తెలంగాణ సినిమాకు దిల్ రాజు బిగ్ బూస్ట్
మద్రాసు (నేటి చెన్నై) నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చిన సినీపరిశ్రమ ఇక్కడ సకల వసతులతో బలంగా వేళ్లూనుకున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 16 Sept 2025 12:45 PM ISTమద్రాసు (నేటి చెన్నై) నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చిన సినీపరిశ్రమ ఇక్కడ సకల వసతులతో బలంగా వేళ్లూనుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమ (టాలీవుడ్) నేడు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు సినీపరిశ్రమను హాలీవుడ్ ని కొట్టే రేంజుకు ఎదిగేలా తీర్చిదిద్దాల్సిన సందర్భం వచ్చింది. తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ ని ఢీకొడుతున్న ఈ సమయంలో ఇది అత్యంత ఆవశ్యకం.
ఇలాంటి సమయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఫిలింమేకర్స్ హైదరాబాద్ కి వచ్చి సినిమా తీయాలనుకుంటే దాని నిసులభతరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఇప్పుడు అదే పని చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు పరిశ్రమ అగ్రనిర్మాత దిల్ రాజు. తెలంగాణ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) ఛైర్మన్ హోదాలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి సినిమా పురోభివృద్ధికి సహకరించేందుకు నడుంకట్టారు.
ఇకపై 'సింగిల్ విండో' విధానంలో షూటింగులకు అనుమతులు ఇచ్చేందుకు, థియేటర్ సిస్టమ్ ని సరిదిద్దేందుకు ఒక అధికారిక వెబ్ సైట్ కి రూపకల్పన చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వేదికపై ఫిలింమేకర్స్ కి అవసరమైన సకల సమాచారం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న లొకేషన్లు, సాంకేతిక నిపుణులు, స్టూడియోల వెసులుబాటు, హోటల్స్ సమాచారం వగైరా వగైరా సమాచారాన్ని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని దిల్ రాజు వెల్లడించారు. `ఫిలింస్ ఇన్ తెలంగాణ` పేరుతో సంబంధిత శాఖలు, పర్యాటక శాఖ ప్రతినిధులు, సినీపరిశ్రమ ప్రముఖులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్ రాజు పలు ఆసక్తికర అంశాలను ముచ్చటించారు.
సినిమా థియేటర్ల నిర్వహణకు అవసరమైన బీఫామ్ ని ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తున్నామని కూడా దిల్ రాజు ఈ సమావేశంలో వెల్లడించారు. నగరాల్లో పోలీస్ కమిషనర్లు, జిల్లాల్లో అడిషనల్ కమిషనర్లు థియేటర్ల నిర్వహణకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాల్సి ఉందని, కానీ ఈసారి దీనిని ఆన్ లైన్ లోనే సులభతరం చేసేందుకు ఒక కాలమ్ అందుబాటులో ఉంటుందని రాజు తెలిపారు. సినిమా పురోభివృద్ధికి సహకరించే ఈ వెబ్ సైట్ రూపకల్పనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాని పరిశ్రమ దిగ్గజాలను దిల్ రాజు కోరారు. వెబ్ సైట్ సిద్ధం కాగానే సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంయుక్తంగా దానిని ప్రారంభిస్తారని దిల్ రాజు వెల్లడించారు.
