నటి టబు నటవారసుడు ఆరంగేట్రం?
భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి టబు, ఇప్పుడు తన కుటుంబం నుండి మరో నటవారసుడిని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
By: Sivaji Kontham | 26 April 2026 5:01 PM ISTభారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి టబు, ఇప్పుడు తన కుటుంబం నుండి మరో నటవారసుడిని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. టబు సోదరి ఒకప్పటి ప్రముఖ నటి ఫరా నాజ్ కుమారుడు `ఫతే రంధవా` త్వరలోనే హీరోగా అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో టబు - ఫతే కలిసి దిగిన సెల్ఫీలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తుండటమే కాకుండా.. ఫతే లుక్స్ కూడా ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన ఆకర్షణతో ఉండటంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫతే రంధవా మరెవరో కాదు.. నటి ఫరా నాజ్ - సీనియర్ నటుడు విందు దారా సింగ్ కుమారుడు. అంటే లెజెండరీ నటుడు దారా సింగ్ మనవడు కూడా. ఫతే గత కొంతకాలంగా నటనలో శిక్షణ పొందుతున్నాడని.. త్వరలోనే ఒక బయోపిక్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించబోతున్నాడని సమాచారం. ఈ బయోపిక్ తన తాత గారైన ప్రముఖ రెజ్లర్ కం నటుడు దారా సింగ్ జీవితకథతో తెరకెక్కనుందని కథనాలొచ్చాయి.
టబు స్వయంగా తన అక్క కుమారుడి కెరీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.. ప్రస్తుతం బయోపిక్ లో నటిస్తున్న అతడి కోసం సరైన కథలు, దర్శకుల కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కరణ్ జోహార్ వంటి అగ్ర నిర్మాతల సినిమాల్లో ఫతే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా మెళకువలు నేర్చుకున్నట్లు టాక్.
టబు - ఫరా నాజ్ సోదరీమణుల గురించి చెప్పుకోవాలంటే వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందినవారు. టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. వీరి కుటుంబానికి సినిమా నేపథ్యం ఉన్నా.. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్న టబు ఆ తర్వాత ముంబైకి మారి సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మరోవైపు ఫరా నాజ్ 80వ దశకంలో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగారు. రిషి కపూర్ వంటి స్టార్లతో నటించి మెప్పించారు. ఈ సిస్టర్స్ ఇద్దరికీ హైదరాబాద్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. వీరి కుటుంబం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివసిస్తుండటంతో షూటింగ్‌ల నుండి విరామం దొరికితే టబు ఇక్కడికే వస్తుంటారు.
ప్రస్తుతం ఫరా నాజ్ తన కుమారుడు ఫతేతో కలిసి ముంబైలోనే నివసిస్తున్నారు. ఫరా తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమై కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. అయితే తన కుమారుడిని మాత్రం ఒక గొప్ప నటుడిగా చూడాలని టబు ఆశిస్తున్నారు. ఫతే కూడా తన తల్లి - పిన్ని (టబు) వారసత్వాన్ని కాపాడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలతో ఉన్నారు. టబుకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు, అనుభవం ఫతే కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి టబు మేనల్లుడు ఫతే రంధవా వెండితెర అరంగేట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టబు వంటి అద్భుతమైన నటి పర్యవేక్షణలో రాబోతున్న ఈ నటవారసుడు.. అటు దారా సింగ్ పౌరుషాన్ని.. ఇటు ఫరా-టబుల నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శిస్తారో చూడాలి. ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే.. త్వరలోనే మనం మరో పాన్-ఇండియా స్టార్‌ను చూసే అవకాశం ఉంది. టబు తన సోదరి కుమారుడిని ఒక పక్కా ప్రణాళికతో బరిలోకి దించుతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టబు, తన సోదరి కుమారుడు సెల్ఫీలతో బిజీగా ఉన్న ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఫతే రంధవాకు ఒక పర్ఫెక్ట్ హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు.
