సినిమానే నన్ను ప్రమోట్ చేస్తుంది.. నాకు బౌండరీలు లేవు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Sept 2026 3:10 PM ISTజాతిరత్నాలులో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫరియా అబ్దుల్లా.. ఆ తర్వాత వరుసగా విభిన్నమైన ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా తనకు నచ్చిన క్యారెక్టర్లు, డైరెక్టర్ల, కథలు, ప్రొడక్షన్ హౌసులను బట్టి సినిమాలు ఎంచుకుంటున్నానని ఆమె చెబుతోంది. తాజాగా తమిళంలో సిగ్మా సినిమాతో ఫరియా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిగ్మా కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదని ఫరియా అంటోంది. ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తూ, సెలబ్రేట్ చేస్తున్నారని ఆమె చెప్పింది. ఈ సినిమా కోసం జాసన్ సంజయ్ తనను సంప్రదించిన విధానం కూడా ఆసక్తికరంగా ఉందని తెలిపింది. జూమ్ కాల్‌లో కథ చెప్పినప్పుడు.. అసలు తనను ఎందుకు ఎంపిక చేశారని అడిగితే జాతిరత్నాలు చూసినప్పటి నుంచి తనతో వర్క్ చేయాలని అనుకున్నట్టు సంజయ్ చెప్పారని ఫరియా వెల్లడించింది. అయితే మొదట సంజయ్ వయసు 24 ఏళ్లేనా అనే డౌట్ తనకు వచ్చిందని, అంత చిన్న వయసులో అతని మెచ్యూరిటీ చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. కథ విన్న వెంటనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని, పైగా లైకా ప్రొడక్షన్స్ వంటి సంస్థతో పనిచేసే అవకాశం రావడంతో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపింది.
తన కెరీర్‌లో ఒకే తరహా సినిమాలకు పరిమితం కావడం ఇష్టం లేదని ఫరియా స్పష్టం చేసింది. ప్రతి ప్రాజెక్ట్‌కు ఏదో ఒక ప్రత్యేక కారణంతో వెళ్తానని.. ఒకసారి హీరో కోసం, మరోసారి డైరెక్టర్ కోసం, ఇంకోసారి మ్యూజిక్ డైరెక్టర్ లేదా కథ కోసం సినిమా చేస్తానని చెప్పింది. తనకు తాను ఎలాంటి బౌండరీలు పెట్టుకోవాలనుకోవడం లేదని వెల్లడించింది. సిగ్మాలో తన క్యారెక్టర్ లో ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయని, కామెడీ కాస్త తక్కువగా ఉండటంతో పాటు క్యారెక్టర్ బోల్డ్‌గా ఉంటుందని చెప్పింది. తమిళ పరిశ్రమలోకి ఇప్పుడే అడుగుపెట్టినందున కల్చరల్ డిఫరెన్సెస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం కావాలని, అయితే తేడాల కంటే సిమిలారిటీస్‌నే ఎక్కువగా గమనించానని తెలిపింది. చెన్నై తనకు హోమ్‌లా అనిపించిందని చెప్పిన ఫరియా.. తమిళంలో రూటెడ్ కథలు చేయాలనే ఆసక్తి కూడా ఉందని వెల్లడించింది.
ఇక సందీప్ కిషన్‌తో తనకు ముందే పరిచయం ఉందని ఫరియా తెలిపింది. ఇద్దరూ కలిసి ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్ ను హోస్ట్ చేశామని, సందీప్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పింది. ఎవరికైనా సమస్య వస్తే ఫీల్ అవ్వొద్దు.. నేను ఉన్నానంటూ అండగా నిలబడే వ్యక్తి అని పేర్కొంది. ఇక రాజమౌళితో సిగ్మా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఇంటరాక్షన్ కూడా ప్లాన్ చేసినది కాదని ఫరియా తెలిపింది. ప్రేక్షకులు చూసిన వీడియోలో ఉన్నదే అక్కడ జరిగిందని, ప్రత్యేకంగా ఏదీ ముందుగా ప్లాన్ చేయలేదని చెప్పింది.
తన కెరీర్‌లో ఇప్పటివరకు నేర్చుకున్న అతిపెద్ద విషయం యస్ చెప్పడం అని ఫరియా చెప్పింది. అదే సమయంలో సినిమాల ఎంపికలో తనను ఎగ్జైట్ చేసే ఒక్క అంశం కనిపించినా ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతానని తెలిపింది. ప్రతి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి కారణం.. ఆ సినిమాను తన ప్రాజెక్ట్‌గా భావించడమేనని, రిలీజ్ అయ్యే వరకు దానికి సంబంధించిన ప్రతి పనిలో భాగం కావడం తన బాధ్యతగా భావిస్తానని చెప్పింది. అయితే సిగ్మా విషయంలో మాత్రం తాను సినిమాను ప్రమోట్ చేయడం కంటే సినిమానే తనను ఎక్కువగా ప్రమోట్ చేస్తుందని ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది ఫరియా.
హీరోయిన్లకు వరుస ఫ్లాపులు వస్తే ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ చేయడంపై కూడా ఫరియా స్పందించింది. అలాంటి మాటలు తనకు చాలా కామెడీగా అనిపిస్తాయని చెప్పింది. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ప్రతి ఒక్కరి కెరీర్‌లో సహజమేనని, ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సక్సెస్ ఇచ్చే హై మరింత ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇక చిన్నప్పుడు సింగింగ్ నేర్చుకున్నానని, ఖాళీ దొరికితే మైక్ వదలనని చెప్పిన ఫరియా.. ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి తనను తాను సింగర్‌గా చెప్పుకోనని స్పష్టం చేసింది. సిగ్మాలో తాను పాట పాడే అవకాశం మిస్ అయిందని, అయితే సినిమాలో వచ్చే ర్యాప్ సాంగ్ చాలా బాగుంటుందని చెప్పింది.
థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవమే తన కామెడీ టైమింగ్‌కు కారణమని ఫరియా తెలిపింది. జాతిరత్నాలులోని చిట్టి పాత్రతో ప్రేక్షకుల్లో తనకు ఏర్పడిన గుర్తింపు ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పింది. బయట ఎక్కడ కనిపించినా చాలామంది తనను చూసి ముందుగా నవ్వుతారని, ఆ తర్వాతే ఫోటో అడుగుతారని సరదాగా చెప్పింది. ఇక సోషల్ మీడియాను ఇటీవలే ఎక్కువగా ఉపయోగిస్తున్నానని, అందరినీ దృష్టిలో పెట్టుకుని కాకుండా తనకు నచ్చిన విధంగా మాత్రమే అక్కడ మాట్లాడతానని తెలిపింది. అవసరమైనప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతానని, సోషల్ మీడియా మంచి వేదిక మాత్రమే కాకుండా ఆదాయాన్ని కూడా అందించే మీడియం అని పేర్కొంది. ఇక సిగ్మా తర్వాత తన నెక్ట్స్ మూవీ భగవంతుడు చాలా భిన్నంగా ఉండబోతోందని, ఆ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ఫరియా చెప్పింది.
