గ్లోబ్ ట్రాటర్ కోసం సముద్రాలు దాటి 6817కి.మీల ప్రయాణం
దీనిని ఫ్యానిజం అనాలా? పిచ్చి ఫ్యానిజం అనాలా? సముద్రాలు దాటి, 12 గంటల పాటు దాదాపు 6817 కి.మీల దూరం విమాన ప్రయాణం చేసి. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అడుగుపెట్టాడు ఈ వీరాభిమాని.
By: Sivaji Kontham | 15 Nov 2025 5:56 PM ISTదీనిని ఫ్యానిజం అనాలా? పిచ్చి ఫ్యానిజం అనాలా? సముద్రాలు దాటి, 12 గంటల పాటు దాదాపు 6817 కి.మీల దూరం విమాన ప్రయాణం చేసి. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అడుగుపెట్టాడు ఈ వీరాభిమాని. అతడు అంత దూరం నుంచి దేని కోసం వచ్చాడు? అంటే `గ్లోబ్ ట్రాటర్` ఈవెంట్ కోసమట. ఈ మాట వినగానే గుండె ఝల్లుమనకుండా ఉంటుందా? ఈపాటి దానికోసం ఎంత ధనం, శ్రమ వృధా చేసాడు? ప్రయాణంలో ఎంతగా స్ట్రగుల్ అయ్యాడు? అంటూ ఆలోచిస్తున్నారు కొందరు...!
అంత దూరం నుంచి ఈవెంట్ కోసం వచ్చాడా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమా పిచ్చి, ఫేవరెట్ హీరోపై అభిమానం ఉండాలి కానీ, మరీ ఈ రేంజులోనా? అంటూ అంతా షాక్ తింటున్నారు. సాయంత్రం 7 గం.ల నుంచి రామోజీ ఫిలింసిటీలో జరగనున్న #గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పై హైప్ ఏ రేంజులో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ.
ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి భారీగా మహేష్ అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పుడు సముద్రాలు దాటుకుని ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఈ అభిమాని. సునీల్ అవుల అనే తెలుగు అభిమాని ఈ రాత్రి ఈ ఈవెంట్‌కు హాజరు కావడానికి కంగారూ దేశంలోని- పెర్త్ నుండి వచ్చాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
''పెర్త్ వీధుల నుంచి 12 గంటల విమాన ప్రయాణం..RFC హైదరాబాద్‌కు 6817 కిలోమీటర్ల ప్రయాణం చేసాను. జై బాబు, యువర్స్ ట్రూలీ మహేష్, #GlobeTrotter day'' అంటూ ఆనందం వ్యక్తం చేసాడు. అతడు ఈ విషయాన్ని షేర్ చేయగానే నెటిజనులు అతడి పిచ్చి ఫ్యానిజానికి ఆశ్చర్యపోయారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ స్పందిస్తూ.. ``ఒక తెలుగు మాత్రమే కనెక్షన్.. చాలా ఎమోషనల్ గా అనిపిస్తోంది.. ఆకాశం కూడా హద్దు కాదు`` అని సోషల్ మీడియాల్లో ప్రతిస్పందించారు.
నిజానికి ఇలా ఒక సినిమా ఈవెంట్ కోసం సముద్రాలు దాటి వందల కిలోమీటర్లు ప్రయాణించాలనే సాహసం ఇదే మొదటిసారి కావొచ్చు. అయితే గ్లోబ్ ట్రాటర్ సినిమాలో మహేష్ కూడా ఇలానే ప్రపంచ విహారయాత్రికుడిగా కనిపిస్తాడని కూడా గుసగుస ఉంది. బహుశా మహేష్ అభిమాని కూడా దానిని యాథృచ్ఛికంగా తన చర్యతో ప్రతిబింబించాడు. ఇక రాజమౌళి-మహేష్ కాంబినేషన్ మూవీకి ఉన్న క్రేజ్ ఏ రేంజులో ఉందో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఫ్యాన్స్ చెవులు కోసుకుంటున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా? ఎప్పుడెప్పుడు చూడాలా? అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కామెరూన్- అవతార్ 3, క్రిస్టోఫర్ నోలాన్ - ఇన్ సెప్షన్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నంత ఉత్కంఠ అందరిలోను ఉంది.
రాజమౌళి నుంచి ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలే వచ్చాయి. ఇకపై పాన్ వరల్డ్ సినిమాల వెల్లువ మొదలైంది. మహేష్ గ్లోబ్ ట్రాటర్ దీనికి ఆద్యం. ఈ రాత్రి #GlobeTrotter టైటిల్ ప్రకటన కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు రామోజీ ఫిలింసిటీకి విచ్చేసారు. వారందరి కోసం మహేష్ - రాజమౌళి టీమ్ బిగ్ ట్రీట్ ఇవ్వబోతోంది. మరికాసేపట్లో ఈవెంట్ అప్ డేట్ల కోసం ఇక్కడ వేచి చూడండి...
