సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు అందరికీ ఇబ్బందే!
టాలీవుడ్‌లో సంక్రాంతి అనేది అత్యంత లాభదాయకమైన రేస్. ప్రభాస్ వంటి పాన్-ఇండియా స్టార్ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తే? ఇతర పెద్ద సినిమాల విడుదల తేదీలు మారక తప్పదు.
By: Srikanth Kontham | 10 Sept 2026 7:00 AM ISTప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `ఫౌజీ` విడుదల తేదీపై ఓ ఆసక్తిర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తేదీ మారితే గనుక రాబోయే పెద్ద సినిమాల షెడ్యూళ్లు .. పండుగ సీజన్లపై దాని తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. `ఫౌజీ` డిసెంబర్ నుంచి వాయిదా పడితే దాని ప్రభావం మొదటగా పడేది సంక్రాంతి సీజన్‌పైనే.
టాలీవుడ్‌లో సంక్రాంతి అనేది అత్యంత లాభదాయకమైన రేస్. ప్రభాస్ వంటి పాన్-ఇండియా స్టార్ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తే? ఇతర పెద్ద సినిమాల విడుదల తేదీలు మారక తప్పదు. దీంతో 2027 సంక్రాంతి రేస్‌లో ఉండాలనుకున్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు థియేటర్ల సర్దుబాటు కోసం ప్లాన్స్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పుల ప్రభావం 2027 మార్చి నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ `స్పిరిట్` ను మార్చి 5న విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.
ఒకవేళ `ఫౌజీ` విడుదల ఆలస్యమైతే? ఆ ప్రభావం `స్పిరిట్` ప్రమోషన్లు , నిర్మాణ షెడ్యూళ్లపై పడి ఆ సినిమా విడుదల కూడా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఒకే హీరో రెండు భారీ చిత్రాలు అతి తక్కువ వ్యవధిలో రావడం వ్యాపారపరంగా సాధ్యం కాదు కాబట్టి ఈ చిక్కులు తప్పవు. దీంతో పాటు 2027 సమ్మర్ రిలీజ్ ప్లాన్స్ కూడా పూర్తిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా టాలీవుడ్ పెద్ద సినిమాలు వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ డేట్లను ముందే లాక్ చేసుకుంటాయి.
`ఫౌజీ`, `స్పిరిట్` వంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ల విడుదల తేదీలు మారితే? ఆ ప్రభావంతో ఇతర టాలీవుడ్ స్టార్ హీరోల సమ్మర్ సినిమాలు కూడా విడుదల తేదీలను పునపరిశీలించుకోవాల్సి వస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల మధ్య భారీ పోటీ ..అనవసరమైన క్లాష్ ఏర్పడుతుంది.
సినిమా విడుదల తేదీ అనేది ఒక చిత్రానికి మాత్రమే పరిమితం కాదు. పరిశ్రమలోని ఇతర ప్రాజెక్ట్‌ల బిజినెస్, ఓవర్సీస్ రైట్స్, థియేట్రికల్ అగ్రిమెంట్లపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రభాస్ స్థాయి ఉన్న నటుడి సినిమా డేట్ మారితే దాని ఆధారంగా ప్లాన్ చేసుకున్న మిగతా ప్రాంతీయ , పాన్-ఇండియా చిత్రాల నిర్మాతలు వ్యూ హాలను మార్చుకోక తప్పదు. ఇది డిస్ట్రిబ్యూషన్ రంగానికి కూడా పెద్ద సవాలుగా మారుతుంది.
`ఫౌజీ` డిసెంబర్ 3న అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తేనే అంతా సజావుగా సాగుతుంది. ఇందులో ఏ చిన్న మార్పు జరిగినా? అది 2027 సంక్రాంతి నుంచి వేసవి వరకు లైన్‌లో ఉన్న ప్రతి పెద్ద సినిమా విడుదలపై డొమినో ఎఫెక్ట్‌లా పడుతుంది. ఈ నేపథ్యంలో `ఫౌజీ` టీమ్ విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని పరిశ్రమతో పాటు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
