పర భాషా సినిమా రీమేక్ హక్కులు కొనుగోలు చేయాలంటే?
ఇటీవలి కాలంలో చాలా మంది ఫిలింమేకర్స్ రీమేక్ సినిమాలపై ఆధారపడుతున్నారు. కానీ రీమేక్ హక్కులు కొనుగోలు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసింది తక్కువమందికే.
By: Sivaji Kontham | 24 Sept 2025 9:46 AM ISTఇటీవలి కాలంలో చాలా మంది ఫిలింమేకర్స్ రీమేక్ సినిమాలపై ఆధారపడుతున్నారు. కానీ రీమేక్ హక్కులు కొనుగోలు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసింది తక్కువమందికే. అసలు ఇరుగు పొరుగు భాషల్లో ఏదైనా సినిమా రీమేక్ హక్కులను కొనాలంటే నియమం ఏమిటి? అంటే... ఆ సినిమా రీమేక్ హక్కులు తమకు మాత్రమే దఖలు పడినట్టు వాదించడం ఎలానో నిర్మాతలకు తెలియాల్సి ఉంది.
ఆ రకంగా చూస్తే.. రీమేక్ హక్కుల కోసం నిర్మాత రిలీజ్ చేసే పత్రికా ప్రకటన లేదా పబ్లిక్ నోటీస్‌లో ప్రతిదీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తమకు ఏ విభాగంలో హక్కులు దక్కాయో ఈ నోటీస్‌లో స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ కొనుగోలు అన్ని భారతీయ భాషలు, ప్రపంచ భాషలలో రీమేక్ హక్కులను, ఉత్పన్న హక్కులను కలిగి ఉన్నామని, ఇందులో అన్ని మాధ్యమాలు, ప్లాట్‌ఫామ్‌లలో రీమేక్‌లను తెరకెక్కించడం, ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడంపై తమకు మాత్రమే హక్కులు న్నాయని, ఈ హక్కులు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో సినిమాను డబ్బింగ్ చేయడం, సబ్‌టైటిలింగ్ చేయడం వరకు కూడా వర్తిస్తాయని ప్రకటనలో వెల్లడించాలి.
కొనుగోలు చేసిన ఏదైనా సినిమాకు సంబంధించిన అన్నివిధాలా మేధో సంపత్తికి సంబంధించి ఏకైక చట్టబద్ధమైన యజమాని తాము మాత్రమేనని, సంపూర్ణంగా మూడవ పక్షం నుండి రైట్స్ విముక్తి పొందాయని నోటీసులో పేర్కొనాల్సి ఉంటుంది. దీనిపై ఛాలెంజ్ చేసే ఆసక్తిగల పార్టీలు ఏవైనా ఉంటే, నోటీసు వచ్చిన 15 రోజుల్లోపు తమ వాదనలను దాఖలు చేయాలని, ఎటువంటి హక్కులను వదులుకోకుండా ఉండాలని కూడా కథనంలో రాయాలి.
ఇటీవలి కాలంలో రీమేక్ రైట్స్ లేదా డబ్బింగ్ రైట్స్ విషయంలో ఇతరులతో ఘర్షణలు తలెత్తకుండా ఉండటానికి చట్టాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. తమకు దఖలు పడినవి సంపూర్ణ రీమేక్ హక్కులా? లేక పాక్షికంగా కొన్ని రైట్స్ మాత్రమే దక్కాయా? అన్నది కూడా కొనుగోలు చేసిన వ్యక్తికి స్పష్ఠత అవసరం. తమకు దక్కిన హక్కులు మాత్రమే కాకుండా, ఇతరత్రా హక్కులను ఎవరైనా కొనుగోలు చేసారా లేదా? అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. మేధోసంపత్తి హక్కుల వ్యవహారం అంత సులువుగా అర్థమయ్యేది కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
