Begin typing your search above and press return to search.

ఫౌజీ, వారణాసి, రాకా... పెద్ద సినిమాల పెద్ద రూట్!

ఇప్పుడు స్టార్‌కు ఏ ప్రాంతంలో మార్కెట్ ఉంది, కథ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అన్నది చూసుకుని లాంగ్వేజ్ లను పెంచుతున్నారు.

By:  M Prashanth   |   16 Sept 2026 11:07 AM IST
ఫౌజీ, వారణాసి, రాకా... పెద్ద సినిమాల పెద్ద రూట్!
X

ప్రభాస్ ఫౌజీ, మహేష్ బాబు వారణాసి, అల్లు అర్జున్ రాకా.. మూడు సినిమాలూ భారీ స్థాయిలోనే సిద్ధమవుతున్నాయి. కానీ రిలీజ్ దగ్గర మాత్రం ఒకే ఫార్ములా ఫాలో కావడం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా అనేవారు. ఇప్పుడు స్టార్‌కు ఏ ప్రాంతంలో మార్కెట్ ఉంది, కథ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అన్నది చూసుకుని లాంగ్వేజ్ లను పెంచుతున్నారు.

ఫౌజీ విషయంలో ప్రభాస్ మార్కెట్ అడ్వాంటేజ్. బాహుబలి తర్వాత హిందీలో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు హను రాఘవపూడి తీస్తున్న పీరియడ్ కథను ఐదు భాషల దగ్గరే ఆపకుండా బెంగాలీలో కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉంది. తెలుగు సినిమాలకు ఇది రెగ్యులర్ మార్కెట్ కాదు. అయినా ప్రభాస్ సినిమాతో అక్కడ కూడా మంచి రిలీజ్ ఇవ్వాలని టీమ్ చూస్తోంది.

రాజమౌళి ఇంకా పెద్ద ప్లాన్‌తో ఉన్నారు. వారణాసి సినిమా కోసం దాదాపు 50 భాషల్లో రిలీజ్ చేసే పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి జపాన్ నుంచి అమెరికా వరకు వచ్చిన గుర్తింపు ఈసారి ఉపయోగపడనుంది. మహేష్‌కు తెలుగులో ఉన్న స్టార్‌డమ్ ఒకవైపు ఉంటే, రాజమౌళి పేరు పాన్ వరల్డ్ లో ఉంది. అందుకే సినిమాకు బయట కూడా ముందే క్రేజ్ వచ్చేలా చేస్తోంది. డబ్బింగ్ పనులు కూడా ముందుగానే మొదలయ్యాయి.

రాకాకు మరో అడ్వాంటేజ్ ఉంది. అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాలతో హిందీలో మంచి మార్కెట్ వచ్చింది. అట్లీకి జవాన్ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పేరు పెరిగింది. ఒకరికి తెలుగు, హిందీ మార్కెట్ ఉంటే.. మరొకరికి తమిళం, హిందీలో మంచి గుర్తింపు ఉంది. దీపికా పదుకొణె కూడా ఉండటంతో ఉత్తరాదిలో సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని కొంత తగ్గుతుంది. ఇక చైనా జపాన్ లాంటి దేశాల్లో కూడా లోకల్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా అక్కడి భాషలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కొత్త భాషలో సినిమా రిలీజ్ చేయడం అంటే డబ్బింగ్‌తో పని అయిపోదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్‌ను సెట్ చేయాలి, స్థానికంగా ప్రమోషన్స్ చేయాలి, థియేటర్లలో సరైన స్క్రీన్స్ దక్కాలి. ముఖ్యంగా బెంగాలీ లాంటి కొత్త మార్కెట్‌లో ఫౌజీకి ఈ పని రిలీజ్ దగ్గరపడిన తర్వాత మొదలవుతుంది. వారణాసికి భాషల సంఖ్య చాలా ఎక్కువ కావడంతో డబ్బింగ్ పనులను ఏడాది ముందే మొదలుపెట్టాల్సి వస్తోంది.

ఈ ప్లాన్స్‌లో ముందుగా పరీక్షకు దిగేది ఫౌజీ బెంగాలీ వెర్షన్. అక్కడ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వారణాసికి మాత్రం రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో ఒక్కో దేశానికి సంబంధించిన వెర్షన్లు ఒక్కో ప్లాన్ ప్రకారం సిద్ధమవుతున్నాయి. రాకా విషయంలో చైనా, జపాన్ రిలీజ్‌లపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చే సమయానికి తెలుగు సినిమా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.