Begin typing your search above and press return to search.

డాన్ పాత్ర‌లో ప్ర‌యోగం.. పండిట్ ర‌విశంక‌ర్ పాత్ర‌లోకి ప‌ర‌కాయం!

బాలీవుడ్ లో ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే ద‌ర్శ‌క‌న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్. అత‌డు ఇప్ప‌టికే కెరీర్‌లో చాలా ప్ర‌యోగాలు చేసాడు.

By:  Sivaji Kontham   |   25 Feb 2026 8:30 AM IST
డాన్ పాత్ర‌లో ప్ర‌యోగం.. పండిట్ ర‌విశంక‌ర్ పాత్ర‌లోకి ప‌ర‌కాయం!
X

బాలీవుడ్ లో ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే ద‌ర్శ‌క‌న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్. అత‌డు ఇప్ప‌టికే కెరీర్‌లో చాలా ప్ర‌యోగాలు చేసాడు. ఇప్పుడు డాన్ 3లో గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. అంత‌కుముందే, మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచేందుకు అభిమానుల ముందుకు వ‌స్తున్నాడు. ఫర్హాన్ అఖ్తర్ తన హాలీవుడ్ అరంగేట్రం కోసం ఎంచుకున్న పాత్ర చాలా ప్రతిష్టాత్మకమైనద‌ని తెలుస్తోంది. పండిట్ రవిశంకర్ లాంటి లెజెండరీ సంగీత విద్వాంసుడి పాత్రను అత‌డు పోషిస్తుండ‌టం చ‌ర్చ‌గా మారింది. ఒక విధ్వాంసుడి పాత్ర‌ను పోషించడం అంటే అది ఆషామాషీ కాదు. ఇది కేవలం ఒక పాత్ర కాదు.. ఒక గొప్ప వారసత్వాన్ని వెండితెరపైకి తీసుకురావడమే.

నిజానికి ఇది పండిట్ రవిశంకర్ బయోపిక్ కాదు కానీ ఇందులో ఆయ‌న‌ది కీలక పాత్ర. ఇది ప్రపంచ ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ `ది బీటిల్స్` చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'నాలుగు సినిమాల భారీ ప్రాజెక్ట్'. ఆస్కార్ అవార్డు గ్రహీత సామ్ మెండిస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాలుగు సినిమాలు బీటిల్స్ బ్యాండ్‌లోని నలుగురు సభ్యుల (జాన్ లెన్నాన్, పాల్ మాక్‌కార్ట్నీ, జార్జ్ హారిసన్, రింగో స్టార్) కోణంలో సాగుతాయి.

రవిశంకర్ పండిట్ జీ పాత్ర ఇందులో చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. బీటిల్స్ సభ్యుడు జార్జ్ హారిసన్ కు రవిశంకర్ జీ సంగీత గురువు.. ఆప్తమిత్రుడు. హారిసన్ సితార్ నేర్చుకోవడం, భారతీయ ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులు కావడంలో రవిశంకర్ పాత్ర కీలకం. అందుకే ఈ సినిమాలో ఆయన పాత్రను చాలా ఉన్నతంగా చూపిస్తున్నారు.

ఫర్హాన్ ఇప్పటికే ఈ పాత్ర కోసం తన ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఫర్హాన్ గిటార్ వాయించడంలో దిట్ట.. కానీ ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా `సితార్` నేర్చుకుంటున్నారు. రవిశంకర్ లోని గంభీరతను, ఆయనలోని ఆధ్యాత్మిక కోణాన్ని పట్టుకోవడానికి ఫర్హాన్ కృషి చేస్తున్నారు. పండిట్ రవిశంకర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు ..సినిమాలో కనిపించే అవకాశం ఉన్నవాటిని ప‌రిశీలిస్తే.. `బీటిల్స్` చరిత్రలో రవిశంకర్ పండిట్‌కి సంబంధించి కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి. అవి ఈ సినిమాలో కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. హాలీవుడ్ డైరెక్టర్ సామ్ మెండిస్ దర్శకత్వంలో నటించడం అంటే తన కల నిజమైనట్లు ఉందని ఫర్హాన్ పేర్కొన్నారు.

పాశ్చాత్య సంగీతాన్ని ప్ర‌భావితం చేసిన మేధావి:

1966లో జార్జ్ హారిసన్‌తో పండిట్ మొదటి సమావేశం ప్రపంచ సంగీత గమనాన్ని మార్చేసింది. జార్జ్ హారిసన్ మారువేషంలో ఇండియాకు వచ్చి రవిశంకర్ గారి వద్ద సితార్ నేర్చుకోవడం.. వారు శ్రీనగర్‌లోని హౌస్‌బోట్‌లో గడిపిన క్షణాలు ప్ర‌త్యేక‌మైన‌వి. కాన్సర్ట్ ఫర్ బంగ్లాదేశ్ (1971) అప్ప‌ట్లో సంచ‌ల‌నం. ప్రపంచంలోనే మొదటి భారీ చారిటీ కాన్సర్ట్ ఇది. రవిశంకర్ పండిట్ కోరిక మేరకు జార్జ్ హారిసన్ దీనిని నిర్వహించారు. ఇందులో రవిశంకర్ జీ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. రాక్ మ్యూజిక్‌లో సితార్ ధ్వనిని చొప్పించడం ద్వారా ఆయన పాశ్చాత్య సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేశారు.

2028లోనే రిలీజ్...

బీటిల్స్ లో మొద‌టి చిత్రం 2028లో విడుదల కానుంది. ఫర్హాన్ అఖ్తర్ ప్ర‌యోగాత్మ‌కంగా మిల్కా సింగ్ పాత్రలో ఎంతటి అద్భుతమైన నటన కనబరిచారో తెలిసిందే. ఇప్పుడు పండిట్ రవిశంకర్ పాత్రలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.