Begin typing your search above and press return to search.

సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకులదే తప్పా? స్టార్ డైరెక్టర్ల విచిత్రమైన త‌ర్కం!

సినిమా రంగంలో ఒక చిత్రం సూపర్ హిట్ అయినా లేదా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా దానికి ప్రధాన కారణం అందులోని కథ, కథనాలే అవుతాయి.

By:  Sivaji Kontham   |   26 Jun 2026 12:00 AM IST
సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకులదే తప్పా? స్టార్ డైరెక్టర్ల విచిత్రమైన త‌ర్కం!
X

సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పుడు లేదా ఆశించిన స్థాయిలో ఆడనప్పుడు, దర్శకులు- నిర్మాతలు ఆ తప్పును ప్రేక్షకుల మీదకో, రివ్యూలు రాసే క్రిటిక్స్ మీదకో నెట్టేయడం భారతీయ సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. ఈ ధోరణిని కేవలం ఒక రకమైన `అభద్రతా భావం`.. తమ క్రియేటివ్ లోపాలను ఒప్పుకోలేకపోవడంగానే చూడాలి. ఎంతో శ్రమించి, కోట్లాది రూపాయల బడ్జెట్‌తో సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ అయితే వచ్చే నష్టాన్ని, బాధను తట్టుకోలేక చాలా మంది మేకర్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. కథలో లోపాలు, బలహీనమైన స్క్రీన్‌ప్లేను సరిదిద్దుకోవడానికి బదులుగా.. `ప్రేక్షకులకు ఈ స్థాయి ఇంటెలిజెంట్ సినిమా అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు` అనో లేదా ``సమీక్షకులు కావాలనే నెగెటివ్ రివ్యూలు రాసి సినిమాను తొక్కేశారు!`` అనో మాట్లాడటం వారి పరాజయ సెల్ఫ్ డిఫెన్స్ విధానాన్ని సూచిస్తుంది.

సినిమా రంగంలో ఒక చిత్రం సూపర్ హిట్ అయినా లేదా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా దానికి ప్రధాన కారణం అందులోని కథ, కథనాలే అవుతాయి. కానీ కొంద‌రు స్టార్ డైరెక్టర్లు మాత్రం తమ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి సరికొత్త వింత తర్కాలను తెరపైకి తెచ్చారు. బాలీవుడ్ అగ్ర‌ దర్శకులు సిద్ధార్థ్ ఆనంద్, రాజ్‌కుమార్ హిరాణీలు తమ సినిమాలు ఫ్లాప్ లేదా యావరేజ్‌గా నిలవడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. సినిమా కంటెంట్‌లో లోపాలను ఒప్పుకోకుండా... ప్రేక్షకుల జీవనశైలిని బ్లేమ్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

గతంలో హృతిక్ రోషన్, దీపికా పడుకోణె ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన `ఫైటర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయింది. దీనిపై ఆ సమయంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ``భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు విమానాలలో ప్రయాణించరు..అందుకే వారు ఈ `ఫైటర్` సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు! అంటూ ఒక విచిత్రమైన వివరణ ఇచ్చారు. వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ చిత్రంలో ఎమోషన్స్ పండకపోవడాన్ని పక్కనబెట్టి... ప్రేక్షకులు ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టే సినిమా నచ్చలేదు అనడం అప్పట్లో పెద్ద హాస్యాస్పదంగా మారింది.

ఇదే బాటలో మ‌రో స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ కూడా చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా ఆయన రూపొందించిన `డంకీ` చిత్రంపై భారీ అంచనాలు ఉన్నా థియేటర్లలో ఇది మిశ్రమ స్పందననే దక్కించుకుంది. ఒక ఇంటర్వ్యూలో హిరాణీ మాట్లాడుతూ.. భారతదేశంలో సినిమా చూసే థియేటర్ ఆడియన్స్ అంతా మిడిల్ క్లాస్ వారే... వారికి సులభంగానే వీసాలు వచ్చేస్తాయి. కానీ ఇల్లీగల్ వలసల వెనుక ఉండే బాధలు వారికి తెలియవు. దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే అక్రమంగా సరిహద్దులు దాటుతుంటారు కాబట్టి.. ఈ సబ్జెక్ట్ అందరికీ కనెక్ట్ కాలేదు! అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

దర్శకుల ఈ రెండు భిన్నమైన వింతైన స్టేట్‌మెంట్లపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమా బాగా లేనప్పుడు కథను లేదా స్క్రీన్‌ప్లేను మార్చుకోవాలి కానీ.. ఇలా ప్రేక్షకుల మీద తోసేయడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ లాంటి సీనియర్ డైరెక్టర్ డంకీ సినిమాలో అక్రమ వలసల ప్రక్రియ కంటే లవ్ స్టోరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని... ఆ తప్పును దాచిపెట్టి ఇప్పుడు వీసాల ఇబ్బందులు లేవంటూ ఆడియన్స్‌ను అనడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

స‌ద‌రు టాప్ డైరెక్టర్ల వివరణలు చూస్తుంటే.. తమ చిత్రాల పరాజయానికి క్రియేటివ్ లోపాలను ఒప్పుకోవడానికి వారు సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్ వరకు పలువురు మేకర్స్ పరాజయాల సమయంలో ఈ `సెంటిమెంట్` లేదా `కుట్ర కోణాన్ని` గట్టిగా వాడుకున్నారు. `యూట్యూబ్ థంబ్ నెయిల్స్, నెగెటివ్ టాక్` వల్లే థియేటర్లకు జనాలు రావడం లేదని... మొదటి రోజే సినిమాను చంపేస్తున్నారని వారు ఆరోపిస్తుంటారు. అయితే సినిమా నిజంగా అద్భుతంగా ఉంటే ఎలాంటి నెగెటివ్ ప్రచారాన్నైనా దాటుకుని ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని `మౌత్ టాక్` ద్వారా ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ విషయాన్ని విస్మరించి....ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో తాము విఫలమయ్యామనే నిజాన్ని దాచడానికే కొందరు మేకర్స్ ఈ విధమైన సిద్ధాంతాలను తెరపైకి తెస్తుంటారు.