Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ సినిమా అంటే పంట పండినట్లే

సినీ పరిశ్రమలో కొన్ని జానర్లు ఎప్పటికీ ఔట్ డేట్ అనిపించవు. ఏ కాలంలో అయినా ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి. వాటిలో ముందు వరుసలో చెప్పుకోవాల్సింది కుటుంబ కథా చిత్రాలనే.

By:  Garuda Media   |   8 July 2026 7:00 AM IST
ఫ్యామిలీ సినిమా అంటే పంట పండినట్లే
X

సినీ పరిశ్రమలో కొన్ని జానర్లు ఎప్పటికీ ఔట్ డేట్ అనిపించవు. ఏ కాలంలో అయినా ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి. వాటిలో ముందు వరుసలో చెప్పుకోవాల్సింది కుటుంబ కథా చిత్రాలనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర కథానాయకుడు ‘అత్తారింటికి దారేది’ లాంటి పక్కా ఫ్యామిలీ మూవీ చేస్తే ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. ఐతే అప్పుడప్పుడూ వీటి జోరు కొంచెం తగ్గినట్లు అనిపించినా.. ఆ జానర్లో ఒకట్రెండు సినిమాలు విజయవంతం అయితే మళ్లీ వాటి ఊపు పెరుగుతుంటుంది.

ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మళ్లీ ఫ్యామిలీ సినిమాల ఊపు పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగులో ఈ జానర్ సినిమాల పొటెన్షియాలిటీ ఏంటో చూపించిన ఘనత అనిల్ రావిపూడికే దక్కుతుంది. ఎఫ్-2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు లాంటి చిత్రాలతో అతను బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేశాడో తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఫ్యామిలీ సినిమాల ఊపు పెరిగింది. సంక్రాంతికి ఘనవిజయం సాధించిన నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రోజు సైతం ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలే.

ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద హిట్‌గా నిలిచిన ‘మా ఇంటి బంగారం’ కూడా పక్కా ఫ్యామిలీ మూవీనే. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడంతో ఆ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక తమిళంలో ‘బ్లాస్ట్’ అనే ఫ్యామిలీ టచ్ ఉన్న యాక్షన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తెలుగులోనూ ఒక మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ‘గట్టా కుస్తీ-2’ సైతం ఫ్యామిలీ సినిమాల సత్తా ఏంటో చాటిచెబుతోంది. వరుసగా కుటుంబ కథా చిత్రాలు విజయవంతం అవుతుండడంతో ఈ జానర్ మరింత ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో రానున్న ‘ఆదర్శ కుటుంబం’ కూడా ఇలాగే పెద్ద విజయవం సాధిస్తుందేమో చూడాలి.