Begin typing your search above and press return to search.

భద్రత సమస్య : పాక్ వెబ్ సిరీస్ పై నిషేదం...

ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించిన పాకిస్థానీ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగే సమేట్ లో’ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. జాతీయ భద్రతా కారణాలతో 2025 మే 8న జారీ చేసిన అడ్వైజరీని పాటించాలని సూచించింది. డిసెంబర్ 4న గ్లోబల్ ప్రీమియర్ కానున్న ఈ సిరీస్ భారత్‌లో అందుబాటులోకి వస్తుందా అనేది ఇంకా స్పష్టత లేదు.

By:  Sivaji Kontham   |   29 Nov 2026 7:05 PM IST
భద్రత సమస్య : పాక్ వెబ్ సిరీస్ పై నిషేదం...
X

పాక్ న‌టులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన‌ పాకిస్థానీ వెబ్ సిరీస్ జో బచే హై సంగే సమేట్ లో భారత్‌లో స్ట్రీమింగ్ కాకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించడం సినీ, ఓటీటీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా ఆల్ ది లవ్ అవర్ హార్ట్స్ క్యారీ పేరుతో ప్రమోట్ అవుతున్న ఈ రొమాంటిక్ డ్రామా డిసెంబర్ 4న గ్లోబల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతుండగా.. భారత్‌లో దీని విడుదలపై ఫిర్యాదులు అందడంతో కేంద్రం స్పందించింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ మూలాలు ఉన్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లకు భారత్‌లో యాక్సెస్ నిలిపివేయాలని 2025 మే 8న జారీ చేసిన అడ్వైజరీని తప్పనిసరిగా పాటించాలని నెట్‌ఫ్లిక్స్‌కు గుర్తు చేసింది.

గతంలో జూన్ 2025లో భారత సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి పాకిస్థానీ సినిమాలు లేదా సిరీస్‌లను అందుబాటులో ఉంచలేదని నెట్‌ఫ్లిక్స్ తెలియజేయగా.. ఇప్పుడు అదే నిబద్ధతను కొనసాగించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఫర్హత్ ఇష్తియాక్ రాసిన ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో హనియా ఆమిర్, సనమ్ సయీద్, అహద్ రజా మీర్ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. గ్లోబల్ రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఈ సిరీస్ భారత్‌లో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నదానిపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా బహిరంగంగా స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు ఈ పరిణామంపై సోషల్ మీడియాలో భారత్, పాకిస్థాన్ నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు.. వాడివేడి ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తూ స్వాగతిస్తుండగా, మరికొందరు పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను ముందుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాకిస్థాన్‌లో భారతీయ సినిమాల థియేటర్ రిలీజ్‌పై నిషేధం ఉన్నా.. నెట్‌ఫ్లిక్స్ -ప్రైమ్ వీడియో పాకిస్థాన్‌లో ధురంధర్ వంటి భారతీయ చిత్రాలు అందుబాటులో ఉంటూ నెలల తరబడి నంబర్ 1 ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయని కొందరు పాకిస్థానీ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

కొందరు నెటిజన్లు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, సినీ కంటెంట్‌పై ఉన్న ఆంక్షలు తొలగిపోవాలని.. ఇరువైపులా ప్రేక్షకులు కంటెంట్ చూసే వాతావరణం ఉండాలని ఆకాంక్షిస్తుండగా.. మరికొందరు రాజకీయ- ద్వైపాక్షిక అంశాల కోణంలో చర్చను కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 4న గ్లోబల్ ప్రీమియర్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.