Begin typing your search above and press return to search.

డ్యాన్సర్ మాధురి ఆత్మహత్యాయత్నం వెన‌క కార‌ణం?

ప్రముఖ తెలుగు ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటన ప్రస్తుతం పరిశ్రమతో పాటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

By:  Sivaji Kontham   |   7 Sept 2026 7:55 AM IST
డ్యాన్సర్ మాధురి ఆత్మహత్యాయత్నం వెన‌క కార‌ణం?
X

ప్రముఖ తెలుగు ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటన ప్రస్తుతం పరిశ్రమతో పాటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. న్యాయం జరగడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకునేందుకు యత్నించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ ఊహించని ఘటన వెనుక పెళ్లి పేరుతో జరిగిన మోసం.. ఆపై ఎదురైన వేధింపులే ప్రధాన కారణాలని వెల్లడైంది.

ఈ వివాదానికి ముఖ్య కారణం తోటి ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి అని సమాచారం. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడని.. ఆ తర్వాత మోసం చేశాడని మాధురి ఆరోపించింది. వేములవాడలోని ఒక హోటల్ గదిలో వీరిద్దరూ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వచ్చి దాడి చేయడంతో ఈ వ్యవహారం మొదటగా బయటకు వచ్చింది.

బాధిత డ్యాన్సర్ వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసింది. తనను మోసం చేయడమే కాకుండా.. తన ఫోటోలు- వీడియోలను మార్ఫింగ్ చేసి నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని.. అతడి కుటుంబ సభ్యులు కూడా తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

అయితే కేసు నమోదు చేసినా పోలీసులు అతడిపై సరైన చర్యలు తీసుకోలేదని.. అతడిని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాధురి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం ఎంత పోరాడినా ఫలితం లేకపోవడం.. సమాజంలో ఎదురవుతున్న అవమానాలు .. మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ తీవ్ర నిర్ణయానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

మాధురి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తలుపులు పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు.