Begin typing your search above and press return to search.

ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స‌వాల్ ఈ పాత్ర‌తోనే!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, వైవిధ్యభరితమైన‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఫౌజి`.

By:  Sivaji Kontham   |   19 Jun 2026 8:15 AM IST
ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స‌వాల్ ఈ పాత్ర‌తోనే!
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, వైవిధ్యభరితమైన‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఫౌజి`. ఈ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగుతుండటం, విడుదల తేదీ విషయంలో ఇప్పటివరకు సరైన స్పష్టత లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు మేకర్స్‌పై చాలా సీరియస్‌గా ఉన్నారు. అయినా ఇంకా రిలీజ్ తేదీపై ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డలేదు.

ఇంత‌లోనే డార్లింగ్ త‌న కాల్షీట్ల‌ను పూర్తిగా సందీప్ వంగా `స్పిరిట్‌` కోసం కేటాయించార‌ని ప్ర‌చార‌మైంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం వంగా త‌న ఏర్పాట్ల‌లో తాను ఉన్నాడు. అయితే ఇంత‌లోనే ప్ర‌భాస్ ఒక కొత్త నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. అత‌డు కొన్ని నెలల పాటు తన ప్రాజెక్ట్‌ల ప్రాధాన్యతలను మార్చుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ని `స్పిరిట్` కొత్త షెడ్యూల్ ను ప్రారంభించడానికి ముందే `ఫౌజి` చిత్రాన్ని పూర్తిగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడ‌ట‌. అందుకోసం దాదాపు మూడు నెలల సమయాన్ని పూర్తిగా `ఫౌజి` షూటింగ్‌కే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుండి మార్చి మధ్య జరిగిన షెడ్యూల్స్‌లోనే ప్రభాస్ దాదాపు 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా ఒకే పట్టున పూర్తి చేసి... అనుకున్నట్లుగా డిసెంబర్ విడుదలకు సినిమాను సిద్ధం చేయాలనేది ప్రభాస్ ప్లాన్.

1945 కాలం నాటి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. కేవలం లార్జర్ దేన్ లైఫ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌కే పరిమితం కాకుండా... ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్టమైన.. విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రగా దీనిని హను రాఘవపూడి డిజైన్ చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం ఒక సైనికుడి జీవితంలో ఎదురైన వివిధ దశలు, ఎమోష‌న‌ల్ గ్లిచెస్, వ్య‌క్తిగా అంతర్గత పరిణామ క్రమాన్ని ఈ కథలో చూపించబోతున్నారు. శారీరక శ్రమతో పాటు ఎంతో మానసిక ప‌రిపక్వతతో కూడిన నటనను ఈ పాత్ర‌లో ప్ర‌దర్శించాల్సి ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్న పాత్ర ఇద‌ని చెబుతున్నారు.

ఇటీవల వచ్చిన దేవర, పెద్ది వంటి భారీ చిత్రాలలో లవ్ ట్రాక్స్ కథకు సంబంధం లేకుండా బలవంతంగా ఇరికించినట్లు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అయితే హను రాఘవపూడి `సీతా రామం` తరహాలోనే `ఫౌజి`లో కూడా కథలో లీనమైపోయే ఒక అద్భుతమైన, మనసుకు హత్తుకునే ప్రేమకథను చూపించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో ప్రేమ అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ లాగా కాకుండా కథలో అంతర్భాగంగా సాగుతుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ డ్యాన్సర్, సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి కథానాయికగా వెండితెరకు పరిచయమవుతుండగా... ప్రభాస్-ఇమాన్విల స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి.

షెడ్యూల్స్ మధ్య గ్యాప్ రావడంతో పాత్రలోని మూడ్ దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభాస్ మరే ఇతర ప్రాజెక్ట్ వైపు చూడకుండా `ఫౌజి``ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత అద‌నపు బ‌లం. యాక్షన్, ఎమోషన్, రోమాన్స్ సమపాళ్లలో కుదిరిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాల‌నేది ప్లాన్. తాజా గుస‌గుస‌ల ప్రకారం.. రిలీజ్ తేదీని త్వ‌ర‌లోనే రివీల్ చేస్తారు. అయితే సినిమా నాణ్య‌త ఏమాత్రం చెడ‌కుండా ప‌క‌డ్భంధీగా ప్ర‌తిదీ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.