Begin typing your search above and press return to search.

త్రిష- ఇలియానా చూస్తున్నారా ఇది.. తెలుగ‌మ్మాయ్ త‌మిళ కోలాహాలం వారెవ్వా!

చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నటిస్తున్నా స్థానిక భాషలపై పట్టు సాధించడం తక్కువగా చూస్తుంటాం.

By:  Sivaji Kontham   |   19 Sept 2026 1:23 PM IST
త్రిష- ఇలియానా చూస్తున్నారా ఇది.. తెలుగ‌మ్మాయ్ త‌మిళ కోలాహాలం వారెవ్వా!
X

తన ప్రత్యేకమైన అందం- నటనతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న తెలుగ‌మ్మాయి ఫరియా అబ్దుల్లా తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న `సిగ్మా` (SIGMA) ఆడియో - ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా అందరినీ ఆశ్చర్యపరుస్తూ పూర్తిగా తమిళంలో మాట్లాడి వేదిక‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నటిస్తున్నా స్థానిక భాషలపై పట్టు సాధించడం తక్కువగా చూస్తుంటాం. ఉదాహరణకు త్రిష, ఇలియానా లాంటి ప్రముఖ నటీమణులు టాలీవుడ్‌లో సంవత్సరాల తరబడి నటించినా పూర్తిగా తెలుగు నేర్చుకోలేకపోయారు. కానీ కోలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా మొద‌టి సినిమాతోనే ఆక‌ట్టుకుంటోంది. త‌మిళ‌ భాషను ఎంత చక్కగా.. స్పష్టంగా మాట్లాడటం నేర్చుకుందో ఈ వేదిక‌పై చూసి అందరూ ఫిదా అయ్యారు.

అసలు ప‌రాయి భాష అయిన తమిళంలో ఫరియా ఎంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడిందో వేదికపై స్పష్టంగా కనిపించింది. వేదికపై మాట్లాడేటప్పుడు త‌ను చూపించిన చొరవ.. తమిళ ఉచ్ఛారణ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్కరన్‌ను ఉద్దేశించి సరదాగా `లవ్వా సుభాష్కరన్` అంటూ చేసిన చిన్న క్యూట్ కామెంట్స్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు, త‌మిళ‌ ప్రేక్షకులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్ఏనాయి. ఫ‌రియా చిట్టి మాట‌లు చిత్ర యూనిట్‌ను కూడా నవ్వించాయి.

డెబ్యూ దర్శకుడు జాస‌న్ సంజయ్ గురించి, అలాగే తన సహ నటుల గురించి మాట్లాడిన ఫరియా సెట్‌లో తమ మధ్య జరిగిన సరదా ముచ్చట్లు, అనుభవాలను తమిళ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత తమకు ఎంత బాధగా అనిపించిందో చెబుతూ వీలైతే వెంటనే `సిగ్మా 2` కూడా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. తమిళ భాషపై పట్టు లేకపోయినా.. ఈ వేడుక కోసం ఫ‌రియా ఎంతగా ప్రిపేర్ అయ్యి వచ్చిందో త‌న‌ మాటల్లోని స్పష్టతే తెలియజేస్తోంది.

పరభాషలో అడుగుపెడుతూ అక్కడి స్థానిక ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఫ‌రియా అబ్ధుల్లా పడిన తపన- వేదికపై ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం నిజంగా ప్రశంసనీయం. తెలుగు మూలాలున్న ఓ నటి, కోలీవుడ్ గడ్డపై ఇలా అలవోకగా తమిళంలో ప్రసంగించి పంచ్‌లతో రాష్ట్రాన్ని షేక్ చేస్తూ అందరి హృదయాలను గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా తమిళంలోనూ తనదైన ముద్ర వేయడం ఖాయమని ఈ ఈవెంట్ స్పష్టం చేసింది. జాతిర‌త్నాలు బ్యూటీ తెలుగులో వ‌ర‌స చిత్రాల్లో న‌టిస్తూ ప్ర‌భాస్ అంత‌టి స్టార్ నే మురిపించింది. మునుముందు తెలుగు - త‌మిళంలో అగ్ర హీరోల స‌ర‌స‌నా ఈ బ్యూటీ న‌టించాల‌ని ఆకాంక్షిద్దాం.