Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీమ్యాన్ ఈ ఫ్యామిలీమ్యాన్ ఒక్క‌రేనా?

అయితే ఇప్పుడే శ్రీ‌కాంత్ తివారీ పాత్ర‌ను, ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది? ఇది అంద‌రికీ తెలిసిన క‌థే క‌దా? సంక్రాంతి బ‌రిలో మ‌ళ్లీ రిలీజ‌వుతోందా?

By:  Sivaji Kontham   |   10 Jan 2026 7:01 PM IST
ఆ ఫ్యామిలీమ్యాన్ ఈ ఫ్యామిలీమ్యాన్ ఒక్క‌రేనా?
X

'ఫ్యామిలీమ్యాన్' వెబ్ సిరీస్ ఇప్ప‌టికే మూడు సీజ‌న్లుగా వ‌చ్చి ప్ర‌జ‌ల్ని అల‌రించింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో మ‌నోజ్ భాజ్‌పాయ్ న‌ట‌న‌కు జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు కురిసాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ను ప్ర‌జ‌లు ఆద‌రించారు. అమెజాన్ ప్రైమ్ లో అత్య‌ధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ల‌లో ఒక‌టిగా ఇది రికార్డుల‌కెక్కింది.

ఈ సినిమాలో మ‌నోజ్ భాజ్ పాయ్ దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఎన్.ఐ.ఏ అధికారిగా న‌టించారు. అత‌డి పాత్ర పేరు శ్రీకాంత్ తివారీ. ఈ పాత్ర చుట్టూనే మొత్తం కథ తిరుగుతుంది. శ్రీకాంత్ తివారీ పాత్రలోని డ్యూయ‌ల్ షేడ్ సిరీస్ ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే సీరియ‌స్ ఆప‌రేష‌న్స్ తో పిచ్చెక్కిస్తుంది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర‌ను డీల్ చేసిన విధాన‌మే వేరే లెవ‌ల్. శ్రీకాంత్ తివారీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఏ)కి అనుబంధంగా పనిచేసే TASC (థ్రెట్ అనాలిసిస్ అండ్ స‌ర్వీలెన్స్ సెల్‌) అనే అత్యంత రహస్య విభాగంలో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తుంటాడు. దేశాన్ని ఉగ్రవాద దాడుల నుండి కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంటాడు. అదే స‌మ‌యంలో అత‌డు ఒక సాధారణ మధ్యతరగతి ఇంటి య‌జ‌మానిగాను క‌నిపిస్తాడు. బయటి ప్రపంచానికి, తన కుటుంబానికి మాత్రం అతడు ఒక సాధారణ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే క్లర్క్. సాధారణ ఆఫీసర్ గానే అంద‌రికీ కనిపిస్తాడు. భార్యతో గొడవలు, పిల్లల చదువులు, హోమ్ లోన్ వంటి మధ్యతరగతి సమస్యలతో సతమతమవుతుంటాడు. డిపార్ట్‌మెంట్ ఇచ్చే చాలీ చాల‌ని జీతంతోనే అత‌డు లైఫ్ రిస్కులు, ఫ్యామిలీతో రిస్కులు చేస్తూ ఇర్రిటేట్ అవుతుంటాడు. అత‌డి ఇర్రిటేష‌న్ నుంచి బోలెడంత ఫ‌న్ పుడుతుది.

