ఖాన్‌లనే కాదు కరణ్ జోహార్‌ని బెదిరించిన మాఫియా.. ఆఫీస్‌లో దాక్కునేవాడు!
ఆ కాలంలో అండర్‌వరల్డ్ మాఫియా ప్రభావం హిందీ చిత్ర పరిశ్రమపై ఎంత దారుణంగా ఉండేదో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
By: Sivaji Kontham | 16 March 2026 9:00 AM ISTబాలీవుడ్ లో 90వ దశకం అంటే కేవలం గ్లామర్ జిగ్ జాగ్ మాత్రమే కాదు.. చీకటి సామ్రాజ్యం నీడలు కూడా రాజ్యమేలేవి. ఆ కాలంలో అండర్‌వరల్డ్ మాఫియా ప్రభావం హిందీ చిత్ర పరిశ్రమపై ఎంత దారుణంగా ఉండేదో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కేవలం నటులనే కాకుండా.. కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న దర్శకులను కూడా మాఫియా వదల్లేదని ఫరా చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తన మొదటి సినిమా `కుచ్ కుచ్ హోతా హై` షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి ఫరా ఖాన్ వివరిస్తూ.. అది చాలా భయంకరమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ సినిమా విడుదల సమయంలో కరణ్ జోహార్‌కు అండర్‌వరల్డ్ నుండి బెదిరింపులు వచ్చాయని దీనివల్ల ఆయన ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో ప్రాణ భయంతో కరణ్ తన కార్యాలయంలో గడపవలసి వచ్చిందని.. బయటకు రావడానికే భయపడేవారని ఆనాటి పరిస్థితులను గుర్తు చేశారు.
కేవలం కరణ్ జోహార్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ అగ్ర హీరోలైన షారూఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ కూడా 90వ దశకంలో మాఫియా నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని ఫరా ఖాన్ వెల్లడించారు. ఖాన్ల త్రయానికి ఉన్న క్రేజ్ , మార్కెట్‌ను చూసి అండర్‌వరల్డ్ ముఠాలు వారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూసేవని అన్నారు. ఆ సమయంలో షూటింగ్ సెట్స్ వద్ద భారీ భద్రత ఉండేదని.. ఎప్పుడు ఎట్నుండి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితిలో వారు పని చేసేవారని ఫరా ఖాన్ వివరించారు.
షారూఖ్ ఖాన్ తన కెరీర్ ఎదుగుతున్న సమయంలో ఇలాంటి బెదిరింపులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని.. కానీ వ్యక్తిగతంగా అది అతడి కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఫరా పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. మొత్తం మీద బాలీవుడ్ అగ్ర తారలందరూ ఆ రోజుల్లో మాఫియా గుప్పిట్లో నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో కనిపించే విలన్ల కంటే నిజ జీవితంలో ఎదురైన ఈ ముఠా నాయకులు మరెంతో భయంకరంగా ఉండేవారని ఫరా తెలిపారు.
ఈ బెదిరింపుల వల్ల చిత్రాల విడుదల తేదీలు మార్చుకోవడం లేదా అడిగినంత సొమ్ము ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉండేవని వెల్లడించారు. ఒకవైపు సృజనాత్మకతతో సినిమాలు తీయాలని తపించే దర్శకులు.. మరోవైపు ప్రాణాల మీదకు తెచ్చే మాఫియా బెదిరింపుల మధ్య బాలీవుడ్ ఒక యుద్దాన్ని చూసిందని ఫరా ఖాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరణ్ జోహార్ లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఆ సమయంలో ఎంతటి ఆందోళన చెందారో ప్రత్యక్షంగా చూసినట్లు ఆమె చెప్పారు.
ప్రస్తుతం పరిస్థితులు మారినా కానీ.. ఆనాటి భయంకరమైన రోజులను తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుందని ఫరా ఖాన్ అన్నారు. బాలీవుడ్ చరిత్రలో అదొక బ్లాక్ చాప్టర్ అని.. అండర్‌వరల్డ్ నుండి వచ్చిన ఆ ముప్పును ఎదుర్కొని నిలబడబట్టే ఈరోజు ఈ స్టార్స్ ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్నారని ఆమె కొనియాడారు.
