Begin typing your search above and press return to search.

మూవీ ఫ్లాప్ అయితే హీరోయిన్ దే తప్పా?

సోషల్ మీడియాలో మాత్రం చాలాసార్లు హీరోయిన్‌ ను టార్గెట్ చేస్తుంటారు. దీంతో మూవీ ఫ్లాప్ అయితే హీరోయిన్ దే తప్పా? అనే ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   14 July 2026 11:40 AM IST
మూవీ ఫ్లాప్ అయితే హీరోయిన్ దే తప్పా?
X

సినిమా విజయం సాధిస్తే హీరో, దర్శకుడు, నిర్మాతల ఖాతాలోకి వెళ్లే ప్రశంసలు.. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం విమర్శలు ముందుగా హీరోయిన్ పై చేయడం సినీ పరిశ్రమలో కొత్త విషయం కాదు. కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం, సంగీతం, ప్రమోషన్స్, విడుదల సమయం వంటి ఎన్నో అంశాలు సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపించినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలాసార్లు హీరోయిన్‌ ను టార్గెట్ చేస్తుంటారు. దీంతో మూవీ ఫ్లాప్ అయితే హీరోయిన్ దే తప్పా? అనే ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది.

సినిమా అనేది ఒక వ్యక్తి కష్టం కాదు. వందల మంది కలిసి చేసే ప్రయత్నం. కథ ఎంపిక నుంచి తెరకెక్కింపు వరకు దర్శకుడి పాత్ర కీలకం. ఆ కథను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో హీరో, ఇతర క్యాస్టింగ్, టెక్నీషియన్స్ కూడా బాధ్యత వహిస్తారు. అయినప్పటికీ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే హీరోయిన్ యాక్టింగ్, గ్లామర్ లేదా ఆమె లక్‌ ను కారణంగా చూపించే ప్రయత్నాలు కనిపిస్తుంటాయి.

ప్రత్యేకించి సోషల్ మీడియా ఎఫెక్ట్ పెరిగిన తర్వాత ఆ ధోరణి మరింత పెరిగింది. ఒక సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హీరోయిన్‌ పై ట్రోల్స్ మొదలవుతున్నాయి. "ఈ హీరోయిన్ ఉంటే సినిమాలు ఆడవు", "ఐరన్ లెగ్" వంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్ట్రాంగ్ స్టోరీ, ఆకట్టుకునే కథనం, సరైన ప్రమోషన్స్, ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కంటెంట్ వంటి అనేక అంశాలు కలిసి రావాలి.

ఆ అంశాల్లో ఏ ఒక్కటి వీక్ గా ఉన్నా సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కేవలం హీరోయిన్‌ ను మాత్రమే బాధ్యురాలిగా చూపించడం సరైన విధానం కాదని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సినిమా హిట్ అయితే మాత్రం హీరోయిన్‌ కు వచ్చే గుర్తింపు చాలా తక్కువగానే ఉంటుందనే వాదన వినిపిస్తోంది. హీరో స్టార్‌ డమ్, దర్శకుడి టాలెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతారు. కానీ అదే సినిమా ఫెయిల్ అయితే హీరోయిన్ పేరు చర్చకు రావడం గమనార్హం.

దీంతో విజయానికి అందరిదీ క్రెడిట్.. ఫ్లాప్ కు మాత్రం హీరోయిన్‌ దే బాధ్యత అన్న భావన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో భాగ్యశ్రీ బోర్సే వంటి పలువురు హీరోయిన్లు కూడా ఆ అంశంపై స్పందించారు. సినిమా రిజల్ట్ ఒక్కరి చేతుల్లో ఉండదని, ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ దానిపై ఎఫెక్ట్ చూపుతుందని వారు స్పష్టం చేశారు. ప్రేక్షకుల జడ్జిమెంట్ ను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా విధానంలోనూ మార్పు కనిపిస్తోంది. సినిమా ఎందుకు నచ్చలేదు? ఎక్కడ తప్పు జరిగింది? అనే అంశాలను చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. కథలో బలం లేకపోతే, దర్శకత్వంలో లోపాలుంటే లేదా స్క్రీన్‌ ప్లే వీక్ గా ఉంటే వాటిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. దీంతో ఒక్క హీరోయిన్‌ ను మాత్రమే విమర్శించే పద్ధతి మెల్లగా తగ్గాలని అనేక మంది సినీ ప్రియులు ఇప్పుడు నెట్టింట అభిప్రాయపడుతున్నారు.