Begin typing your search above and press return to search.

ఈసారి పండగ సినిమాలు ఏడాది మధ్యలో వచ్చి ఉంటే?

అందుకే.. ఇప్పుడో కొత్త చర్చ మొదలైంది. సంక్రాంతి సినిమాలుగా విడుదలైన ఐదు సినిమాల్లో ఏడాది మధ్యలో ఏదో ఒక వారంలో విడుదలైతే వేటి పరిస్థితి ఎలా ఉండేది? అన్నది ప్రశ్నగా మారింది.

By:  Garuda Media   |   17 Jan 2026 12:27 PM IST
ఈసారి పండగ సినిమాలు ఏడాది మధ్యలో వచ్చి ఉంటే?
X

ఇటీవల కాలంలో ఏ సంక్రాంతికి లేని విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అచ్చ తెలుగు థియేటర్ లో విడుదలయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున బ్యాక్ టు బ్యాక్ విడుదలైన ఈ సినిమాల ఫలితమేంటి? ఏ సినిమా హిట్ కొట్టింది? మరే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుగునాట చిన్న పిల్లాడికి కూడా తెలిసిన ముచ్చట్లే. ఇలాంటి వేళ ఒక ఆసక్తికర అంశం మీద చర్చ నడుస్తోంది. దీనికి కారణం.. సినిమాలు బాగుండి కూడా తగినన్ని థియేటర్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి.

అందుకే.. ఇప్పుడో కొత్త చర్చ మొదలైంది. సంక్రాంతి సినిమాలుగా విడుదలైన ఐదు సినిమాల్లో ఏడాది మధ్యలో ఏదో ఒక వారంలో విడుదలైతే వేటి పరిస్థితి ఎలా ఉండేది? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని పలువురితో మాట్లాడినప్పుడు.. ఆసక్తికర అంశాలు వచ్చాయి. అదేమంటే.. ఈ సంక్రాంతి సీజన్ కు మొదలైన మొదటి సినిమా ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించిన ‘ది రాజా సాబ్’ ఫలితం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదే సినిమా సంక్రాంతి రేసులో కాకుండా.. విడిగా విడుదలై ఉంటే? అన్న ప్రశ్నకు చూస్తే.. సమాధానం వేరుగా వచ్చే పరిస్థితి. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌత్ టాక్ ఇచ్చే ఎఫెక్టు అంతా ఇంతా కాదు. దీనికి తోడు టికెట్ ధరలు పెరగటం మరో అంశం. వీటన్నింటికి మించి మరో ఇబ్బందికర అంశం ఉంది. అదేమంటే.. ఒకటికి నాలుగు సినిమాలు చూసే ఆప్షన్ ఉండటం.. పండుగ సెలవుల్లో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చూడాలన్న ఆలోచనతో ఉన్న వాటిల్లో చాలా బాగున్న వాటినే చూడాలన్న ఎంపిక చేసుకునే మైండ్ సెట్ ప్రేక్షకుల్లో ఉంటుంది.

దీంతో.. చూడాల్సిన సినిమాల్ని సైతం మిస్ చేసుకునే పరిస్థితి. ది రాజాసాబ్ పక్కాగా పండగకే రావాల్సిన అవసరం లేదు. ఈ జోనర్ మూవీ ఏడాదిలో ఎప్పుడు వచ్చినా ఫర్లేదు. దీనికి తోడు ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అయినప్పుడు.. అవసరమైనన్ని స్క్రీన్లు అప్పజెప్పే పరిస్థితి పండుగ వేళకు లేకపోవటం ఒక మైనస్ గా చెప్పాలి. సంక్రాంతి రేసులో భాగంగా విడుదలైన రెండో మూవీ.. మెగాస్టార్ నటించిన మన శంకర వరప్రసాద్ గారు.

ఈ మూవీ ఫలితం ఎలా ఉంది. ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదరగొట్టే కలెక్షన్లతో దూసుకెళుతున్న ఈ మూవీ.. పక్కాగా సంక్రాంతికే రావాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి కూడా పక్కాగా పండగ వేళలోనే రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. పండగ్కి రావటం.. ఆ వెంటనే మరిన్ని సినిమాలు విడుదలకు క్యూలో ఉండటంతో.. స్క్రీన్లు అవసరమైనంత రభారీగా ప్లాన్ చేయలేని పరిస్థితి.

ప్రేక్షకులు పాజిటివ్ గా రియాక్టు అవుతున్నా.. మిగిలిన సినిమాలకు దారి చూపించక తప్పనిసరి కావటంతో.. స్క్రీన్లను త్యాగం చేయక తప్పని పరిస్థితి. సంక్రాంతి రేసులో విడుదలైన మూడో మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. నిజానికి పండుగ రేసులో కాకుండా మిగిలిన సమయంలో విడుదలై ఉంటే.. ఫలితం మరోలా ఉండేదన్న వాదన వినిపిస్తోంది. ఈ సినిమాకు అవసరమైనన్ని స్క్రీన్లు సర్దుబాటుతో కిందా మీదా పడిన పరిస్థితి. అయినా.. అనుకున్నంతగా సర్దలేని పరిస్థితి. ఈ మూవీని చూస్తే అర్థమయ్యేదొక్కటే.. రైట్ మూవీ.. రాంగ్ టైమింగ్ అన్న మాట వినిపిస్తోంది.

ఆ తర్వాత విడుదలైన చివరి రెండు సినిమాలు..‘‘అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి’’.ఈ రెండు సినిమాల్లో అనగనగా ఒక రాజు సంక్రాంతికి సెట్ అయ్యే మూవీగా చెప్పాలి. ఏడాది మధ్యలో కంటే కూడా సంక్రాంతి పండుగ వేళలో విడుదల కావటమే కరెక్టు అన్న మాట వినిపిస్తోంది. ఇక.. శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ విషయానికి వస్తే.. ఏడాది మొత్తంలో ఏ టైంలో అయినా ఈ మూవీ విడుదలై ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఇలా ఈ పండక్కి విడుదలైన సినిమాల్లో అత్యధికం ఏడాది మొత్తంలో ఎప్పుడు విడుదలైనా సక్సెస్ అయ్యే పరిస్థితి. పండుగ హడావుడిలో కాకుండా.. విడి రోజుల్లో విడుదలై ఉంటే.. ఇప్పుడు దక్కిన విజయానికి మించి సొంతమయ్యేదన్న అభిప్రాయం పలువురి నోట వినిపించటం గమనార్హం. మీరేమంటారు?