క్షమాపణ చెప్పినా తగ్గని వివాదం.. ధురంధర్ హీరోపై కేసు ఫైల్!
సుమారుగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ సినీ పరిశ్రమకు ఊపిరి ఇచ్చింది. అలాంటి ఈ సినిమా సక్సెస్ తో జోష్ మీద ఉన్న రణ్ వీర్ సింగ్ కి తాజాగా బెంగళూరు లాయర్ ప్రశాంత్ మెతల్ భారీ షాక్ ఇచ్చారు.
By: Madhu Reddy | 29 Jan 2026 1:01 PM ISTసినిమా సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలలో చేసే కామెంట్లు అప్పుడప్పుడు వారి తలకు చుట్టుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు గత ఏడాది కమలహాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కన్నడిగుళకు ఆగ్రహం తెప్పించేలా "తమిళ్ నుండి కన్నడ పుట్టింది" అంటూ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా శివరాజ్ కుమార్ ఎదుటే కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అటు శివరాజ్ కుమార్ పై కూడా కన్నడిగులు మండిపడ్డారు. ఇక క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను.. కర్ణాటకలో రిలీజ్ చేయబోమని హెచ్చరించారు కూడా.. తప్పని పరిస్థితిలో కమలహాసన్ దిగివచ్చి క్షమాపణలు కూడా కోరారు.
సరిగ్గా ఇప్పుడు ఇలాంటి చిక్కులే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. గత ఏడాది డిసెంబర్ 5న ధురంధర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు రణ్ వీర్ సింగ్. విడుదలయి నెలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా అక్కడక్కడ థియేటర్లలో ప్రదర్శించబడుతూ కలెక్షన్ల సునామి కురిపిస్తోంది. సుమారుగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ సినీ పరిశ్రమకు ఊపిరి ఇచ్చింది. అలాంటి ఈ సినిమా సక్సెస్ తో జోష్ మీద ఉన్న రణ్ వీర్ సింగ్ కి తాజాగా బెంగళూరు లాయర్ ప్రశాంత్ మెతల్ భారీ షాక్ ఇచ్చారు.
కాంతార సినిమాలోని రిషబ్ శెట్టి నటించిన దైవం నాటకాన్ని వక్రీకరించి.. నవ్వుల పాలు చేసేలా మిమిక్రీ చేయడం వల్లే మత భావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు చేస్తూ.. బెంగళూరు నగర న్యాయవాది ప్రశాంత్ కోర్టుకు వెళ్లి క్రిమినల్ కేసు నమోదు చేయడానికి అనుమతి పొందారు. ఇక కోర్టు అనుమతి పొందిన తర్వాత బెంగళూరు హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కోర్టు ఆర్డర్ ఇచ్చి ఫిర్యాదు నమోదు చేయించారు. దీంతో అక్కడి పోలీసులు రణ్ వీర్ సింగ్ పై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు.
అసలు విషయంలోకి వెళ్తే 2025 నవంబర్లో గోవాలో జరిగిన అంతర్జాతీయ సినిమా ఉత్సవం ముగింపు వేడుకల్లో రణ్ వీర్ కాంతార చాప్టర్ వన్ లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసిస్తూనే.. మరొకవైపు సినిమాలోని రిషబ్ శెట్టి హావభావాలను, క్లైమాక్స్ సీక్వెన్స్ ను మిమిక్రీ చేశాడు. అయితే ఈ మిమిక్రీని తను హాస్యాస్పదం చేసే ప్రయత్నం చేయడంతోనే కన్నడిగులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో వెంటనే క్షమాపణల చెప్పాలని కామెంట్లు చేయగా ..మరికొంతమంది సాంస్కృతిక, మత సాంప్రదాయాలను అవమానించేలా చేస్తున్నాడని విమర్శించారు. ఇక వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ రావడంతో దిగివచ్చిన రణ్ వీర్ సింగ్ అప్పుడే క్షమాపణలు కూడా చెప్పారు.
దీంతో ఈ వివాదం ముగిసిపోయింది అనుకునే లోపే.. బెంగళూరు లాయర్ ఆయన పై ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఆయన సమర్పించిన ఎఫ్ఐఆర్ లో .. "చావుండి దైవం మా కుటుంబ భగవతి. కోస్టల్ కర్ణాటకలో భూతకోల పద్ధతులలో పూజించబడే ప్రాముఖ్యత కలిగిన దేవత అలాంటి దైవాన్ని మహిళా ఆత్మగా వ్యాఖ్యానించడం మతాభిమానులకు అవమానం.. సమాజంలో విభేదాన్ని పెంచే ప్రవర్తన " అంటూ ఆయన తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు
ఇకపోతే ఈ కేసును బెంగళూరు ఫస్ట్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వద్ద పరిగణలోకి తీసుకున్నారు. ఇకపోతే ఏప్రిల్ 8న విచారణకు రావాలి అని కోరుతూ తేదీని నిర్దేశించింది కోర్ట్. అయితే ఈ ఫిర్యాదు 2025 డిసెంబర్ 27న దాఖలు కాగా.. 23 జనవరి 2026న కోర్టు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 175 (3) కింద ఫిర్యాదు నమోదు చేయమని ఆదేశించింది. ప్రస్తుతం ఈయనపై బిఎన్ఎస్ సెక్షన్ 196 , 299 , 302 కింద కేసు నమోదు అయింది. మరి దీనిపై రణ్ వీర్ సింగ్ ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే కోర్టులో ఏప్రిల్ 8న విచారణకు ఆయన తరపు న్యాయవాదులు స్పందించాల్సిందే. మరి ఈ మేరకు త్వరలోనే ఆయనకు నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
