దర్శకత్వం అజెండా.. చిట్టి ఫరియా కల నెరవేరుతుందా?
సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన `సిగ్మా` సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమవుతున్న యువ నటి ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
By: Sivaji Kontham | 26 Sept 2026 8:55 AM ISTసందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన `సిగ్మా` సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమవుతున్న యువ నటి ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో దర్శకత్వంపై తన ఆసక్తి గురించి చెప్పిన మాటలు సినీ వర్గాల్లో- అభిమానులలో చర్చగా మారాయి.
తమిళంలో తాను నటిస్తున్న తొలి చిత్రం `సిగ్మా` మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్న ఫరియా.. ఈ ప్రాజెక్ట్ తర్వాత తమిళ పరిశ్రమ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని.. సినిమా విడుదలైన తర్వాతే తదుపరి ప్రాజెక్ట్‌లపై ఒక స్పష్టతకు వస్తానని పేర్కొన్నారు.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల మధ్య అనుభవాలను షేర్ చేస్తూ.. రెండు ఇండస్ట్రీలు దాదాపు ఒకేలా ఉన్నాయని, కేవలం ఆహారపు అలవాట్లలో మాత్రమే కొంత తేడా కనిపిస్తోందని ఫరియా అన్నారు. అయితే తన మొదటి తమిళ చిత్రమే ఇంత మంచి ప్రాజెక్ట్ కావడం ఎంతో ఆనందాన్నిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
నటిగా కెరీర్ సాగిస్తూనే.. తనకు దర్శకత్వంపై కూడా తీవ్రమైన ఆసక్తి ఉందని ఫరియా అబ్దుల్లా స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను కొన్ని కథలు సిద్ధం చేస్తున్నానని.. అయితే మెగాఫోన్ పట్టడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో తాను దర్శకత్వం వహిస్తే.. ఆ చిత్రంలో కచ్చితంగా తానూ ఒక నటిగా కనిపిస్తానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
టాలీవుడ్‌లో విజయ నిర్మల, బి. జయ, నందిని రెడ్డి వంటి ప్రతిభావంతులైన మహిళా దర్శకురాళ్లు రాణించినా ఇండస్ట్రీలో మహిళా దర్శకుల సంఖ్య ఇప్పటికీ తక్కువే. అయితే భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికలుగా గుర్తింపు పొంది, ఆ తర్వాత సక్సెస్ ఫుల్ దర్శకులుగా మారిన మేటి నటీమణులను తాను స్ఫూర్తిగా తీసుకుంటున్నానని ఫరియా చెబుతున్నారు. మరి ఈ బ్యూటీ కల ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.
