Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ల కంటే రిస్క్ మేనేజ్‌మెంటే ముఖ్యం!

పరిశ్రమలో విజయం ఎంత తాత్కాలికమో.. వ్యాపార సమీకరణలు అంత శాశ్వతం. ఎంతటి ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడైనా? వరుసగా ఫ్లాప్‌లు ఎదురైతే అత‌డి చుట్టూ ఉన్న మార్కెట్ సమీకరణలు తలకిందులవుతాయి.

By:  Srikanth Kontham   |   22 Sept 2026 1:28 PM IST
సెంటిమెంట్ల కంటే రిస్క్ మేనేజ్‌మెంటే ముఖ్యం!
X

పరిశ్రమలో విజయం ఎంత తాత్కాలికమో.. వ్యాపార సమీకరణలు అంత శాశ్వతం. ఎంతటి ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడైనా? వరుసగా ఫ్లాప్‌లు ఎదురైతే అత‌డి చుట్టూ ఉన్న మార్కెట్ సమీకరణలు తలకిందులవుతాయి. ఒకప్పుడు వరుసగా పది సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడికైనా? చివరిగా వచ్చిన మూడు సినిమాలు పరాజయం పాలైతే? అదే హీరో మళ్లీ ఆ డైరెక్ట ర్ కి అవకాశం ఇవ్వడానికి వెనుకాడటం పరిశ్రమలో తరచుగా కనిపించే కఠినమైన నిత్యసత్యం.

సినిమా ప్రపంచంలో గత వైభవాల కంటే ప్రస్తుత ఫార్మ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పది హిట్లు ఇచ్చిన ఘనమైన చరిత్ర ఉన్నా? చివరి మూడు ఫెయిల్యూర్స్ అనేవి సదరు దర్శకుడి కథా ఎంపిక, మేకింగ్ శైలి లేదా ప్రేక్షకులకు మారిన అభిరుచులకు అనుగుణంగా లేవనే సంకేతాన్ని ఇస్తాయి. ప్రేక్షకుల టేస్ట్ ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న కాలంలో పాత పద్ధతులనే నమ్ముకుని సినిమాలు తీస్తే వర్కవుట్ కాదనే భయం హీరోలలో నెలకొనడం దీనికి ప్రధాన కారణం.

ఈ వెనుకంజ వెనుక అత్యంత కీలకమైన అంశం బాక్సాఫీస్ బిజినెస్ , మార్కెట్ వ్యాల్యూ. భారీ బడ్జెట్ సినిమాల్లో హీరో మార్కెట్‌తో పాటు దర్శకుడి ఫార్మ్ కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని శాసిస్తుంది. వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కులకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవచ్చు. హీరోలు తమ స్టార్‌డమ్‌ను, బిజినెస్ ప్రామాణికతను కాపాడుకోవడానికి నిర్మాతలు, వినియోగదారులు ఇచ్చే సలహాల మేరకు నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది.

అంతే కాదు హీరోల స్వయంరక్షణ , కెరీర్ గ్రాఫ్ కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక్క ఫ్లాప్ వస్తేనే హీరోల ఇమేజ్‌పై, మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం పడే రోజులివి. అలాంటిది వరుసగా మూడు ఫ్లాప్‌లు ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి అది కూడా నిరాశపరిచితే? ఆ ప్రభావం హీరో కెరీర్‌పై దీర్ఘకాలికంగా పడుతుంది. ఈ నేప‌థ్యంలోనే హీరోలు సెంటిమెంట్ల కంటే ప్రాక్టికల్ ఆలోచనలకే మొగ్గు చూపుతారు. గతంలో హిట్లు ఇచ్చారనే కృతజ్ఞత ఉన్నా? ప్రస్తుత పోటీ రేసులో వెనుకబడిపోతామనే భయం హీరోల‌ను పునరాలోచనలో పడేస్తుంది.

మరొ ముఖ్యమైన కారణం జడ్జిమెంట్‌పై కలిగే అనుమానం .. పరిశ్రమలో వచ్చే నెగెటివ్ వైబ్స్. హిట్లు వస్తున్నంత కాలం దర్శకుడి విజన్‌ను, నిర్ణయాలను హీరోలు గుడ్డిగా నమ్ముతారు. కానీ వరుస ఫెయిల్యూర్స్ వస్తే ఆ దర్శకుడి కథా కథనాల ఎంపికపై నమ్మకం సడలుతుంది. దర్శకుడు క్రియేటివ్‌గా ఎగ్జాస్ట్ అయ్యారా లేదా ట్రెండ్‌ను పట్టుకోలేకపోతున్నారా? అనే భావన కలుగుతుంది. దీంతో పాటు సోషల్ మీడియా కాలంలో ఫ్లాప్ కాంబినేషన్ అనౌన్స్ కాగానే వచ్చే నెగెటివ్ ట్రోలింగ్ కూడా హీరోలపై విపరీతమైన ఒత్తిడిని తెస్తుంది.

చివ‌రిగా చిత్రసీమ అనేది పూర్తిగా వాణిజ్య సూత్రాలపై ఆధారపడి నడిచే వ్యాపార ప్రపంచం. ఇక్కడ వర్తమానంలో ఇచ్చే విజయం మాత్రమే మాట్లాడటానికి అర్హత నిస్తుంది. గతంలో పది సక్సెస్ లు ఇచ్చారనే గౌరవం ఎప్పటికీ ఉన్నప్పటికీ ప్రస్తుత ఫెయిల్యూర్సే భవిష్యత్తు అవకాశాలను నిర్ణయిస్తాయి. అయితే ఆ దర్శకుడు మళ్లీ ఏదో ఒక ప్రాజెక్ట్‌తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తే అదే హీరో మళ్లీ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించే అవకాశం కూడా సినీ పరిశ్రమలో ఖచ్చితంగా ఉంటుందన్న‌ది అంతే వాస్త‌వం.