సినిమాలపై ప్రభుత్వాల సాధింపులు ఇంకెన్నాళ్లు?
తమిళనాడులో సినిమాల్ని, రాజకీయాల్ని విడివిడిగా చూడలేం. దశాబ్ధాల పాటు కరుణానిధి వర్సెస్ అమ్మ జయలలిత వార్ గురించి తెలిసిందే
By: Sivaji Kontham | 12 Sept 2025 5:00 AM ISTతమిళనాడులో సినిమాల్ని, రాజకీయాల్ని విడివిడిగా చూడలేం. దశాబ్ధాల పాటు కరుణానిధి వర్సెస్ అమ్మ జయలలిత వార్ గురించి తెలిసిందే. తమిళనాడును తమిళ సినిమా దిగ్గజాలు ముఖ్యమంత్రులుగా ఏలడంతో సినిమాతో రాజకీయం మమేకమైంది. దీనివల్ల సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడలేని పరిస్థితి. ఇప్పుడు లెజెండరీ నటులు, ముఖ్యమంత్రులు అంతర్థానం అయినా, వారి వారసత్వాలు మిగిలే ఉన్నాయి. కరుణానిధి వారసుడు ఎం.కె స్టాలిన్ ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలిస్తున్నారు. ఆయన వారసులు సినీరంగంలో, రాజకీయ రంగంలో రెండు పడవల్ని నడిపిస్తున్నారు.
తమిళనాడులో జయలలిత సన్నిహితులు సినీరంగంలో ఉన్నారు. వారితో కరుణానిది- స్టాలిన్ అనుచర వర్గాలు ఈ రంగంలో పోటీపడుతున్నారు. రాజకీయంగా వైరి వర్గాల నిర్మాతలు, హీరోలను జయలలిత ఏ రకంగా అణచివేసారో ఒక చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అంతటి వాడికే జయలలితతో చిక్కులొచ్చిపడిన సంగతి తెలిసిందే. అక్కడ స్టార్లు అందరూ ఏదో ఒక పార్టీ పంచన చేరి నిత్యం ప్రత్యర్థితో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. తారలపై రాజకీయ కక్షలు చాలా సందర్భాలలో బయటపడ్డాయి. ఇటీవల టికెట్ రేట్ల సవరణతో పెద్ద స్టార్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న స్టాలిన్ ప్రభుత్వం ఉద్ధేశం ఏమిటన్నదానిపైనా చర్చ సాగుతోంది. ప్రజలకు మేలు జరిగినా కానీ, టికెట్ ధరలు ఇండస్ట్రీకి నష్టాలను మిగులుస్తున్నాయనే ఆందోళన ఉంది. అంతంత మాత్రంగా ఉండే పరిశ్రమకు లాభాలు దారుణంగా పడిపోవడానికి రాజకీయాలు కూడా ఒక కారణం.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోను ఇలాంటి పరిస్థితి బయటపడుతుందని ఎవరూ ఊహించలేదు. మెగా కుటుంబ హీరోలతో పాటు మొత్తం సినీరంగంపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధింపులకు పాల్పడిన విధానం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు తెర లేపింది. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ, టికెట్ ధరలను ప్రభావితం చేసిన తీరు ఇప్పటికీ చర్చకు తెర తీస్తూనే ఉంది. సినీపెద్దలు అననుకూలత కారణంగా, సినీరంగంపై సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడ్డారని చర్చించుకున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే, ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా తెరాస వర్గాలు సినీపరిశ్రమను టార్గెట్ చేసాయి. అప్పట్లో ఉద్యమం పేరుతో సెట్లకు నిప్పు పెట్టిన వైనం పెద్ద చర్చకు తెర తీసింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారాయి. తెలుగు చిత్రసీమకు అనుకూలంగా ప్రభుత్వాలు మారాయి. తెరాస ప్రభుత్వం అయినా, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సినీపరిశ్రమ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నాయి. కానీ అప్పుడప్పుడు ఒక వర్గం స్టార్లపై ప్రభుత్వాల సాధింపులు బయటపడుతూనే ఉన్నాయి.
మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాళ్‌లో అధికార తృణమూల కాంగ్రెస్ (టిఎంసి) వివేక్ అగ్నిహోత్రి `ది బెంగాళ్ ఫైల్స్` సినిమాపై అనధికారిక నిషేధం అమలు చేయడం చర్చనీయాంశమైంది. తన సినిమాపై మమతా బెనర్జీ ప్రభుత్వం కక్ష కట్టి రిలీజ్ ని ఆపారని దర్శకుడు అగ్నిహోత్రి ఆవేదన చెందారు. సెన్సార్ అవ్వకుండా ప్రభుత్వ పెద్దలే వెనకుండి కథ నడపిస్తున్నరని ఆరోపించారు. సినిమాలపై రాజకీయం చేయడం తగదని అన్నారు. ది బెంగాళ్ ఫైల్స్ రాజకీయ అంశాలతో ముడిపడిన సినిమా కాబట్టి బెంగాళ్ లో ఈ పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు హిందీ చిత్రసీమలో క్వీన్ కంగన రనౌత్ భాజపా ఎంపీగా రాజకీయాల్లో ఉన్నందున తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కంగన సినిమాలు రిలీజ్ కాకుండా నిలువరించడానికి రాజకీయ కుట్రలు కారణం అన్న చర్చ సాగింది. రాజకీయాలతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న చాలా మంది హీరోలకు ఊహించని సమస్యలు తలెత్తడం రెగ్యులర్ గా చూసేదే. రాజకీయంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సినీరంగాన్ని టార్గెట్ చేయడం అత్యంత సులువుగా మారింది. టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ మాలీవుడ్ పరిశ్రమ ఏదైనా ఈ తరహా కుట్రలు సహించదగినవి కాదు. కేవలం 5 శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉండే సినీపరిశ్రమను నమ్ముకుని జీవనోపాధి పొందేవారిపై ఇది అసమంజసమైన పరిణామం.
