స్టార్ల మూర్ఖత్వం ఫలితం కాస్ట్ ఫెయిల్యూర్
అయితే హిందీ చిత్రసీమ వైపరీత్యాల గురించి ఇటీవల ఓ సినీపెద్ద చెప్పిన విషయాలు షాక్ కి గురి చేసాయి.
By: Sivaji Kontham | 26 Sept 2025 10:21 AM ISTఇటీవలి కాలంలో సినిమాల కాస్ట్ ఫెయిల్యూర్ గురించి, అదుపు తప్పిన బడ్జెట్ల గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ చాలా కాలంగా అదుపు తప్పిన బడ్జెట్లతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటే, తెలుగు చిత్రసీమలో కూడా కొన్ని భారీ చిత్రాల విషయంలో బడ్జెట్లు అదుపు తప్పుతున్నాయని విమర్శలున్నాయి.
అయితే హిందీ చిత్రసీమ వైపరీత్యాల గురించి ఇటీవల ఓ సినీపెద్ద చెప్పిన విషయాలు షాక్ కి గురి చేసాయి. కొంతమంది స్టార్లు సెట్స్ కి రావడానికి గొంతెమ్మ కోర్కెలు కోరతారని, కొందరు హీరోల కోసం ఆరు వ్యానిటీ వ్యాన్ లు అయినా కనీసం అందుబాటులో ఉండాలని పట్టుబడతారని అతడు వెల్లడించాడు. మేకప్ కోసం - ఫ్రెండ్స్ తో మీటింగుల కోసం - వ్యాయామం చేయడానికి.. భోజనాల కోసం.. సిబ్బంది కోసం ఇలా కనీసం 6 వ్యానిటీ వ్యాన్ లు కావాలని కొందరు హీరోలు కోరుతున్నారని చెప్పాడు. ఇది నిజంగా నిర్మాత తలకు బొప్పి కట్టించే వ్యవహారం.
స్టార్ల గొంతెమ్మ కోర్కెల కారణంగా అదుపు తప్పుతున్న ఖర్చంతా నిర్మాతలే భరించాలా? అంటే.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇచ్చిన సమాధానం హృదయాలను గెలుచుకుంది. తాను ఎల్లపుడూ వ్యక్తిగత సిబ్బంది కోసం తాను మాత్రమే చెల్లిస్తానని అది నిర్మాతకు అదనపు భారం కాకూడదని అమీర్ ఖాన్ అన్నారు. తన వ్యక్తిగత డ్రైవర్ కి తాను మాత్రమే చెల్లిస్తానని అన్నాడు. సెట్స్ లో సినిమా కోసం పని చేసే సిబ్బందికి మాత్రం నిర్మాత బాధ్యుడు అని కూడా తెలిపారు. ఒక నిర్మాతగా సాధక బాధకాలు తెలిసినవాడిగా అమీర్ ఈ మాట అన్నారు. అయితే సల్మాన్ ఖాన్ లాంటి హీరో సెట్స్ కి ఆలస్యంగా వస్తే, అప్పటివరకూ ఇతర నటీనటులు, సిబ్బంది నిదుర పోవడానికి సపరేట్ ఏర్పాట్లు అవసరమవుతున్నాయని, వ్యానిటీ ఖర్చు కూడా పెరుగుతుందని, ఇంతకుముందు మురుగదాస్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన తరుణమిది.
నిజానికి బడ్జెట్లు ఎందువల్ల అదుపు తప్పుతున్నాయి? అంటే.. భారీ సెట్స్ కారణంగా, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా అదుపు తప్పాయని భావిస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. తారల క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఇలాంటివి తప్పడం లేదు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగిన దీపిక పదుకొనే, తన పాతిక మంది సిబ్బందికి జీతం చెల్లించాలని నిర్మాత ముందు డిమాండ్ ఉంచుతుందని కూడా కథనాలొచ్చాయి. ఇక అమీర్ ఖాన్ మాత్రం క్రమశిక్షణ విషయంలో ఎప్పుడూ జాగ్రత్త వహిస్తారు. కానీ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు నిర్మాతకు అదనపు భారం పెంచుతున్నారని మురుగదాస్ చెప్పిన దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సీనియర్ హీరోలలో అమీర్ ఖాన్, హృతిక్, అమితాబ్ లాంటి వారు తమ సొంత పరివారానికి తామే చెల్లించుకుంటున్నారు. కానీ నేటి జెన్ జెడ్ స్టార్లకు నిర్మాతలే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని సమాచారం.