అయితే ఇప్పుడే శ్రీ‌కాంత్ తివారీ పాత్ర‌ను, ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది? ఇది అంద‌రికీ తెలిసిన క‌థే క‌దా? సంక్రాంతి బ‌రిలో మ‌ళ్లీ రిలీజ‌వుతోందా? అనే సందేహం మీకు క‌లిగి ఉండొచ్చు. కానీ దానికి ఒక కార‌ణం ఉంది. ఈ సంక్రాంతి బ‌రిలో వ‌స్తున్న మెగాస్టార్ 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు' క‌థాంశం, చిరంజీవి పాత్ర‌ కూడా ఇంచుమించు ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ని త‌ల‌పిస్తోంద‌నేది ఒక గుస‌గుస‌. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ త‌ర‌హాలోనే శంక‌ర ప్ర‌సాద్ గారు ఒక ఎన్.ఐ.ఏ అధికారి. నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏజెంట్‌గా కనిపిస్తారు. అదే స‌మ‌యంలో అంద‌మైన భార్య‌, పిల్ల‌ల‌తో కూడా కొంత స‌త‌మ‌త‌మ‌వుతార‌ని గ‌త కొద్దిరోజులుగా మ‌నం వింటున్న‌, చూస్తున్న ఇంట‌ర్వ్యూలు వెల్ల‌డిస్తున్నాయి. సినిమా ట్రైలర్ ప్రకారం శంక‌ర‌ప్ర‌సాద్ గారి పాత్రలో రెండు వేర్వేరు కోణాలు ఉన్నాయి. ఒకవైపు దేశాన్ని కాపాడే గంభీరమైన భద్రతా అధికారిగా, మరోవైపు తన కుటుంబాన్ని ప్రేమించే సాదాసీదా మధ్యతరగతి వ్యక్తిగా (వంట చేయడం, ఇంటి పనులు చేయడం వంటి సరదా సన్నివేశాల్లో) చిరంజీవి కనిపిస్తారు. అదే స‌మ‌యంలో కొన్ని ఫ్యామిలీ క‌ల‌త‌లు కూడా 'ఫ్యామిలీమ్యాన్' శ్రీ‌కాంత్ తివారీ త‌ర‌హాలో ఎదుర్కొంటారేమో తెర‌పైనే చూడాలి. బ‌హుశా చిరంజీవి మ్యాన‌రిజం, అనీల్ రావిపూడి కామిక్ టైమింగ్ టేకింగ్ కార‌ణంగా ఇది పూర్తిగా ఒక వైవిధ్య‌మైన టోన్ తో ఎలివేట్ కావొచ్చేమో!

అనీల్ రావిపూడి తాజా ఇంట‌ర్వ్యూలో ఒక విష‌యం చెప్పారు. మెగాస్టార్ ఏజ్ కి త‌గ్గ పాత్ర‌లోనే ఇందులో న‌టించారు. శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారికి 9 ఏళ్ల పాప‌, 10-12 ఏళ్ల వ‌య‌సున్న పాప కూడా ఉన్నారు. ఇద్ద‌రు కుమార్తెలు. కానీ ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లో శ్రీ‌కాంత్ తివారీకి ఒక కొంటె కొడుకు, క‌న్నింగ్ కుమార్తె ఉన్నారు. గారాల కూతురుకు ఒక సీక్రెట్ ల‌వ‌ర్ కూడా ఉంటాడు. అది శ్రీ‌కాంత్ తివారీకి తెలిసాక మ‌రిగిపోతాడు. ల‌బ‌ల‌బా కొట్టుకుంటాడు! ఇక్క‌డ శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారికి ఫ్యామిలీలో అలాంటి సిట్యుయేష‌న్ ఏదైనా ఉంటుందా ఏమో కానీ, ఇప్ప‌టికైతే తెలీదు.

శ్రీ‌కాంత్ తివారీ త‌ర‌హాలో సీరియ‌స్ ఆప‌రేష‌న్ చేప‌డుతూనే, త‌న కుటుంబంతో ఇక్క‌ట్ల‌ను కూడా ఫ‌న్నీగా, ఎంట‌ర్ టైనింగ్ గా వ‌ర‌ప్ర‌సాద్ గారు కూడా డీల్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ అత్యంత స‌క్సెస్ ఫుల్ సిరీస్ కాబ‌ట్టి, అదే తీరుగా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు కూడా గ్రాండ్ స‌క్సెస్ కావాల‌నే మ‌నమంతా ఆకాంక్షిద్దాం. మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది.