Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్స్ ఎవ‌రు?

టాలీవుడ్‌లో ఇప్పుడు ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు మా స్టార్ అంటే మా స్టార్ అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు.

By:  Ravindar Gorantla   |   13 March 2026 4:00 AM IST
ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్స్ ఎవ‌రు?
X

టాలీవుడ్‌లో ఇప్పుడు ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు మా స్టార్ అంటే మా స్టార్ అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. దీంతో అస‌లు ద‌క్షిణాదికి సంబంధించి ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్‌, స్టార్స్ ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. `బాహుబ‌లి` సిరీస్ సినిమాల‌తో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత `పుష్ప‌2` సంచ‌ల‌న విజ‌యంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఆర్ఆర్ఆర్‌` బ్లాక్ బ‌స్టర్‌తో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

అయితే ద‌క్షిణాది నుంచి పాన్ ఇండియా స్టార్‌, స్టార్స్ అనిపించుకుంది మాత్రం ప్ర‌భాస్‌, అల్లు అర్జున్ మాత్రం కాద‌న్న విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. ద‌క్షిణాది స్టార్‌ల‌లో ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరో మ‌రెవ‌రో కాదు విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో స‌రికొత్త సినిమాల‌తో లోక నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌క‌మ‌ల్‌హాస‌న్‌. 1978లో కె. బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లో క‌మ‌ల్‌, స‌రిత జంట‌గా న‌టించిన రొమాంటిక్ ట్రాజెడీ ల‌వ్‌స్టోరీ మూవీ `మ‌రో చ‌రిత్ర‌`. త‌మిళ‌బ్బాయి, తెలుగ‌మ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌గా దీన్ని కె. బాల‌చంద‌ర్ తెర‌కెక్కించారు. ల‌వ్‌స్టోరీస్‌లో ఎవ‌ర్‌గ్రీన్ ప్రేమ‌క‌థ‌గా నిలిచిన ఈ సినిమానే హిందీలో 1981లో కె. బాల‌చంద‌ర్ `ఏక్ దూజే కేలియే`గా రీమేక్ చేశారు.

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా క‌మ‌ల్‌కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ప్రేమ‌క‌థ‌ల్లో ఇదొక క్లాసిక్‌గా నిలిచిపోయింది. సీఎన్ ఎన్ ఐబిఎన్ 100 గ్రేటెస్ట్ ఇండియ‌న్ ఫిల్మ్స్‌లో చోటు ద‌క్కించుకుంది. ఆ త‌రువాత బాలు మ‌హేంద్ర `వ‌సంత కోకిల‌`ని హిందీతో స‌ద్మాగా, ఆ త‌రువాత డింపుల్‌తో `సాగ‌ర్‌`, గిరఫ్తార్‌, హే రామ్ వంటి సినిమాలు చేశారు క‌మ‌ల్‌. అలా అప్ప‌ట్లోనే త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు.

ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 1983లో `అంధాకానూన్‌`, చాల్ బాజ్‌, హ‌మ్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్, ఉత్త‌ర్ ద‌క్షిణ్ వంటి సినిమాలు చేసి ఉత్త‌ర భార‌తంలోనూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అప్ప‌టికే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ర‌జ‌నీ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ర‌జ‌నీ త‌రువాత కింగ్ నాగార్జున ఆ ఘ‌న‌త‌ని సాధించారు. తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన `శివ‌` రీమేక్‌తో 1991లో హిందీలోకి అడుగుపెట్టారు కింగ్‌. ఆ త‌రువాత అమితాబ్ బ‌చ్చ‌న్, శ్రీ‌దేవిల‌తో క‌లిసి 1992లో `ఖుదాగ‌వా` చేశారు. ఇందులో శ్రీ‌దేవి ద్యుయెల్ రోల్‌లో న‌టించింది.

ద్రోహి, క్రిమిన‌ల్‌, మిస్ట‌ర్ బెచార‌, జ‌ఖ్మ్‌, అంగారే, న‌యా ఆతిష్‌, ఎల్‌.ఓ.సీ కార్గిల్ వంటి సినిమాల్లో న‌టించారు. ఇప్ప‌టికీ అవ‌కాశం ఉంటే హిందీ సినిమాలు చేస్తుంటారు. నాగార్జున త‌మిళ్ంలో డైరెక్ట్‌గా చేసిన మూవీ `ర‌క్ష‌క‌న్‌`(1997). దీన్నే తెలుగులో `ర‌క్ష‌కుడు`గా రిలీజ్ చేయ‌డం తెలిసిందే. వీళ్ల త‌ర‌హాలోనే క‌న్న‌డ న‌టుడు, ద‌ర్శ‌కుడు వి. ర‌విచంద్ర‌న్ 1991లో `శాంతి క్రాంతి` పేరుతో ఓ భారీ పాన్ ఇండియా మూవీని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేశాడు. తెలుగులో నాగార్జున‌, త‌మిళంలో ర‌జ‌నీకాంత్ న‌టించారు. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, నాగార్జున 90ల్లోనే పాన్ ఇండియా సినిమాలు చేశారు. పాన్ ఇండియా అనే ప‌దం అప్పుడు లేక‌పోయినా..ద‌క్షిణాదిలో మొట్ట‌మొద‌టి పాన్ ఇండియా స్టార్స్ వీళ్లే.