టామ్ క్రూజ్‌లా యూట్యూబర్ గాల్లో విన్యాసాలు
గాల్లో ఎగిరే విమానం నుంచి ప్రమాదకరంగా వేలాడటం, 10వేల అడుగుల ఎత్తులో పారా చూట్ నుంచి దూకేయడం..
By: Sivaji Kontham | 5 Nov 2025 9:38 PM ISTగాల్లో ఎగిరే విమానం నుంచి ప్రమాదకరంగా వేలాడటం, 10వేల అడుగుల ఎత్తులో పారా చూట్ నుంచి దూకేయడం.. వందల మీటర్ల ఎత్తైన కొండ పైనుంచి బైక్ తో జంప్ చేయడం.. గగుర్పాటుకు గురి చేసే ఛేజ్ లు, సాహసాలతో టామ్ క్రూజ్ విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు నటించిన మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ అద్భుత వసూళ్లను సాధించడం వెనక అతడి హార్డ్ వర్క్, డెడికేషన్ తో పాటు గగుర్పాటుకు గురి చేసే సాహసాలు కూడా ప్రధాన భూమిక పోషించాయి.
అయితే టామ్ క్రూజ్ వీటి కోసం ఎంతగానో శ్రమించాడని కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిచెల్ అచ్చు గుద్దినట్టు టామ్ క్రూజ్ లా సాహసాలు చేయడం చర్చగా మారింది. ఈ భామ యూట్యూబర్‌గా, ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆకట్టుకోవడమే కాదు, గాల్లో ఎగిరే విమానంలోంచి వేలాడుతూ ఆశ్చర్యపరిచింది.
యూట్యూబ్ అమ్మాయి నిజంగానే సాహసనారి అని నిరూపించింది. లాక్ హీడ్ 130 అనే మిలటరీ విమానం నుంచి వేలాడుతూ ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేసిందంటే తనలోని గట్స్ ని మెచ్చుకుని తీరాలి. గంటకు 260 కి.మీల వేగంతో 600 మీటర్ల ఎత్తుకు ఎగిరిన విమానం రెక్క పట్టుకుని వేలాడుతూ ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ. మృత్యువుకు ఆమెకు మధ్య ఒక చిన్న సేఫ్టీ తాడు మాత్రమే అడ్డు. నిజంగా ఒక మహిళ టామ్ క్రూజ్ రేంజులో సాహసాలు చేయడం అంటే ఆమె గట్స్ ని ప్రశంసించకుండా ఉండలేం.
