత్రించకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించే ప్రమాదముందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ర‌క‌ర‌కాల‌ వెరైటీ రుచుల‌తో జిహ్వ‌ను ఊరించే ఆహార పదార్థాలను సహేతుకమైన ధరలకు అందుబాటులో ఉంచితేనే ప్రేక్షకుల రాక పెరిగి.. బాక్సాఫీస్ వద్ద నిలకడైన ఆదాయం సాధ్యమవుతుంద‌నేది ఒక విశ్లేష‌ణ‌.

ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పీవీఆర్, సినీపోలిస్ వంటి దిగ్గజ మల్టీప్లెక్స్ చైన్లు ఈ ఎఫ్ అండ్ బీ ఆదాయంతో నష్టాల నుండి గట్టెక్కి లాభాల్లోకి వస్తున్నా కానీ.... తెలుగు రాష్ట్రాల్లోని అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగించలేక మూతపడే దిశగా వెళ్తున్నాయి. పరిమితమైన క్యాంటీన్ ఆదాయం, కేవలం టికెట్ కలెక్షన్లపైనే ఆధారపడటం వల్ల సింగిల్ స్క్రీన్ల నిర్వహణ పెను భారమై కాలంతో పాటు మాయమవుతున్నాయ‌నే వాద‌న ఉంది.