Begin typing your search above and press return to search.

నచ్చకపోయినా కొన్నిసార్లు రాజీ పడక తప్పదు!

మనకు నచ్చకపోయినా కొన్నిసార్లు పరిస్థితిని బట్టి రాజీ పడక తప్పదు అంటూ బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలు సంచంల‌నంగా మారాయి.

By:  Srikanth Kontham   |   26 Sept 2026 12:00 AM IST
నచ్చకపోయినా కొన్నిసార్లు రాజీ పడక తప్పదు!
X

గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయే తారల జీవితాలు బయట నుంచి రంగులమయంగా క‌నిపించినా? దాని వెనుక అనేక ఆర్థిక సవాళ్లు, వృత్తిపరమైన రాజీలు దాగి ఉంటాయనేది పచ్చి నిజం. మనకు నచ్చకపోయినా కొన్నిసార్లు పరిస్థితిని బట్టి రాజీ పడక తప్పదు అంటూ బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ చేసిన వ్యాఖ్యలు సంచంల‌నంగా మారాయి. తెరపై ఎన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించినా? సినీ పరిశ్రమలోని ఆర్థిక వాస్తవాలు, పరిమితుల వల్ల నటీనటులు ఏమాత్రం ఇష్టం లేని ప్రాజెక్టులను కూడా చేయాల్సి వస్తుందని నిర్మొహమాటంగా వెల్లడించారు.

తమకంటూ సొంత‌ ప్రాధాన్యతలు, కళాత్మక అభిరుచులు ఉన్నప్పటికీ జీవనోపాధి కోసమే నచ్చని పాత్రలను అంగీకరించాల్సి వస్తుందని ఫాతిమా ఓపెన్‌గా చెప్పారు. `మేము సంపన్న కుటుంబాల నుంచి రాలేదు. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కేవలం నటులమే తప్ప సినిమాలకు కోట్లు ఖర్చుపెట్టే నిర్మాతులం కాదు` అంటూ సినీ రంగానికి సంబంధించిన ఆర్థిక చేదు నిజాలను బయటపెట్టారు. చేతిలో ఉన్న తక్కువ అవకాశాల్లోనే ఉత్తమమైనదాన్ని ఎంచుకుంటూ ముందడుగు వేయక తప్పదని, పరిశ్రమలో టైమింగ్ వరుస విజయాలే అవకాశాల సంఖ్యను నిర్ణయిస్తాయన్నారు.

హిందీ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులకు లభించే పాత్రల పరిమితుల గురించి కూడా ఫాతిమా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పురుష నటులకు నటనలోని పూర్తి స్థాయి నైపుణ్యాన్ని చూపించడానికి అనేక అవకాశాలు దక్కుతాయని, కానీ మహిళల విషయానికి వచ్చేసరికి లోతైన, విభిన్నమైన కోణాలున్న పాత్రలు చాలా అరుదుగా లభిస్తాయన్నారు. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబమని పేర్కొంటూ సమాజంలో ఉన్నట్లే సినిమాల్లోనూ లింగ ఆధారిత పాత్రల పరిమితులు స్పష్టంగా ఉంటాయని విశ్లేషించారు.

సినిమాల్లో మహిళా పాత్రలను చిత్రీకరించే తీరుపై మాట్లాడిన ఫాతిమా నెగెటివ్ లేదా కాంప్లెక్స్ ఛాయలున్న పాత్రల విషయంలో పరిశ్రమ ఇంకా పాత మూస ధోరణుల్లోనే ఉండిపోయిందని అభిప్రాయపడ్డారు. పురుషులకు లభించినట్లుగా సంక్లిష్టమైన, గందరగోళంతో కూడిన సాధారణ మహిళా పాత్రలను హుందాగా చూపించే స్థాయికి బాలీవుడ్ ఇంకా చేరుకోలేదన్నారు. నలుపు-తెలుపుల మధ్య ఉండే సాధారణ మానవ స్వభావాన్ని మహిళా పాత్రల్లో ఆవిష్కరించే ప్రయత్నాలు మరింత ఎక్కువగా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫాతిమా ష‌నా షేక్ తాజా ప్రాజెక్టు విషయానికి వస్తే జియోహాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న `హుంకార్`వెబ్ సిరీస్‌లో ఫాతిమా ఏసీపీ జస్లీన్ సింగ్ సోయిన్ అనే పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించారు. ఒక ఆధ్యాత్మిక గురువుపై పాఠశాల విద్యార్థిని చేసే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సిరీస్ కథాంశం సాగుతుంది. ఈ కేసును నిర్భయంగా దర్యాప్తు చేసే పోలీస్ అధికారిగా ఫాతిమా నటనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి.