Begin typing your search above and press return to search.

మన హీరోల తొలి రూ.100 కోట్ల సినిమా ఏది?

కొందరికి రెండు మూడు సినిమాల్లోనే ఆ అవకాశం వస్తే, సీనియర్ హీరోలకు మాత్రం వందకు పైగా సినిమాలు చేసిన తర్వాత వచ్చింది.

By:  M Prashanth   |   27 Aug 2026 10:31 AM IST
మన హీరోల తొలి రూ.100 కోట్ల సినిమా ఏది?
X

ఈమధ్య రూ.100 కోట్ల గ్రాస్ అంటే తెలుగు సినిమాకు చాలా కామన్. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు తొలి రోజు నుంచే ఆ మార్క్ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ మన స్టార్ హీరోలు కెరీర్‌లో మొదటిసారి రూ.100 కోట్ల సినిమా ఎప్పుడు చూశారో చూస్తే ఒక్కొక్కరిది ఒక్కో లెక్క. కొందరికి రెండు మూడు సినిమాల్లోనే ఆ అవకాశం వస్తే, సీనియర్ హీరోలకు మాత్రం వందకు పైగా సినిమాలు చేసిన తర్వాత వచ్చింది.

తెలుగు సినిమాల్లో రూ.100 కోట్ల మార్క్‌ను చాలా ముందుగానే అందుకున్న హీరో రామ్ చరణ్. మగధీర ఆయనకు రెండో సినిమా మాత్రమే. 2009లోనే రాజమౌళి ఈ సినిమాను అప్పటి తెలుగు సినిమా మార్కెట్‌కు చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మహేష్ బాబుకు దూకుడుతో తొలి రూ.100 కోట్ల సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ ఆ మార్క్ అందించింది.

అల్లు అర్జున్‌కు రేసుగుర్రంతో తొలి రూ.100 కోట్ల గ్రాసర్ వచ్చింది. ప్రభాస్ కెరీర్‌లో ఆ రికార్డు బాహుబలి ది బిగినింగ్‌తో నమోదైంది. ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ ముగ్గురి తర్వాత మార్కెట్ మరింత పెరగడంతో రూ.100 కోట్ల క్లబ్ స్టార్ సినిమాలకు కొత్త టార్గెట్‌గా మారిపోయింది.

సీనియర్ హీరోల పరిస్థితి మాత్రం వేరు. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా, ఆయన కాలంలో రూ.100 కోట్ల మార్కెట్ లేదు. రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తోనే ఆ నంబర్ వచ్చింది. బాలకృష్ణకు అఖండ తొలి రూ.100 కోట్ల సినిమా. వెంకటేష్‌కు ఎఫ్2తో ఆ మార్క్ దక్కింది. నాగార్జునకు సోలోగా రాలేదు కానీ ధనుష్ తో చేసిన మల్టీస్టారర్ కుబేరాతో తొలి రూ.100 కోట్ల గ్రాసర్ వచ్చింది.

మన హీరోల తొలి రూ.100 కోట్ల సినిమాలు

రామ్ చరణ్: మగధీర, 2వ సినిమా

అల్లు అర్జున్: రేసుగుర్రం, 13వ సినిమా

మహేష్ బాబు: దూకుడు, 16వ సినిమా

పవన్ కళ్యాణ్: గబ్బర్ సింగ్, 17వ సినిమా

ప్రభాస్: బాహుబలి ది బిగినింగ్, 17వ సినిమా

ఎన్టీఆర్: జనతా గ్యారేజ్, 26వ సినిమా

రవితేజ: ధమాకా, 69వ సినిమా

వెంకటేష్: ఎఫ్2, 72వ సినిమా

బాలకృష్ణ: అఖండ, 106వ సినిమా

చిరంజీవి: ఖైదీ నంబర్ 150, 150వ సినిమా

నాగార్జున: కుబేరా, 100వ సినిమా మల్టీస్టారర్

ఇందులో రామ్ చరణ్ లెక్క మాత్రం చాలా ముందుంది. రెండో సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్ అందుకున్నాడు. మరోవైపు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలకు సినిమా సంఖ్య ఎక్కువగా కనిపించడం వాళ్ల మార్కెట్ తక్కువ అన్న అర్థం కాదు. వాళ్ల కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో తెలుగు సినిమా మొత్తం మార్కెట్ ఇప్పటిలా లేదు.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా రిలీజ్‌లు, పెరిగిన టికెట్ ధరలు, విదేశీ మార్కెట్ కలిసి రూ.100 కోట్ల నంబర్‌ను చాలా వేగంగా అందుకునే పరిస్థితి తీసుకొచ్చాయి. ఒకప్పుడు మొత్తం రన్‌లో రూ.100 కోట్లు అంటే పెద్ద రికార్డు. ఇప్పుడు కొన్ని సినిమాలకు అదే నంబర్ తొలి రోజు టార్గెట్‌గా మారింది.